English | Telugu

తెలుగు సినిమాలోని సీన్‌ని కాపీ చేసి తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన మురుగదాస్‌!

తెలుగు సినిమాలోని సీన్‌ని కాపీ చేసి తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన మురుగదాస్‌!

భారతదేశంలోని వివిధ భాషల్లో నిర్మిస్తున్న అనేక సినిమాలు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని సినిమాల ద్వారా మన హీరోలకు, టెక్నీషియన్స్‌కి దేశ విదేశాల్లో అభిమానులు ఏర్పడ్డారు. గతంలో మన దర్శకుల్లో కొందరు ఏదో ఒక రిఫరెన్స్‌ లేనిదే సినిమా తీసే స్థితిలో ఉండేవారు కాదు. హాలీవుడ్‌, కొరియన్‌, జపాన్‌, ఫ్రెంచ్‌, చైనీస్‌.. ఇలా అనేక భాషల్లో నిర్మించిన సినిమాల్లోని కొన్ని కీలక సన్నివేశాలను కాపీ కొట్టి వాటిని మన సినిమాల్లో జొప్పించేవారు. మరికొందరు సినిమా అంతా మక్కీకి మక్కీ కాపీ కొట్టడంలో సిద్ధహస్తులుగా ఉండేవారు. తాను హాలీవుడ్‌ సినిమాలను కాపీ చేస్తానని రామ్‌గోపాల్‌వర్మ వంటి దర్శకులు ఓపెన్‌గానే చెప్పేశారు. ఆ తర్వాతి కాలంలో మన సినిమాలను మనమే కాపీ కొట్టుకునే స్థితికి వచ్చేశాం. దీనికి ఉదాహరణగా గతంలో అనేక సినిమాలు సోషల్‌ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చాయి. రాజమౌళి చేసిన మగధీర, విక్రమార్కుడు, బాహుబలి వంటి సినిమాల్లో అనేక ఇతర సినిమాల్లోని సన్నివేశాలను యధాతథంగా కాపీ చేసినట్టు సోషల్‌ మీడియా పుణ్యమా అని ప్రపంచం దృష్టికి వచ్చింది. తాజాగా అలాంటి ఓ సీన్‌ గురించి నెటిజన్లు తెగ డిస్కస్‌ చేసుకుంటున్నారు. అదే.. సూర్య, మురుగదాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘గజిని’ సినిమా. ఈ సినిమాలోని ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని తెలుగు సినిమా నుంచి కాపీ చేశారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం.

అక్కినేని నాగార్జున, రజని జంటగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎస్‌.గోపాలరెడ్డి నిర్మించిన ‘మురళీకృష్ణుడు’ చిత్రం 1988లో విడుదలైంది. 2005లో సూర్య, మురుగదాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘గజిని’ ఎంతో పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన సన్నివేశం ఉంటుంది. ఎయిర్‌ వాయిస్‌ ఓనర్‌ సంజయ్‌ రామస్వామి, ఒక యాడ్‌ కంపెనీలో మోడల్‌గా పనిచేసే కల్పన అనే అమ్మాయి మధ్యన సాగే ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌ని స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ ‘మురళీకృష్ణుడు’ చిత్రం నుంచి కాపీ చేశారు మురుగదాస్‌. ఆ సినిమాలో మురళీకృష్ణ ఎంటర్‌ప్రైజెస్‌ ఎం.డి. మురళీకృష్ణ, డ్రామా కంపెనీలో డాన్స్‌ టీచర్‌గా పనిచేసే కృష్ణవేణి అనే అమ్మాయి మధ్య ఆ సీన్‌ ఉంటుంది. ఒక్కసారి ఆ సీన్‌ని పరిశీలిస్తే... మురళీకృష్ణ అనే వ్యక్తి ఎవరో తెలియకుండానే అతనితో కృష్ణవేణికి లవ్‌ ఎఫైర్‌ ఉందనే వార్త ఆ డ్రామా కంపెనీలో స్ప్రెడ్‌ అయిపోతుంది. దాంతో తనకు పరిచయమైన ఓ వ్యక్తిని మురళీకృష్ణగా నటించమని కోరుతుంది కృష్ణవేణి. ఆ క్రమంలోనే ఓ హోటల్‌లో ఆ డ్రామా కంపెనీ సభ్యులతోపాటు కృష్ణవేణి.. మురళీకృష్ణను కలుస్తుంది. మురళీకృష్ణ ఆ డ్రామా కంపెనీ కోసం రెండు లక్షల చెక్‌ కూడా ఇస్తాడు. ఫేక్‌ మురళీకృష్ణ రెండు లక్షల చెక్‌ ఇవ్వడం ఏమిటని కృష్ణవేణి షాక్‌ అవుతుంది. 

ఇదే సీన్‌ని ‘గజిని’ చిత్రంలో సూర్య, అసిన్‌ మధ్య రిపీట్‌ చేశారు మురుగదాస్‌. బ్యాక్‌డ్రాప్‌ మారినప్పటికీ స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌లో విరాళంగా చెక్‌ ఇవ్వడం వరకు ఈ సినిమాలో ఉంటుంది. నాగార్జున కెరీర్‌ ప్రారంభంలో వచ్చిన సినిమా కావడం, ఆ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందకపోవడంతో ఆ సినిమాను, అందులోనీ సీన్స్‌ను అందరూ మర్చిపోయారు. కానీ, మురుగదాస్‌ మాత్రం దాన్ని గుర్తుపెట్టుకొని యధాతథంగా తన సినిమాలో దింపేశాడు. ఒకవిధంగా గజిని సినిమాలో ఇది చాలా కీలక సన్నివేశంగా చెప్పొచ్చు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుగు సినిమాలోని సన్నివేశాన్ని తమిళ్‌లో వాడుకున్న మురుగదాస్‌ను ట్రోల్‌ చేస్తూ రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు నెటిజన్లు.