English | Telugu

క్రియేటివ్‌ కమర్షియల్స్‌తో నిర్మాతగా ఒక బ్రాండ్‌ క్రియేట్‌ చేసిన కె.ఎస్‌.రామరావు!

(జూలై 7 కె.ఎస్.రామారావు పుట్టినరోజు సందర్భంగా..)

సినిమాలపై ఉన్న ఆసక్తితో ఎంతో మంది నిర్మాతలు తమ అభిరుచికి అనుగుణమైన సినిమాలు నిర్మించేందుకు ఇండస్ట్రీకి వచ్చారు. చిత్ర నిర్మాణంలో కొన్ని సంస్థలు తమ కంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అలాంటి వాటిలో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ ఒకటి. ఈ పేరు వినగానే ఎన్నో కమర్షియల్‌ హిట్‌ సినిమాలు, ఫీల్‌గుడ్‌ మూవీస్‌ గుర్తొస్తాయి. ఈ సంస్థ అధినేత కె.ఎస్‌.రామారావు మంచి అభిరుచితో పరిశ్రమకు వచ్చి ఎన్నో మెమరబుల్‌ మూవీస్‌ని ప్రేక్షకులకు అందించారు. ఒక దశలో మెగాస్టార్‌ చిరంజీవితో వరస బ్లాక్‌బస్టర్స్‌ నిర్మించి అటు ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కె.ఎస్‌.రామారావు చిత్ర రంగానికి ఎలా వచ్చారు? ఆయన నేపథ్యం ఏమిటి? తన బేనర్‌లో ఎలాంటి సినిమాలు నిర్మించారు? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

జూలై 7న విజయవాడలో జన్మించారు కె.ఎస్‌.రామారావు. ఆయన విద్యాభ్యాసం కూడా అక్కడే జరిగింది. 21 ఏళ్ళ వయసులో సినిమాలపై ఉన్న మక్కువతో డైరెక్టర్‌ అవ్వాలని మద్రాస్‌ చేరుకున్నారు. దర్శకుడు కె.ఎస్‌.ప్రకాశరావు దగ్గర బందిపోటు దొంగలు, విచిత్ర కుటుంబం, నా కుటుంబం చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. 1973లో నిర్మాత వడ్డే రమేష్‌ వంటి మిత్రుల సహకారంతో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ అనే సంస్థను స్థాపించి సినిమాలకు రేడియో ద్వారా పబ్లిసిటీ చేసేవారు. కొన్ని వందల సినిమాలను తమ సంస్థ ద్వారా పబ్లిసిటీ చేశారు. అలా ఆయన్ని అందరూ రేడియో రామారావు అని పిలిచేవారు. తర్వాత కొన్నాళ్ళకు సినిమా నిర్మాణంపై ఆసక్తి కలగడంతో తమిళ్‌లో సూపర్‌హిట్‌ అయిన ఎర్రగులాబీలు, మౌనగీతం, టిక్‌టిక్‌టిక్‌ వంటి సినిమాలను తెలుగులోకి అనువదించి ఘనవిజయాలు అందుకున్నారు. నిర్మాతగా సక్సెస్‌ అవ్వడంతో స్ట్రెయిట్‌ మూవీ చెయ్యాలనుకున్నారు.

ఆంధ్రజ్యోతి వార పత్రికలో సీరియల్‌గా వచ్చిన యండమూరి వీరేంద్రనాథ్‌ నవల అభిలాష.. కె.ఎస్‌.రామారావుకి బాగా నచ్చింది. దాన్ని సినిమాగా నిర్మించేందుకు సన్నాహాలు చేసుకున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, రాధిక జంటగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అభిలాష చిత్రాన్ని నిర్మించారు. మొదటి సినిమాతోనే మంచి టేస్ట్‌ ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు కె.ఎస్‌.రామారావు. ఈ సినిమా కమర్షియల్‌ పెద్ద హిట్‌ అవ్వడమే కాకుండా మ్యూజికల్‌గా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తర్వాత అదే టెక్నికల్‌ టీమ్‌తో ఛాలెంజ్‌, రాక్షసుడు, మరణ మృదంగం సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి హీరోగా యండమూరి వీరేంద్రనాథ్‌ దర్శకత్వంలో స్టువర్ట్‌పురం పోలీస్‌ స్టేషన్‌ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా ఆర్థికంగా కె.ఎస్‌.రామారావుకు నష్టాలు తెచ్చింది. ఆ తర్వాత చిరంజీవి కాంబినేషన్‌లో సినిమాలు చెయ్యలేదు. 1992లో వెంకటేష్‌ హీరోగా నిర్మించిన చంటి కమర్షియల్‌ హిట్‌ సాధించి కె.ఎస్‌.రామారావుకు చాలా మంచి పేరు తెచ్చింది.

1993లో నిర్మించిన మాతృదేవోభవ నిర్మాతగా కె.ఎస్‌.రామారావుకు చాలా మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా ఉత్తమ తృతీయ చిత్రంగా నంది అవార్డు అందుకుంది. ఈ సినిమాలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాటకుగాను ఉత్తమ గేయ రచయితగా వేటూరి సుందరరామ్మూర్తికి జాతీయ అవార్డు లభించింది. ఆ తర్వాత క్రిమినల్‌, వాసు, బుజ్జిగాడు వంటి సినిమాలను నిర్మించారు. భాగస్వామ్యంలో కూడా చాలా చిత్రాలు నిర్మించారు. అయితే ఈమధ్యకాలంలో కె.ఎస్‌.రామారావు నిర్మించిన సినిమాలు కమర్షియల్‌గా ఆశించిన స్థాయి విజయాలు అందుకోలేదు. తనయుడు కె.ఎ.వల్లభను హీరోగా పరిచయం చేస్తూ ఎవరే అతగాడు చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సక్సెస్‌ అవ్వలేదు.