Read more!

English | Telugu

రజినీ సినిమా ఒకే థియేటర్‌లో 890 రోజులు ఆడింది.. అది చిరంజీవికి బ్యాడ్‌లక్‌ అయింది!

సినిమా రంగంలో కొన్ని సినిమాలు అనుకోకుండానే సెట్‌ అవుతాయి. అలా సెట్‌ అయిన సినిమాలు కొన్ని చరిత్ర సృష్టించాయి కూడా. తమిళ్‌, తెలుగు భాషల్లో రజినీకాంత్‌ సినిమా ‘చంద్రముఖి’ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రారంభం కావడం వెనుక ఎన్నో ఆసక్తికర సంఘటనలు జరిగాయి. 1999లో కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రజినీ నటించిన ‘వడయప్పా’ సంచలన విజయం సాధించింది. ‘నరసింహ’ పేరుతో తెలుగులో రిలీజ్‌ అయి ఇక్కడ కూడా పెద్ద హిట్‌ అయింది. ఆ సినిమాలో రమ్యకృష్ణ, రజినీ పోటాపోటీగా నటించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత సురేష్‌కృష్ణ డైరెక్షన్‌లో ‘బాబా’ చిత్రాన్ని చేశాడు రజినీ. అది అతని కెరీర్‌లో పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో రెండేళ్ళపాటు ఏ సినిమా చెయ్యలేదు. ఆ సమయంలోనే శివాజీ గణేశన్‌ జయంతి వచ్చింది. అంతకుముందు రజినీని ఎన్నోసార్లు భోజనానికి ఆహ్వానించారు శివాజీ. కానీ, కుదరకపోవడం వల్ల ఎప్పుడూ వెళ్ళలేదు. అయితే ఎవరికీ చెప్పకుండా జయంతి వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లాడు రజినీ. అందరూ షాక్‌ అయ్యారు. శివాజీకి నివాళులర్పించి బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ శివాజీ ప్రొడక్షన్స్‌లో సినిమా చేస్తున్నానని ప్రకటించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ప్రభు ఆనందాన్ని అవధుల్లేవు. అప్పటికే బాబాతో పెద్ద డిజాస్టర్‌ అందుకున్న రజినీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్‌బస్టర్‌ కొట్టాలని డిసైడ్‌ అయ్యాడు. 

2004 కన్నడలో విడుదలైన ‘ఆప్తమిత్ర’ చిత్రాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా వృద్ధుడి గెటప్‌లో  వెళ్ళి ప్రేక్షకులతో కలిసి చూశాడు. ఆ సినిమాకి ఆడియన్స్‌ నుంచి వస్తున్న రెస్పాన్స్‌ చూసి ఈ సినిమాని తప్పకుండా తమిళ్‌లో రీమేక్‌ చెయ్యాలని డిసైడ్‌ అయ్యాడు. అయితే అప్పటికే కె.ఎస్‌.రవికుమార్‌తో ‘జగ్గుభాయ్‌’ సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. కానీ, ‘ఆప్తమిత్ర’ రీమేక్‌ చెయ్యడమే కరెక్ట్‌ అని డిసైడ్‌ అయ్యాడు. వెంటనే డైరెక్టర్‌ పి.వాసు, శివాజీ గణేశన్‌ తనయుడు ప్రభుకి ఫోన్‌ చేశాడు. మనం సినిమా చేస్తున్నాం అన్నాడు. దానికి పి.వాసు.. మరి జగ్గుభాయ్‌ అన్నాడు. అది క్యాన్సిల్‌.. ఈ సినిమానే రీమేక్‌ చేస్తున్నాం అని చెప్పాడు. 

ఇక సినిమాకి సంబంధించిన పనులు మొదలయ్యాయి. పి.వాసుకి రజినీ ఒకటే చెప్పాడు.. మణిచిత్రతాళు, ఆప్తమిత్ర కంటే ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలి అని. 1993లో మలయాళంలో మణిచిత్రతాళు వచ్చింది. ఆ సినిమాని ఫాజిల్‌ డైరెక్ట్‌ చేయగా మోహన్‌లాల్‌, సురేష్‌గోపి, శోభన నటించారు. మలయాళంలో ఈ సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. దాన్నే కన్నడలో పి.వాసు ‘ఆప్తమిత్ర’గా రీమేక్‌ చేశాడు. ఇప్పుడు అదే సినిమాని తమిళ్‌లో రీమేక్‌ చేసే బాధ్యత కూడా పి.వాసుకే అప్పగించాడు రజినీ. అంతకుముందు ఇదే కథతో వచ్చిన సినిమాల కంటే పెద్ద హిట్‌ అయ్యేందుకు అవసరమైన మార్పులు పి.వాసు చేస్తున్నాడు. ఓ పక్క రజినీ కూడా కొన్ని ఇన్‌పుట్స్‌ ఇస్తున్నాడు. ఆప్తమిత్రలో హీరో విష్ణువర్థన్‌ ‘హౌలా.. హౌలా’ అంటూ ఓ పదాన్ని వాడతాడు. అది రజినీకి నచ్చలేదు. దాన్ని మార్చాలి. తన చిన్నతనంలో ఓ మరాఠి నాటకంలో విలన్‌ ‘లకలకలక..’ అనడం రజినీకి గుర్తుంది. దాన్నే ఈ సినిమాలో పెట్టాలనుకున్నాడు. అన్ని విధాలా ఆ రెండు సినిమాలకంటే గొప్పగా స్క్రిప్ట్‌ రెడీ అయింది. టైటిల్‌ ‘నాగవల్లి’ అని పెడదామని పి.వాసు అన్నాడు. అది రజినీకి నచ్చలేదు. రాజుల కాలంనాటి నర్తకి కాబట్టి టైటిల్‌ ఇంకా హెవీగా ఉండాలని సూచించాడు. అప్పుడు అందరూ కలిసి ‘చంద్రముఖి’ అనే టైటిల్‌ని ఫైనల్‌ చేశారు. 

