English | Telugu

మహానటి సావిత్రి కోమాలోకి వెళ్లిన ఆనాటి రోజులు...

 

మ‌హాన‌టి సావిత్రి 1981 డిసెంబ‌ర్ 26 రాత్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కానీ అనిత‌ర సాధ్య‌మైన న‌ట‌న‌తో ఎప్ప‌టికీ తెలుగువారి ఆరాధ్య‌తార‌గా వారి గుండెల్లో స్థానం పొందారు. భౌతిక దేహాన్ని విడ‌నాడ‌టానికి 596 రోజుల ముందే ఆమె కోమాలోకి వెళ్లిపోయారు. ఆమె ఆ స్థితిలోకి వెళ్లి ప్ర‌దేశం ఏదో తెలుసా?  క‌ర్నాట‌క‌లోని ఓ హోట‌ల్ గ‌దిలో! 'ఇది అర‌ద‌గాయ' అనే క‌న్న‌డ మూవీలో న‌టించ‌డం కోసం ఆమె బెంగ‌ళూరు వెళ్లారు. త‌న‌కు కేటాయించిన హోటల్ రూమ్‌లో ప‌డుకొంటే, అంత‌దాకా త‌న జీవిత‌మంతా సినిమా రీళ్ల‌లా క‌ళ్ల‌ముందు మెదిలింది. ఎలాంటి సినిమాలు, ఎలాంటి పాత్ర‌లు వేసిన త‌ను.. చివ‌రికి బ‌తుకు తెరువు కోసం ఎలాంటి పాత్ర‌లు వేయాల్సి వ‌స్తున్న‌దో త‌ల‌చుకొని తీవ్ర ఉద్వేగానికి గుర‌య్యారు. దుఃఖం త‌న్నుకువ‌చ్చింది. మంచంపై ప‌డి దొర్లారు. గుండెల్ని పిండేస్తున్న బాధ‌ను త‌ట్టుకోవ‌డం ఆమె వ‌శం కావ‌ట్లేదు. అప్ప‌టికే ఆమె మ‌ద్యానికి బానిస‌య్యారు. త‌ల్లి చ‌నిపోయాక సావిత్రికి స్వాంత‌న చేకూరుస్తోంది ఆ మ‌ద్య‌మే. అప్ప‌టికే రూమ్ బాయ్‌చేత తెప్పించుకొని ఉన్న మందు బాటిల్ తీసుకున్నారు. గ్లాసు త‌ర్వాత గ్లాసు వంపుకొని బాటిల్ మొత్తం తాగేశారు.

తెల్లారి ఆమెను లొకేష‌న్‌కు తీసుకుపోవ‌డం కోసం కారొచ్చింది. డ్రైవ‌ర్ వ‌చ్చి ఎంత‌సేపు త‌లుపుకొట్టినా రెస్పాన్స్ లేదు. అత‌ను వెళ్లి రిసెప్ష‌న్‌లో చెప్పాడు. వాళ్లొచ్చి త‌మ ద‌గ్గ‌రున్న రెండో తాళంతో త‌లుపులు తెరిచారు. నేల‌మీద మందు బాటిల్‌, గ్లాసు, చింద‌ర‌వంద‌ర‌గా వ‌స్తువులు.. అక్క‌డే నేల‌మీదే ప‌డిపోయి ఉన్న.. మ‌హాన‌టి! ఎంత పిలిచినా, క‌దిపినా ప‌ల‌క‌లేదు, ఉల‌క‌లేదు. స్పృహ‌లో ఉంటేగా! ప్రొడ్యూస‌ర్‌కు ఫోన్ వెళ్లింది. వెంట‌నే కారులో ఆమెను బెంగ‌ళూరుకు త‌ర‌లించారు. ఆమె స్థితి చూసి ప్రైవేట్ హాస్పిటల్స్ చేర్చుకోలేదు. దాంతో గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. అక్క‌డ బెడ్స్ ఖాళీగా లేక‌పోవ‌డంతో నేల‌మీదే ప‌డుకోబెట్టారు. ఎలాంటి సావిత్రికి ఎలాంటి దుర‌వ‌స్థ‌!

సావిత్రిని హాస్పిట‌ల్‌లో చేర్చిన విష‌యం తెలియ‌గానే న‌టి ల‌క్ష్మి ఆగ‌మేఘాల మీద అక్క‌డ‌కు వ‌చ్చారు. ప‌సిపాప‌లా అమాయ‌కంగా నిద్ర‌పోతున్న‌ట్లున్న సావిత్రిని చూడ‌గానే గుండె ప‌గిలింది ల‌క్ష్మికి. "మా అమ్మ‌ను ఇలా కింద ప‌డేశారేమిటి? ఈమె ఎవ‌ర‌నుకుంటున్నారు? ద‌య‌చేసి మంచంపై ప‌డుకోబెట్టండి." అని హాస్పిట‌ల్ వాళ్ల‌ను వేడుకున్నారు. అప్పుడు ఆమెకు మంచం ఏర్పాటుచేసి, ట్రీట్‌మెంట్ ప్రారంభించారు. ఈ వార్త దావాన‌లంలా వ్యాపించ‌డంతో త‌మ ఆరాధ్య తార‌ను చూడ్డానికి వంద‌లాదిగా జ‌నం త‌ర‌లి రావ‌డం మొద‌లైంది. క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి గుండూరావు, క‌న్న‌డ కంఠీర‌వ రాజ్‌కుమార్ స‌హా అనేక‌మంది సెల‌బ్రిటీలు అక్క‌డ‌కు వ‌చ్చి, మంచానికి అతుక్కుపోయి ఉన్న సావిత్ర‌మ్మ‌ను చూసి క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.

అప్ప‌టిదాకా ఆమెను స‌రిగా ప‌ట్టించుకోని జెమినీ గ‌ణేశ‌న్ వ‌చ్చి, ఆమెని చూసి గుండెలు బాదుకున్నాడు. ఎంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు ఏడ్చాడు. అక్క‌డ‌కు వ‌చ్చిన ప‌ద‌హారు రోజుల త‌ర్వాత సావిత్రిని తీసుకొని మ‌ద్రాసుకు ప్ర‌యాణ‌మ‌య్యారు. అన్నా న‌గ‌ర్‌లో ఆమె నివాసంలోనే ఆమెను ఉంచి, డాక్ట‌ర్ ఆర్‌.ఎస్‌. రాజ‌గోపాల్ బృందంతో చికిత్స చేయిస్తూ వ‌చ్చారు. అదివ‌ర‌కు క‌ళ్ల‌తోటే అన్ని ర‌కాల ఉద్వేగాల‌నూ ప‌లికించి మెస్మ‌రైజ్ చేసిన ఆ మ‌హాగొప్ప తార‌, అప్ప‌ట్నుంచి అక్క‌డే నిర్జీవంగా పుండైపోయిన శ‌రీరంతో, మూసుకుపోయిన క‌ళ్ల‌తో మంచంమీదే ఉండి, కోమాలోకి వెళ్లిన 596వ రోజు కొన‌ప్రాణాన్ని కూడా వ‌దిలేసి, అశేష అభిమానుల గుండెలు బ‌ద్ద‌లుచేసి వెళ్లిపోయారు. 

(డిసెంబర్ 6 మహానటి సావిత్రి జయంతి)