English | Telugu

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి గురించి ఎవరికీ తెలియని కొన్ని విశేషాలు!

(అక్టోబర్‌ 10 ఎస్‌.ఎస్‌.రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా..)

ఒకప్పుడు ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌నే ప్రామాణికంగా తీసుకునేవారు. కొన్ని కొత్త తరహా కథల కోసం సౌత్‌ ఫిలిం ఇండస్ట్రీ బాలీవుడ్‌నే ఆశ్రయించేది. అలా ఎన్నో హిందీ సినిమాలు తెలుగులో రీమేక్‌ అయ్యాయి. అప్పుడప్పుడు సౌత్‌ సినిమాలు కూడా హిందీలో రీమేక్‌ అయినా వాటి సంఖ్య తక్కువనే చెప్పాలి. ఎప్పుడైతే టాలీవుడ్‌ నుంచి ఎస్‌.ఎస్‌.రాజమౌళి అనే డైరెక్టర్‌ ఉద్భవించాడో అప్పటి నుంచి తెలుగు సినిమా తీరు తెన్నులు మారుతూ వచ్చాయి. కొత్త తరహా సినిమాలు, టెక్నికల్‌గా మంచి స్టాండర్డ్స్‌ ఉన్న సినిమాలు రావడం మొదలైంది. ఈగ, బాహుబలి సిరీస్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి సినిమాలతో తెలుగు సినిమా బాలీవుడ్‌ని దాటి హాలీవుడ్‌ వరకు వెళ్లింది. తెలుగు సినిమా పాటకి తొలి ఆస్కార్‌ సాధించి పెట్టిన ఘనత రాజమౌళికి దక్కింది. బాలీవుడ్‌ దర్శకనిర్మాతలే కాదు, హాలీవుడ్‌ ఇండస్ట్రీ కూడా తనవైపు దృష్టి సారించేలా రాజమౌళి తను చేసే సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్‌ కాంబినేషన్‌లో చేస్తున్న సినిమా హాలీవుడ్‌ సినిమాలకు ధీటుగా ఉండబోతోందని అర్థమవుతోంది. హాలీవుడ్‌లో నిర్మాణం జరుపుకున్న ఇండియానా జోన్స్‌ సిరీస్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులారిటీ సాధించిందో అందరికీ తెలిసిందే. మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇండియానా జోన్స్‌ తరహాలోనే ఉండబోతోంది. ఒక హాలీవుడ్‌ స్థాయి సినిమా టాలీవుడ్‌ నుంచి రాబోతోందంటే అది తెలుగు వారు ఎంతో గర్వించాల్సిన విషయం. తన సినిమాలతో ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న రాజమౌళి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరు చెందిన తెలుగు ఫ్యామిలీ.. కర్ణాటకలోని రాయచూరుకి వలస వెళ్లింది. అక్కడ జన్మించారు రాజమౌళి. తెలుగుతోపాటు కన్నడ కూడా అనర్గళంగా మాట్లాడగలరు రాజమౌళి. వ్యవహారిక కన్నడ భాష మాట్లాడడంలో ఆయన ఎక్స్‌పర్ట్‌. రాజమౌళికి ఇష్టమైన డైరెక్టర్‌ కె.రాఘవేంద్రరావు. ఆయన తన సినిమాల్లో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని ఎంత పర్‌ఫెక్ట్‌ ఎలివేట్‌ చేస్తారనే విషయాన్ని అనేక ఇంటర్వ్యూల్లో రాజమౌళి వివరించారు. అదే తనకు ఇన్‌స్పిరేషన్‌ అని చెబుతారు.

రాజమౌళికి అత్యంత సన్నిహితుడు, ప్రాణ మిత్రుడు ఎన్టీఆర్‌. తన మొదటి సినిమా ఎన్టీఆర్‌తో చేసేందుకు అయిష్టంగానే ఒప్పుకున్న రాజమౌళి.. ఆ తర్వాత నటన పట్ల అతనికి ఉన్న డెడికేషన్‌, తను కోరుకున్న ఎఫెక్ట్‌ని స్క్రీప్‌పై ప్రజెంట్‌ చేసే విధానం రాజమౌళిని కట్టి పడేసింది. ఆ క్షణం నుంచి ఎన్టీఆర్‌తో ప్రేమలో పడిపోయాడు రాజమౌళి. ఆ కారణంగా ఎన్టీఆర్‌తో స్టూడెంట్‌ నెం.1, సింహాద్రి, యమదొంగ, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి సినిమాలు చేశారు. రాజమౌళి, ఎన్టీఆర్‌ కుటుంబాల మధ్య బాండింగ్‌ కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉంటుంది.