ఇక ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల్ని ఎంపిక చేయాలి. రజినీ స్నేహితుడుగా ప్రభు నటిస్తాడు. రజినీకి పెయిర్‌గా కొత్తమ్మాయి నయనతార ఓకే అయింది. ‘చంద్రముఖి’ క్యారెక్టర్‌ ఎవరితో చేయించాలి అనుకున్నప్పుడు స్నేహ, రీమాసేన్‌ పేర్లు అనుకున్నారు. కానీ, ఎవరూ ఆ క్యారెక్టర్‌కి సెట్‌ అవ్వలేదు. అప్పుడు సిమ్రాన్‌ను ఫైనల్‌ చేశారు. రెండు రోజులు షూటింగ్‌ కూడా జరిగింది. అప్పుడే టీమ్‌కి ఒక షాకింగ్‌ న్యూస్‌ తెలిసింది. అది సిమ్రాన్‌కి స్వీట్‌ న్యూసే. అదేమిటంటే సిమ్రాన్‌ ప్రెగ్నెంట్‌. దాంతో ఆ సినిమాను వదులుకుంది. అప్పుడా క్యారెక్టర్‌ చేసే అదృష్టం జ్యోతికకు దక్కింది. సినిమా ప్రారంభమైంది. ఎక్కువ శాతం షూటింగ్‌ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలోనే జరిగింది. కొంత భాగం తమిళనాడులో, రెండు పాటలు టర్కీలో షూట్‌ చేశారు. చాలా స్పీడ్‌గా షూటింగ్‌ పూర్తయింది. టోటల్‌గా సినిమాకి రూ.19 కోట్లు ఖర్చయింది.  

2005 ఏప్రిల్‌ 14న ‘చంద్రముఖి’ తమిళ్‌, తెలుగు భాషల్లో విడుదలైంది. సినిమా చూసిన ఆడియన్స్‌కి దిమ్మ తిరిగిపోయింది. సినిమాలోని కంటెంట్‌, రజినీకాంత్‌, జ్యోతికల పెర్‌ఫార్మెన్స్‌కి ఆడియన్స్‌ ఫిదా అయిపోయారు. ఇండియాలో రూ.45 కోట్లు కలెక్ట్‌ చెయ్యగా, వరల్డ్‌వైడ్‌గా రూ.75 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డు సృష్టించింది ‘చంద్రముఖి’. తమిళనాడులోని చాలా కేంద్రాల్లో ఈ సినిమా 175 రోజులు ప్రదర్శింపబడి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. చెన్నయ్‌లోని శాంతి థియేటర్‌లో ఏకంగా 890 రోజులపాటు నిరంతరాయంగా ప్రదర్శింపబడి అందర్నీ ఆశ్చర్యపరచింది. ఈ సినిమాకిగాను రజినీకాంత్‌కు రెమ్యునరేషన్‌, లాభాల్లో వాటా మొత్తం కలిపి రూ.15 కోట్లు అందాయి. అప్పటికి అదే పెద్ద రెమ్యునరేషన్‌ అని చెప్పాలి. 

ఇక ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే.. మలయాళంలో 1993లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘మణిచిత్రతాళు’ డివిడి మెగాస్టార్‌ చిరంజీవికి ఇచ్చి ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తే బాగుంటుందని చెప్పాడు దర్శకుడు వి.ఎన్‌.ఆదిత్య. అయితే ఈ సినిమాను చేసేందుకు చిరంజీవి ఆసక్తి చూపించలేదు. ‘చంద్రముఖి’ రిలీజ్‌ అయి సంచలన విజయం సాధించిన తర్వాత వి.ఎన్‌.ఆదిత్యకు చిరంజీవి స్వయంగా ఫోన్‌ చేసి సినిమాపై అతనికి ఉన్న జడ్జిమెంట్‌ను మెచ్చుకున్నారు.