Read more!

English | Telugu

రెండు సినిమాల్లో ప్రియ‌ద‌ర్శి విల‌న్‌గా న‌టించాడ‌ని మీకు తెలుసా?

 

ప్రియ‌ద‌ర్శి 'పెళ్లిచూపులు' సినిమాతో వెలుగులోకి వ‌చ్చాడు. హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రెండ్‌గా న‌టించిన అత‌ను, "నా సావు నేను స‌స్తా.. నీకెందుకు?" అనే డైలాగ్‌తో పాపుల‌ర్ ఐపోయాడు. ప్రియ‌ద‌ర్శి వాళ్ల నాన్న పులికొండ సుబ్బాచారి మంచి క‌వి మాత్ర‌మే కాదు, పీహెచ్‌డీ చేసి గౌర‌వ డాక్ట‌రేట్ పొందిన వ్య‌క్తి కూడా. ఆయ‌న‌ది ఖ‌మ్మం అయితే, ప్రియ‌ద‌ర్శి వాళ్ల‌మ్మ జ‌య‌మ్మ‌ది గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల‌. ప్రియ‌ద‌ర్శి పిడుగురాళ్ల‌లో పుట్టి, హైద‌రాబాద్‌లో పెరిగాడు. అప్ప‌ట్లో సుబ్బాచారి హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో ప‌నిచేసేవారు. ప్రియ‌ద‌ర్శి చిన్న‌త‌నంలో వాళ్లు ఓల్డ్ సిటీలో ఉండేవారు. త‌ర్వాత చందాన‌గ‌ర్‌కు షిఫ్ట‌య్యారు. అక్క‌డే విజ్ఞాన్ స్కూల్‌లో చ‌దువుకున్నాడు.

చిన్న‌ప్ప‌ట్నుంచీ ప్రియ‌ద‌ర్శికి సినిమా పిచ్చి. కె. విశ్వ‌నాథ్‌, కె. బాల‌చంద‌ర్‌, రామ్‌గోపాల్ వ‌ర్మ సినిమాలు తెగ చూసేవాడు. ఎం.ఎన్‌.ఆర్‌. డిగ్రీ కాలేజీలో బీయ‌స్సీ కంప్యూట‌ర్ సైన్స్ ఢ‌క్కామొక్కీలు తిని రెండు స‌బ్జెక్టుల్లో ఫెయిల‌య్యాడు. పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలంటే డిగ్రీ అర్హ‌త ఉండాల‌ని తెలిశాక‌, అష్ట‌క‌ష్టాలు ప‌డి అత్తెస‌రు మార్కుల‌తో డిగ్రీ పూర్తి అయ్యింద‌నిపించుకున్నాడు. అయితే పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరేందుకు నాన్న ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతో, ఆయ‌న ప‌నిచేస్తున్న సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ కోర్సులో చేరాడు.

ఎలాంటి ఇంట‌రెస్ట్ లేకుండా చేరిన అత‌ని జీవితం కొత్త మ‌లుపు తిరిగింద‌క్క‌డే. మాస్ క‌మ్యూనికేష‌న్ చ‌ద‌వ‌డంతో రైటింగ్‌, షార్ట్ ఫిల్మ్ మేకింగ్‌లో అవ‌గాహ‌న పెరిగింది. చ‌దువ‌య్యాక 'పిక్స‌లాయిడ్' కంపెనీలో రూ. 9 వేల జీతానికి అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌గా జాయిన‌య్యాడు. అక్క‌డ సినిమాల‌కు విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, 3డి యానిమేష‌న్ వంటివి చేస్తుంటారు. అలా నెమ్మ‌ది నెమ్మ‌దిగా ఫిల్మ్ ఇండ‌స్ట్రీతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. క‌థ‌లు రాస్తూ, వాటితో సినిమాలు తియ్యాల‌నే కోరిక‌తో డైరెక్ష‌న్ చాన్స్ కోసం ప్ర‌య‌త్నించాడు కానీ అవ‌కాశాలు రాలేదు. దాంతో షార్ట్ ఫిలిమ్స్ వైపు దృష్టి పెట్టాడు.

ఉద్యోగం వ‌దిలేశాడు. డ‌బ్బు సంపాద‌న కోసం కార్పొరేట్ యాడ్స్ చేస్తూ, పెళ్లిళ్ల‌కు వీడియో షూటింగ్‌లు చేస్తూ వ‌చ్చాడు. ఆ డ‌బ్బుల‌తో అర‌డ‌జ‌ను షార్ట్ ఫిలిమ్స్ తీశాడు. వాటిలో త‌నే మెయిన్ రోల్ చేశాడు. ఆ టైమ్‌లోనే త‌రుణ్ భాస్క‌ర్ ప‌రిచ‌య‌మ‌య్యాడు. అప్పుడే 'బైపాస్ రోడ్ ఎల్ఎండీ కాల‌నీ' అనే సినిమాలో న‌టుడిగా చాన్స్ వ‌చ్చింది. అందులో మంచి పాత్ర చేశాడు కానీ, అది విడుద‌ల కాలేదు. ఆ త‌ర్వాత చేసిన ఐదారు సినిమాల ప‌రిస్థితీ అంతే. తెర‌పై అత‌డు మొద‌ట‌గా క‌నిపించిన సినిమా.. 'టెర్ర‌ర్‌'. స‌తీశ్ కాశెట్టి డైరెక్ట్ చేసిన ఆ మూవీలో ప్రియ‌ద‌ర్శి విల‌న్‌గా న‌టించాడు. తెర‌మీద అత‌డ్ని చూసి, వీడు సినిమాల‌కు ప‌నికొస్తాడ‌ని అప్పుడు న‌మ్మారు అమ్మానాన్న‌లు.

త‌రుణ్ భాస్క‌ర్ 'పెళ్లిచూపులు' తియ్యాల‌నుకున్న‌ప్పుడు హీరో ఫ్రెండ్ రోల్ కోసం ఆడిష‌న్స్‌కు వెళ్లి సెల‌క్ట‌య్యాడు. నిజానిక‌త‌డు కోట శ్రీ‌నివాస‌రావు లాగ‌గా, ప్ర‌కాశ్‌రాజ్ లాగా విల‌న్ అవ్వాల‌నుకొని పెళ్లిచూపుల‌తో క‌మెడియ‌న్ అయ్యాడు. 'టెర్ర‌ర్‌'తో పాటు 'బొమ్మ‌ల రామారం' సినిమాలో చేసిన విల‌న్ క్యారెక్ట‌ర్లు అత‌డికి వ‌ర్క‌వుట్ కాలేదు. కానీ 'పెళ్లిచూపులు'లో చేసిన కామెడీ రోల్ అత‌డికి ఒకే సంవ‌త్స‌రం 25 సినిమా చాన్సులు తెచ్చింది. ఈ క్ర‌మంలో 'మ‌ల్లేశం'లో టైటిల్ రోల్ చేసి, న‌టుడిగా ఇంకో మెట్టు ఎక్కాడు ప్రియ‌ద‌ర్శి.