Read more!

English | Telugu

మొద‌ట హోట‌ల్ రిసెప్ష‌నిస్ట్.. ఆ త‌ర్వాత 'శుభ‌లేఖ' సుధాక‌ర్‌!

 

కామెడీ న‌టుడిగా ప్రేక్ష‌కుల్ని బాగా న‌వ్వించిన శుభ‌లేఖ సుధాక‌ర్, ఆ త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారి ఎన్నో సినిమాల్లో ర‌క‌ర‌కాల పాత్రలు చేశారు. క‌మ‌ల్ హాస‌న్‌ 'ద్రోహి' సినిమాలో అయితే నెగ‌టివ్ రోల్ పోషించారు కూడా. యాక్ట‌ర్ కావ‌డానికి ముందు బ‌త‌క‌డానికి ఆయ‌న ఓ పెద్ద హోట‌ల్‌లో రిసెప్ష‌నిస్టుగా ప‌నిచేశారు. సుధాక‌ర్ ఇంట్లో వాళ్ల నాన్న‌గారికి కానీ, తాత‌గారికి కానీ సినిమాలంటే గిట్ట‌దు. వాళ్లు సినిమాలు చూసేవాళ్లు కాదు. అలాంటిది సుధాక‌ర్‌లో సినిమాల ప‌ట్ల ఆక‌ర్ష‌ణ క‌ల‌గ‌డానికి కార‌ణం అమితాబ్ బ‌చ్చ‌న్‌. త‌న‌కు ఊహ తెలిశాక ప‌న్నెండు-ప‌ద‌మూడేళ్ల వ‌య‌సులో చూసిన మొట్ట‌మొద‌టి సినిమా - 'దీవార్‌'. ఆ సినిమాలో అమితాబ్ న‌ట‌న చూసిన ద‌గ్గ‌ర్నుంచీ ఆయ‌న‌లా న‌టుడ్ని కావాల‌ని క‌ల‌లు కంటూ వ‌చ్చారు.

మొత్తానికి ఇంట్లోవాళ్ల‌ను ఒప్పించి, మ‌ద్రాసుకు వ‌చ్చి, మ‌ద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్‌లో డిప్లొమా తీసుకున్న త‌ర్వాత వైజాగ్ వెళ్లారు సుధాక‌ర్‌. అప్పుడు కె. విశ్వ‌నాథ్ గారు వైజాగ్‌లో 'స‌ప్త‌ప‌ది' షూటింగ్ చేస్తున్నారు. ఆయ‌న‌ను క‌లిసి, త‌న వివ‌రాలు చెప్పారు సుధాక‌ర్‌. కానీ ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. మ‌ద్రాసులో ఉండి సినిమా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించాలంటే డ‌బ్బు కావాలి. అందుక‌ని తాజ్ కోర‌మాండ‌ల్‌లో ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తే, రిసెప్ష‌నిస్ట్‌గా చేర‌మ‌న్నారు. అక్క‌డ ఆ ఉద్యోగం చేస్తుండ‌గా విశ్వ‌నాథ్ గారి నుంచి క‌బురు వ‌చ్చింది. వెళ్లి క‌లిశారు సుధాక‌ర్‌. చిరంజీవి హీరోగా త‌ను తీస్తున్న సినిమాలో ఓ వేషం ఇచ్చారు విశ్వ‌నాథ్‌. ఆ సినిమా 'శుభ‌లేఖ‌'. అలా ఆ సినిమా నుంచి శుభ‌లేఖ సుధాక‌ర్ అయిపోయారు.

తాజ్ కోర‌మాండ‌ల్‌లో దాదాపు ఒక సంవ‌త్స‌రం పాటు ప‌నిచేశారాయ‌న‌. అది చాలా విలాస‌వంత‌మైన హోట‌ల్‌. సంప‌న్నులు త‌ప్ప మామూలు వాళ్లు అందులో బ‌స చేయ‌రు. మ‌ద్రాస్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ పొందేట‌ప్పుడు, ఆ త‌ర్వాత అటువేపు న‌డుస్తూ వెళ్తున‌ప్పుడ‌ల్లా ఈ హోట‌ల్‌లో రూమ్ తీసుకొని ఉంటే బాగుండునని, ఆ స్థాయికి త‌ను ఎద‌గగ‌ల‌నా అని ఆయ‌న అనుకొనేవారు. కానీ అదే హోట‌ల్‌లో రిసెప్ష‌నిస్టుగా చేస్తాన‌ని ఆయ‌న ఊహించ‌లేదు.