English | Telugu

ఆ సినిమా చూసి చరణ్‌రాజ్‌ను గ్యాంగ్‌ రేప్‌ చేస్తామని వార్నింగ్‌ ఇచ్చిన మహిళ!

సినిమా రంగంలో ఎవరి కెరీర్‌ ఎప్పుడు ఎలా టర్న్‌ తీసుకుంటుందో ఎవరూ చెప్పలేరు. కన్నడ చిత్రరంగంలో హీరోగా పలు సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించిన చరణ్‌రాజ్‌.. తెలుగులో ‘ప్రతిఘటన’ చిత్రంతో విలన్‌గా పరిచయమయ్యారు. అప్పటివరకు తెలుగు ప్రేక్షకులు చూసిన విలన్లకు భిన్నంగా చరణ్‌రాజ్‌ కనిపించారు. చరణ్‌రాజ్‌ అసలు పేరు బ్రహ్మానంద. కాలేజీలో చదివే రోజుల్లోనే అతనికి హీరో అవ్వాలన్న కోరిక ఉండేది. అయితే అతని ఫ్రెండ్స్‌ మాత్రం ఎగతాళి చేసేవారు. ఎప్పటికైనా తాను సినిమా హీరో అవుతానని వారితో ఛాలెంజ్‌ చేసి 1982లో ‘పరాజిత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు చరణ్‌రాజ్‌. ఈ సినిమా తర్వాత దాదాపు 20 సినిమాల్లో హీరోగా నటించిన ఆయనకు 1985లో ఉషాకిరణ్‌ మూవీస్‌ నుంచి పిలుపొచ్చింది. టి.కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న ‘ప్రతిఘటన’ చిత్రంలో విలన్‌గా నటించమని అడిగారు. కన్నడలో హీరోగా కొనసాగుతున్న తనకి విలన్‌గా చేయడం ఇష్టం లేక రెండు నెలలపాటు ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత కొందరు మిత్రుల సలహాతో ఒప్పుకున్నారు.

అప్పటివరకు కన్నడలో మీసాలు లేని హీరోగా సినిమాలు చేస్తూ వచ్చిన చరణ్‌రాజ్‌.. ‘ప్రతిఘటన’ కోసం గడ్డం, మీసాలు పెంచాల్సి వచ్చింది. ఈ విషయంలో టి.కృష్ణ ఎంతో కేర్‌ తీసుకొని కాళిదాసు గెటప్‌ని అద్భుతంగా క్రియేట్‌ చేశారు. 1985 అక్టోబర్‌లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. సినిమాలో విజయశాంతికి ఎంత పేరు వచ్చిందో.. విలన్‌గా నటించిన చరణ్‌రాజ్‌కి కూడా అంతే పేరొచ్చింది. అతని నటనకుగాను ఉత్తమ విలన్‌గా నంది పురస్కారం లభించింది. ‘ప్రతిఘటన’లాంటి సినిమా తన కెరీర్‌లో మరొకటి రాలేదని చెప్తారు చరణ్‌రాజ్‌. ఈ సినిమా చేస్తున్న సమయంలో, రిలీజ్‌ తర్వాత తనకు ఎదురైన అనుభవాల గురించి 1991లో ఒక పత్రిక ద్వారా తెలిపారు.

‘ప్రతిఘటన’ను ఒక సాధారణ చిత్రంగానే భావించాను. సినిమాలో నా క్యారెక్టర్‌ ఎలా బిహేవ్‌ చేస్తుంది, కొన్ని క్లిష్టమైన సీన్స్‌లో ఎలా నటించాలి అనేవి టి.కృష్ణగారు నాకు చేసి చూపించేవారు. ఆయన చెప్పింది చేసేవాడ్ని తప్ప ఆ క్యారెక్టర్‌ని అంతగా అడాప్ట్‌ చేసుకోలేకపోయాను. విజయశాంతిని రేప్‌ సీన్‌, ‘ఈ దుర్యోధన.. దుశ్శాసన..’ పాట, రాజశేఖర్‌తో ఫైట్‌ చేసి చంపటం.. ఇలా కృష్ణగారు ఆ సీన్స్‌ గురించి చెప్పినప్పుడు అవన్నీ జోక్స్‌లా అనిపించాయి. డైరెక్టర్‌ మనసులోని భావాలు నాకు అర్థం కాలేదు. కానీ, తెరమీద ఆ సీన్స్‌ చూసినపుడు, ప్రేక్షకులు వాటికి రెస్పాండ్‌ అయిన తీరు చూసి నేను షాక్‌ అయ్యాను. అవి చేసింది నేనేనా అని ఆశ్చర్యపోయాను.

