Read more!

English | Telugu

జనం మధ్యలోనే ఉన్నా చార్లీ చాప్లిన్‌ని ఎవరూ గుర్తించలేదు.. ఎందుకంటే?

ప్రపంచంలో ఏ నటుడికీ లేని ప్రత్యేకత చార్లీ చాప్లిన్‌కి ఉంది. అదేమిటంటే అతను సినిమాల్లో వేసే గెటప్‌లో కాకుండా విడిగా మన ముందు నిలబడ్డా అతను చార్లీ చాప్లిన్‌ అని గుర్తించలేం. అంతగా ఆ క్యారెక్టర్‌ జనంలోకి వెళ్లింది.  ప్రపంచాన్ని నాలుగు దశాబ్దాలపాటు నవ్వుల్లో ముంచెత్తిన ఆయన్ని అభిమానించనివారు, ఇష్టపడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. హిట్లర్‌ని పోలిన వేషధారణతో అతను చేసిన సినిమాలన్నీ భారీ విజయాన్ని అందుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకోవడంతో ప్రేక్షకుల్లో చార్లీ చాప్లిన్‌ అంటే ఒక క్రేజ్‌ ఏర్పడింది. 

అందరికీ విచిత్రంగా అనిపించే ఆ వేషధారణతోనే నవ్వులు పూయించేవాడు చాప్లిన్‌. ఇక తన హావభావాలతో, చిలిపి చేష్టలతో ప్రేక్షకులకు కితకితలు పెట్టేవాడు. తలపై టోపీ, చేతిలో కర్ర, చిన్న మీసం, నల్ల సూటు ఇవి వుంటే చాలు ఎవరైనా చార్లీ చాప్లిన్‌ అయిపోవచ్చు అన్నట్టుగా ఆ వేషధారణ ఉండేది. మాటలు లేకుండా, కేవలం బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో అతని సినిమాలు ఉండేవి. మాటలు లేకపోయినా అప్పుడప్పుడు వచ్చే సబ్‌ టైటిల్స్‌తో సినిమా అందరికీ పూర్తిగా అర్థమైపోయేది. 

చార్లీ చాప్లిన్‌కి ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని బెల్లింగ్‌హామ్‌ అనే ఊరిలోని లిబర్టీ థియేటర్‌ యజమాని ఒక వినూత్న ప్రయోగం చేశాడు. 1921లో ‘ది ఐడిల్‌ క్లాస్‌’ అనే సినిమా ఆ థియేటర్‌లో రిలీజ్‌ అయింది. ఈ సినిమాకి ముందు వచ్చిన ‘ది ట్రాంప్‌’ చిత్రంలోని చార్లీ చాప్లిన్‌ గెటప్‌ వేసుకొని ఎంతమంది వచ్చినా వారికి ‘ది ఐడిల్‌ క్లాస్‌’ సినిమాని ఉచితంగా చూపిస్తాం అని ప్రకటించాడు. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. ఎంతో మంది పెద్దవారు, పిల్లలు ఆ గెటప్‌ వేసుకొని థియేటర్‌కి వచ్చారు. అంతమంది చాప్లిన్స్‌ని చూసిన జనం విస్తుపోయారు. ఇది తన జీవితంలో ఒక స్వీట్‌ మెమరీగా మిగిలిపోతుందని ఆ థియేటర్‌ యజమాని వ్యాఖ్యానించాడు. సినిమా ప్రదర్శన తర్వాత అందర్నీ ఒక గ్రూప్‌ ఫోటో తీసి అప్పట్లో ఎంతో పాపులర్‌ అయిన స్పాన్‌ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. 

అదే రోజు చార్లీ చాప్లిన్‌ గెటప్‌ విషయంలో మరో గమ్మత్తయిన విషయం జరిగింది. అక్కడికి వచ్చిన చాప్లిన్స్‌ అందర్నీ పరిశీలించి విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించాలని థియేటర్‌ యజమాని భావించాడు. ఆ సమయంలో అక్కడి వారికి తెలియని విషయం ఏమిటంటే ఆ గుంపులో చార్లీ చాప్లిన్‌ కూడా ఉన్నాడు. అందర్నీ పరిశీలించిన న్యాయనిర్ణేతలు ఒక వ్యక్తిని విజేతగా ప్రకటించారు. పైగా అతను అచ్చు చార్లీ చాప్లిన్‌లాగే ఉన్నాడంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అలా రెండో బహుమతి, మూడో బహుమతి.. ఇలా ఆ గెటప్‌లో వచ్చిన వారందరికీ వరస క్రమంలో బహుమతులు అందజేశారు. విచిత్రం ఏమిటంటే చార్లీ చాప్లిన్‌కి 20వ స్థానం లభించింది. అక్కడికి వచ్చిన చాప్లిన్స్‌ మధ్యలోనే ఉన్న తనని ఎవరూ గుర్తించకపోవడం చార్లీ చాప్లిన్‌కి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ తర్వాత జరిగిన ఒక కార్యక్రమంలో తాను కూడా లిబర్టీ థియేటర్‌కి వచ్చానని వెల్లడించారు చాప్లిన్‌. అప్పుడు ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతు అయింది.