Read more!

English | Telugu

న‌టుడిగా ఆఫ‌ర్లు లేక‌పోవ‌డంతో ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా మారిన ఆదిత్య ఓం!

 

హీరోగా, ప్ర‌ధాన పాత్ర‌ధారుల్లో ఒక‌డిగా కొన్ని సినిమాల్లో న‌టించాక ఆదిత్య ఓం ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా మారార‌ని మీకు తెలుసా? ఈ నిజం చాలా మందికి తెలీదు. అవును. వైవీఎస్ చౌద‌రి 'లాహిరి లాహిరి లాహిరిలో' మూవీతో యంగ్ హీరోగా టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన ఉత్త‌రాది యువ‌కుడు ఆదిత్య ఓం. ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు చెందిన అత‌ను తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోగా న‌టించాడు. అయితే క్ర‌మంగా అత‌నికి అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. దాంతో ఒకానొక టైమ్‌లో ఏం చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయాడు. త‌ను కెరీర్ ప్రారంభించిన ముంబైకి వెళ్లిపోయి, బాలీవుడ్‌లో ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా ప‌నిచేశాడు.

ఈ విష‌యాన్ని తెలుగువ‌న్‌కు వ‌చ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు ఆదిత్య ఓం. "తెలుగులో మంచి ఆఫ‌ర్లు త‌గ్గిపోవ‌డం, అప్ప‌ట్లో వెబ్ సిరీస్‌ల లాంటివి కూడా లేక‌పోవ‌డంతో, కొత్త‌గా ఏదైనా ప్లాన్ చెయ్యాల‌ని ముంబైకి వెళ్లాను. కెరియ‌ర్ మొద‌ట్లో నేను ముంబైలో డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేశాను. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశాను. అందుక‌ని మ‌ళ్లీ డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లాల‌నుకున్నాను. అయితే ముంబైకి వెళ్లి నా ఎక్స్‌పీరియెన్స్ ప్ర‌కారంగా 2007-08 మ‌ధ్య‌లో ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా స్టార్ట్ చేశాను." అని అత‌ను తెలిపాడు.

"నా ఫ్రెండ్స్ సినిమాల‌ను ప్రొడ్యూస్ చెయ్యాల‌నుకున్న‌ప్పుడు, వాళ్ల‌కు గైడ్ చెయ్యాలనీ, డ‌బ్బు కోస‌మ‌నీ ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా మారాను" అని ఆదిత్య ఓం వెల్ల‌డించాడు. "ఆ సినిమాల‌కు స్టార్టింగ్ నుంచి రిలీజ్ వ‌ర‌కు చూశాను. అలా నాలుగు సినిమాల‌కు ప‌నిచేశాను. దాంతో ఇండ‌స్ట్రీ ఎలా ఫంక్ష‌న్ అవుతుంద‌నే విష‌యం మ‌రింత‌గా తెలిసింది. నేను ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా ప‌నిచేసిన వాటిలో బెస్ట్ ఫిల్మ్ 'శూద్ర‌'. క్యాస్ట్ సిస్ట‌మ్ మీద అదొక క‌ల్ట్ ఫిల్మ్‌. దానికిప్పుడు సీక్వెల్ కూడా వ‌స్తోంది. అందులో నేను యాంటీ హీరోగా యాక్ట్ కూడా చేశాను." అని అత‌ను చెప్పుకొచ్చాడు.