ఇక విజయశాంతిగారి గురించి చెప్పాలంటే.. ఆమె నవ్వులో పసితనం, కళ్లల్లో అమాయకత్వం కనిపిస్తుంది. అలాంటి అమ్మాయిని రేప్‌ చేసే సీన్‌ పర్‌ఫెక్ట్‌గా చెయ్యగలనా అనుకున్నాను. అయితే ఆ సీన్‌ ఓకే అయింది. క్లైమాక్స్‌లో నాకు సన్మానం జరిగే సమయంలో నన్ను అభినందించడానికి వచ్చి నా ఎదురుగా నిలబడితే షాక్‌ అయ్యాను. నేను చూస్తున్నది విజయశాంతినా, రaాన్సీరాణినా లేక భద్రకాళినా అనే ఫీలింగ్‌ కలిగింది. ఆ షాక్‌ నుంచి బయటికి రావడానికి నాకు చాలా టైమ్‌ పట్టింది. ఎంతో ప్రశాంతంగా కనిపించే ఆమె.. ఆ సీన్‌లో అలా ఎలా మారిపోయింది అనే విషయం నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.

‘ప్రతిఘటన’ నా కెరీర్‌నే మార్చేసింది. ముఖ్యంగా తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. అయితే కాళి లాంటి క్యారెక్టర్‌ మళ్లీ నాకు రాలేదు. ఒకవేళ వచ్చినా అంత బాగా నాతో చేయించగలరా, నేను అంత ఎఫెక్టివ్‌గా చెయ్యగలనా అనిపిస్తుంది. ఆ సినిమా చేసిన తర్వాత నన్ను అభినందిస్తూ ఎంతో మంది ఉత్తరాలు రాశారు. కాళి తరహా పాత్ర మళ్లీ చెయ్యాలని కోరారు. ఈ అభినందనలు అన్నీ ఒక ఎత్తయితే.. అదే సమయంలో నాకు మరో ఉత్తరం వచ్చింది. అయితే అది నాకు రాలేదు. ఉషాకిరణ్‌ మూవీస్‌ ఆఫీస్‌కి వచ్చింది. ఆ ఉత్తరాన్ని అట్లూరి రామారావుగారు నాకు చూపించారు. ఆ ఉత్తరాన్ని ఒక మహిళ రాసింది. అది చదివి నేను చాలా ఆశ్చర్యపోయాను. ‘చరణ్‌రాజ్‌ ఒక అమ్మాయిని రేప్‌ చేశాడు. అసలు అంత దారుణానికి ఎలా పాల్పడతాడు? వాడు మనిషేనా? అతన్ని మా దగ్గరికి పంపించండి. మా లేడీస్‌ అందరం కలిసి అతన్నే భయంకరంగా రేప్‌ చేస్తాం’ అని ఆ ఉత్తరంలో ఉంది. అది చదివిన తర్వాత నిజంగానే నా మీద దండయాత్రకు వస్తారేమో అని భయం వేసింది. ఎందుకంటే నాకు స్వతహాగా లేడీస్‌ అంటే కాస్త జంకు, ఒక విధమైన భయం. నా మనస్తత్వానికి విరుద్ధమైన పాత్రలు సినిమాల్లో చాలా చేశాను. ‘ఇంత సాఫ్ట్‌గా ఉండే మీరు అంతటి క్రూరమైన విలన్‌గా ఎలా చెయ్యగలుగుతున్నారు’ అని నా భార్య కూడా చాలా సార్లు అడిగింది’ అంటూ తన కెరీర్‌లోని కొన్ని ముఖ్యమైన విశేషాల గురించి తెలిపారు చరణ్‌రాజ్‌.