English | Telugu

హీరోయిన్‌గా సెట్‌లోకి వ‌చ్చిన‌ తొలిరోజే న‌టించ‌న‌ని ఏడ్చేసిన సౌంద‌ర్య‌!

సావిత్రి త‌ర్వాత అంత‌టి గొప్ప‌న‌టిగా అంద‌రి ప్ర‌శంస‌లూ పొందిన సౌంద‌ర్య ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది 'మ‌న‌వ‌రాలి పెళ్లి' (1993) సినిమాతో. కానీ నిజానికి ఆమె తొలి సినిమా అది కాదు. 'అల్లూరి సీతారామ‌రాజు' చిత్రానికి ర‌చ‌యిత అయిన త్రిపుర‌నేని మ‌హార‌థి కుమారుడు శ్రీ‌ప్ర‌సాద్ (చిట్టి) డైరెక్ట్ చేసిన 'రైతుభార‌తం' సౌంద‌ర్య తొలి చిత్రం. అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యాక ఇండ‌స్ట్రీలో స‌మ్మె రావ‌డంతో, త‌ర్వాత వేరే కార‌ణాల‌తో చాలా కాలం ఆగిపోయి, 1994లో సౌంద‌ర్య 10వ సినిమాగా రిలీజ‌య్యింది.

ఈ సినిమాలో కృష్ణ‌, భానుచంద‌ర్ అన్న‌ద‌మ్ములుగా న‌టించ‌గా, వారి స‌ర‌స‌న నాయిక‌లుగా వాణీ విశ్వ‌నాథ్‌, సౌంద‌ర్య న‌టించారు. మ‌హార‌థికి సౌంద‌ర్య వాళ్ల‌నాన్న స‌త్య‌నారాయ‌ణ స్నేహితుడు. ఆయ‌న క‌న్న‌డంలో ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు కూడా. ఆ ప‌రిచ‌యంతో సౌంద‌ర్య‌ను త‌మ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయాల‌నుకున్నారు మ‌హార‌థి.

1992 మార్చిలో షూటింగ్ మొద‌లైంది. తిరుప‌తికి స‌మీపంలోని ప‌ర‌కాల‌లో భానుచంద‌ర్ కాంబినేష‌న్‌లో సీన్ పెట్టారు. మొద‌టిరోజే వాళ్లిద్ద‌రికీ కొంచెం రొమాంటిక్ సీన్ పెట్టారు డైరెక్ట‌ర్ శ్రీ‌ప్ర‌సాద్‌. ఒక‌ట్రెండు షాట్‌లు అయ్యాక సౌంద‌ర్య ఏడ్వ‌డం మొద‌లుపెట్టారు. "నేను చేయ‌లేను. ఈ యాక్టింగ్ నాకు స‌రిప‌డ‌దు. వెన‌క్కి వెళ్లిపోతాను." అని గొడ‌వ చేశారు.

డైరెక్ట‌ర్‌కు టెన్ష‌న్ ప‌ట్టుకుంది. మంచి అమ్మాయి, కేర‌క్ట‌ర్‌కు త‌గ్గ అమ్మాయి దొరికిందే.. చేయ‌నంటోందేమిటి అని ఆయ‌న బాధ‌! ఆమెను మామూలు మూడ్‌లోకి తీసుకురావ‌డం ఆయ‌న వ‌ల్ల కావ‌ట్లేదు. మ‌హార‌థి పెద్దాయ‌న కావ‌డంతో ఆమెను ఆ రొమాంటిక్ సీన్ చేయ‌మ‌ని చెప్ప‌లేక‌పోయారు. సౌందర్య తండ్రి స‌త్య‌నారాయ‌ణ‌దీ అదే స్థితి. కూతురికి ఏమ‌ని స‌ర్దిచెప్పాలో ఆయ‌న‌కు పాలుపోవ‌డం లేదు.

అప్పుడు డైరెక్ట‌ర్ శ్రీ‌ప్ర‌సాద్ త‌న భార్యాపిల్ల‌ల‌ను లొకేష‌న్‌కు ర‌ప్పించారు. నెమ్మ‌దిగా సౌంద‌ర్య‌ను ఫ్యామిలీ వాతావ‌ర‌ణంలోకి తీసుకెళ్లి షూటింగ్ మూడ్ క్రియేట్ అయ్యేలా చేసి, "యాక్టింగ్ అంటే అంతేన‌మ్మా. డిఫ‌రెంట్ ఫ్ర‌మ్ లైఫ్‌. అది నిజం కాదు." అని స‌ర్దిచెప్పి, అప్పుడు త‌న‌కు కావాల్సిన వ‌ర్క్‌ను ఆమెనుంచి రాబ‌ట్టుకున్నారు. అలా తొలిరోజు షూటింగ్ చేశారు సౌంద‌ర్య‌!