ఎన్టీఆర్‌ తర్వాత రాజమౌళి ఎంతో ఇష్టపడే హీరో ప్రభాస్‌. ఒకరకంగా ప్రభాస్‌కి రాజమౌళి వ్యక్తిగత సలహాదారుడు. అతని కెరీర్‌ని అబ్జర్వ్‌ చేస్తూ ఇవ్వాల్సిన సలహాలిస్తూ ఉంటారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్‌ పేరు తెచ్చుకోవడం వెనుక రాజమౌళి హస్తం కూడా ఉంది.

స్టూడెంట్‌ నెం.1తో మొదలైన రాజమౌళి సినీ ప్రయాణం మర్యాద రామన్న వరకు దిగ్విజయంగా కొనసాగింది. అయితే అప్పటివరకు చేసిన 8 సినిమాలు తెలుగుకి మాత్రమే పరిమితమయ్యాయి. 2012లో చేసిన ఈగ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత చేసిన బాహుబలి1తో అంతర్జాతీయ స్థాయిలోనూ పేరు తెచ్చుకున్నారు. ఈ చిత్రాన్ని 2019 అక్టోబర్‌ 19న లండన్‌లోని రాయల్‌ అల్బర్ట్‌ హాల్‌లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో ఎం.ఎం.కీరవాణి లైవ్‌ ఆర్కెస్ట్రాతో ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేయడం విశేషం.

బాహుబలి మొదటి పార్ట్‌ రిలీజ్‌ అయిన సంవత్సరానికి రాజమౌళికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. తెలుగులోనే సినిమాలు చేస్తున్న రాజమౌళికి కర్ణాటక ప్రభుత్వం రికమెండేషన్‌ వల్ల పద్మశ్రీ పురస్కారం లభించడం విశేషం. రాజమౌళి తనను తాను దర్శకుడిగా కంటే స్టోరీ టెల్లర్‌గానే ఇష్టపడతాడు. కానీ, ప్రేక్షకులు మాత్రం అతన్ని గొప్ప దర్శకుడిగానే చూస్తారు. తను సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ఎంతో స్ఫూర్తినిచ్చినవారు ఎం.ఎం.కీరవాణి అని చెబుతారు రాజమౌళి.

బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహర్‌ తన ఆటోబయోగ్రఫీలో రాజమౌళికి ప్రత్యేక స్థానం ఇచ్చారు. ‘గ్రేటెస్ట్‌ షోమ్యాన్‌ ఆఫ్‌ ది 21st సెంచరీ’గా రాజమౌళిని అభివర్ణించారు. సినిమాయే ఊపిరిగా జీవించే రాజమౌళికి దక్కిన గొప్ప గౌరవం ఇది.

రాజమౌళి నిరంతర విద్యార్థి. హాలీవుడ్‌ ట్రెండ్‌ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు తన సినిమాల్లో కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతుంటారు. ఆ అబ్జర్వేషనే రాజమౌళిని అపజయం లేని దర్శకుడిగా నిలబెట్టిందని చెప్పడంలో సందేహం లేదు. రాజమౌళికి భారతీయ ఇతిహాసాలంటే వల్లమాలిన ఇష్టం. వాటిలో మహాభారతం అంటే మరింత ఇష్టం. ఇప్పటివరకు మహాభారతాన్ని ఎంతో మంది దర్శకులు ఎన్నో విధాలుగా చూపించారు. అయితే తన వెర్షన్‌లో మహాభారత గాథను తెరపై చూపించాలన్నది రాజమౌళి కల. ఇక తను సినిమాలు చేయడం మానేస్తాను అనుకున్న తరుణంలో చివరి ప్రాజెక్ట్‌గా మహాభారతాన్ని తెరకెక్కించాలన్నది ఆయన కోరిక.