English | Telugu

ఎన్టీఆర్‌ ఆడవేషం వేసారంటే.. ఆ సినిమా సూపర్‌హిట్టే!

నవరసాలను అద్భుతంగా పోషించగలిగిన వారే మహానటులు అనిపించుకుంటారు. అవికాక స్త్రీ పాత్రలోనూ మెప్పించగలగడం అనేది అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు నాటక రంగంలో స్త్రీ పాత్రలు చేసేవారు అరుదుగా దొరికేవారు. అలాంటి సమయంలో మగవారే స్త్రీ పాత్రలు పోషించి వాటికి వన్నె తెచ్చారు. స్త్రీ వేషం వెయ్యాల్సిన పరిస్థితి ప్రతి నటుడికీ ఏదో ఒక సందర్భంలో ఎదురవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళుగా చెప్పుకునే ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ కూడా లేడీ గెటప్స్‌ వేశారు. వీరిద్దరూ తమ కెరీర్‌ను స్త్రీ పాత్రలతోనే మొదలుపెట్టడం విశేషం. ఎన్టీఆర్‌ కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక నాటకం వెయ్యాల్సి వచ్చింది. అందులో నాయకురాలు నాగమ్మ పాత్రను మీసాలతోనే నటించి మీసాల నాగమ్మగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఎఎన్నార్‌ కూడా నాటక రంగం నుంచి వచ్చినవారే. రంగస్థలంపై ఆయన చేసిన మొదటి పాత్ర స్త్రీ పాత్ర కావడం విశేషం. అక్కినేనితో పోలిస్తే ఎన్టీఆర్‌ ఎక్కువ సార్లు స్త్రీ పాత్ర ధరించారు.

సినిమా రంగానికి వచ్చిన తర్వాత ఎన్టీఆర్‌ తొలిసారి ‘అన్న తమ్ముడు’ చిత్రంలో స్త్రీ వేషంలో కనిపించారు. 1958లో వచ్చిన ఈ సినిమాలో అన్నగా ఎన్టీఆర్‌, తమ్ముడిగా జగ్గయ్య నటించారు. ఈ చిత్రానికి సి.ఎస్‌.రావు దర్శకత్వం వహించారు. ఒక సందర్భంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎన్టీఆర్‌ ఆడవేషం వేసుకుంటారు. పోలీసుగా ఉన్న రేలంగి.. ఆడవేషంలో ఉన్న ఎన్టీఆర్‌ను చూసి మనసు పడతాడు. ‘వయసు మళ్లిన వన్నెలాడి..’ అంటూ పాట కూడా పాడతాడు. అదే సంవత్సరం టి.ఆర్‌.రామన్న దర్శకత్వంలో వచ్చిన ‘కార్తవరాయని కథ’ చిత్రంలో కూడా ఒక సన్నివేశంలో ఎన్టీఆర్‌, రమణారెడ్డి ఆడ వేషాల్లో కనిపిస్తారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ కన్నడలోనూ, రమణారెడ్డి తమిళ్‌లోనూ మాట్లాడం ద్వారా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించారు.

తెలుగులో తొలి సోషియో ఫాంటసీ చిత్రం ‘దేవాంతకుడు’. ఈ చిత్రం చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది. 1960లో సి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రేమించిన అమ్మాయిని కలుసుకునేందుకు ఆడవేషంలో వస్తారు ఎన్టీఆర్‌. అలా సి.పుల్లయ్య, సి.ఎస్‌.రావు... ఎన్టీఆర్‌ను స్త్రీ పాత్రలో చూపించిన తండ్రీకొడుకులుగా ఘనత వహించారు. 1966లో బి.విఠలాచార్య దర్శకత్వంలో డి.వి.ఎస్‌.రాజు నిర్మించిన ‘పిడుగురాముడు’ చిత్రంలోనూ మరోసారి ఎన్టీఆర్‌ స్త్రీ పాత్రలో కనిపించి మెప్పించారు. విలన్‌ రాజనాల బారి నుండి తప్పించుకునేందుకు ఎన్టీఆర్‌, పద్మనాభం ఆడవేషాలు వేస్తారు. ఆ సందర్భంలో ‘రంగులు రంగులు...’ అంటూ సాగే పాట ప్రేక్షకుల్ని బాగా అలరించింది. ‘అన్న తమ్ముడు’లో ఎన్టీఆర్‌ ఆడవేషం వేసినప్పటికీ ఆ సందర్భంలో వచ్చే పాటలో ఘంటసాల గాత్రం వినిపిస్తుంది. ‘పిడుగు రాముడు’ చిత్రంలో మాత్రం ఎన్టీఆర్‌కు ఎల్‌.ఆర్‌.ఈశ్వరి వాయిస్‌ను ఉపయోగించడం విశేషం.

ఆ తర్వాత బి.ఎ.సుబ్బారావు రూపొందించిన ‘రైతుబిడ్డ’ చిత్రంలోని ఒక సన్నివేశంలో అర్థనారీశ్వర వేషంలో అలరించారు ఎన్టీఆర్‌. 1979లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘డ్రైవర్‌ రాముడు’ చిత్రంలో సత్యనారాయణతోపాటు ఎన్టీఆర్‌ కూడా ఆడవేషం వేసుకొని ఓ హోటల్‌లో పిండిరుబ్బుతూ చక్కని వినోదాన్ని పంచారు. ‘అన్నతమ్ముడు’ నుంచి ‘డ్రైవర్‌ రాముడు’ వరకు ఎన్టీఆర్‌ స్త్రీ పాత్రలో నటించిన సినిమాలన్నీ ఘనవిజయం సాధించడం విశేషం. పౌరాణిక, జానపద, చారిత్రాత్మక పాత్రల్లోనే కాదు, స్త్రీ వేషంలోనూ ప్రేక్షకుల్ని మెప్పించిన ఘనత నటరత్న ఎన్‌.టి.రామారావుకు దక్కుతుంది.