Read more!

English | Telugu

బ్లాక్‌బ‌స్ట‌ర్ 'య‌మ‌గోల' వెనుక ఇంత క‌థ జ‌రిగింది!

 

ఎన్టీ రామారావు క‌థానాయ‌కుడిగా ద‌ర్శ‌కుడు తాతినేని రామారావు రూపొందించిన 'య‌మ‌గోల' (1977) బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘ‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా, మ్యూజికల్‌గానూ సంచ‌ల‌నం సృష్టించింది. అందాల తార‌ జ‌య‌ప్ర‌ద నాయిక‌గా న‌టించిన ఈ మూవీలో య‌మునిగా స‌త్య‌నారాయ‌ణ‌, చిత్ర‌గుప్తునిగా అల్లు రామ‌లింగ‌య్య చేసిన కామెడీ ప్రేక్ష‌కుల‌కు గిలిగింత‌లు పెట్టించింది. రావు గోపాల‌రావు విల‌నీ ఈ సినిమాకు ఎస్సెట్‌. చ‌క్ర‌వ‌ర్తి సంగీతం స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని పాట‌ల‌న్నీ పాపుల‌రే. ఆడవె అందాల సురభామిని పాడవె కళలన్ని ఒకటేనని, ఓలమ్మీ తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా, చిలక కొట్టుడు కొడితే, సమరానికి నేడే ఆరంభం, వయసు ముసురు, గుడివాడ వెళ్ళాను పాట‌లు జ‌నం నోళ్ల‌లో నానాయి. 

అదివ‌ర‌కే సోషియో ఫాంట‌సీ ఫిల్మ్ దేవాంత‌కుడుతో హిట్ సాధించిన ఎన్టీఆర్‌, అదే త‌ర‌హా క‌థ‌తో రెండోసారి అంత‌కు మించి బాక్సాఫీస్ విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డం విశేషం. చిత్ర‌గుప్తుడు చేసిన పొర‌పాటుతో ఒక‌రి బ‌దులుగా చ‌నిపోయి య‌మ‌లోకం వెళ్లిన స‌త్యం అనే యువ‌కుడు అక్క‌డ చేసిన అల్ల‌రి, య‌మ‌భ‌టుల‌తో క‌లిసి విప్ల‌వాన్ని రేకెత్తించి, య‌ముడిని హ‌డ‌లెత్తించ‌డం, తిరిగి భూలోకానికి రావ‌డం, అత‌డిని వెతుక్కుంటూ చిత్ర‌గుప్త స‌మేతంగా య‌ముడు భూలోకానికి వ‌చ్చి హంగామా చేయ‌డం ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత వినోదాన్ని పంచాయి. అలాంటి ఈ సినిమా తియ్య‌డం వెనుక పెద్ద క‌థే న‌డిచింది.

నిజానికి 'య‌మ‌గోల' అనే టైటిల్ అల‌నాటి ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు చిత్త‌జ‌ల్లు పుల్ల‌య్య‌ది. పురాణాల మీద సెటైరిక‌ల్ పిక్చ‌ర్ తీయాల‌నే ఉద్దేశంతో ఆయ‌న య‌మ‌గోల టైటిల్‌ను ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌టించారు. ర‌చ‌యిత ఆదుర్తి న‌ర‌సింహ‌మూర్తి (ఆదుర్తి సుబ్బారావు త‌మ్ముడు)తో కొంత క‌థ త‌యారుచేయించారు. ఏ కార‌ణం చేత‌నో ఆ క‌థ పూర్తి కాలేదు. కొన్నాళ్ల‌కు పుల్ల‌య్య క‌న్నుమూశారు. త‌ర్వాత ఆయ‌న కుమారుడు, ద‌ర్శ‌కుడు సి.య‌స్‌. రావు.. ఆ క‌థ‌ను సొంతంగా త‌న అభిప్రాయాల‌తో ఆయ‌న రాసుకున్నారు.

ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో అప్ప‌టికే ఓ సినిమా తీసిన నిర్మాత డి.ఎన్‌. రాజు, మ‌రో సినిమా తియ్యాల‌ని అనుకున్న‌ప్పుడు త‌న 'య‌మ‌గోల' స్క్రిప్టును ఇచ్చారు సి.య‌స్‌. రావు. ఆయ‌న చ‌దివి, ఆ ఫైలును ప్ర‌ముఖ నిర్మాత డి.వి.య‌స్‌. రాజుకు ఇచ్చారు, అభిప్రాయం చెప్ప‌మ‌ని. అప్ప‌టికే త‌ను తీయ‌బోయే సినిమాకు రైట‌ర్‌గా డి.వి. న‌ర‌స‌రాజును తీసుకున్నారు డీవీయ‌స్ రాజు. ఆయ‌న ఆ ఫైల్‌ను న‌ర‌స‌రాజుకు ఇచ్చారు. ఆ స్క్రిప్టు న‌ర‌స‌రాజుకు అంత‌గా న‌చ్చ‌లేదు. అంత‌టితో డి.ఎన్‌. రాజు ఆ స్క్రిప్టును ప‌క్క‌న పెట్టేశారు. అయితే దాని విష‌యం తెలుసుకున్న డి. రామానాయుడు ఆ స్క్రిప్టు హ‌క్కులు కొనుక్కున్నారు. టైటిల్ ఆక‌ర్ష‌ణీయంగా ఉంద‌ని కొన్న ఆయ‌న‌, త‌ర్వాత ఆ క‌థ చ‌దివి, న‌చ్చ‌క‌పోవ‌డంతో మూల‌న ప‌డేశారు. దాంతో ఆ స్క్రిప్టు క‌థ‌కు ఫుల్‌స్టాప్ ప‌డింది.

అయితే న‌ర‌స‌రాజు సూచ‌న మేరకు రామానాయుడు నుంచి స్క్రిప్టును కాకుండా కేవ‌లం 'య‌మ‌గోల' టైటిల్ హ‌క్కుల్ని 5 వేల రూపాయ‌ల‌కు నిర్మాత య‌స్‌. వెంక‌ట‌ర‌త్నం కొన్నారు. తాతినేని రామారావు ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తియ్యాల‌నే నిర్ణ‌యం జ‌రిగింది. అప్ప‌టికే వ‌చ్చిన ఎన్టీఆర్ హిట్ సినిమా 'దేవాంత‌కుడు' త‌ర‌హాలోనే హీరో స్వ‌ర్గ‌న‌ర‌కాల‌కు వెళ్లిన‌ట్లు క‌ల రావ‌డం వ‌ర‌కు తీసుకొని, మిగ‌తా క‌థ అంతా వేరే విధంగా త‌యారు చేయాల‌నుకున్నారు న‌ర‌స‌రాజు, రామారావు, వెంక‌ట‌ర‌త్నం. ముగ్గురూ కూర్చొని క‌థ మీద ప‌నిచేశారు. 20 రోజుల్లో క‌థ సంతృప్తిక‌రంగా వ‌చ్చింది.

హీరోగా బాల‌కృష్ణ‌నూ, య‌ముడిగా ఎన్టీఆర్‌నూ తీసుకోవాల‌ని అనుకున్న వెంక‌ట‌ర‌త్నం, ఎన్టీఆర్‌ను క‌లిసి ఆ విష‌యం చెప్పారు. న‌ర‌స‌రాజు చెప్పిన క‌థ విన్నారు ఎన్టీఆర్‌. ఆయ‌న‌కు క‌థ బాగా న‌చ్చేసింది. "హీరో వేషం బాల‌కృష్ణ మోయ‌లేడండీ. నేనే వేయాల్సినంత ఇంపార్టెన్స్ ఉంది. అది నేను వేస్తాను. య‌ముడి పాత్ర‌ను స‌త్య‌నారాయ‌ణ చేత వేయిద్దాం" అన్నారు. 

అలా షూటింగ్ మొద‌లైంది. య‌మ‌లోకం సీన్స్‌ను వాహినీ స్టూడియోలో వేసిన సెట్‌లో తీశారు. సినిమా రిలీజ‌య్యాక సూప‌ర్ హిట్ట‌యింది. య‌మ‌లోకం సీన్స్‌కు ఆడియెన్స్ బ్ర‌హ్మాండంగా రియాక్ట‌య్యారు. ఆ సినిమా డైలాగ్స్‌తో వ‌చ్చిన గ్రామ‌ఫోన్ రికార్డులు తెగ అమ్ముడుపోయాయి. డైలాగ్స్ అన్నిట్లోకీ, "చిత్ర‌గుప్తా! పెట్టెకు తాళం వేయ‌లేదా?" అని య‌ముడు అడిగితే, "తాళ‌ము వేసితిని, గొళ్లెము మ‌ర‌చితిని" అని చిత్ర‌గుప్తుడు చెప్పేది విప‌రీతంగా జ‌నం నోళ్ల‌లో నానింది. నేటికి స‌రిగ్గా 45 సంవ‌త్స‌రాల క్రితం.. 1977 అక్టోబ‌ర్ 21న 'య‌మ‌గోల' విడుద‌లైంది.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి