Read more!

English | Telugu

సినీ రంగమా ఎల్లవేళలా వర్థిల్లు!

భారతీయుల వినోదంలో సినిమాలకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. కోట్లాదిమందికి సినిమాలే ప్రధాన ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉన్నాయడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ ఇలా దేశవ్యాప్తంగా వివిధ భాషల సినిమా ఇండస్ట్రీలు ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. భారతీయులను ఇంతగా అలరిస్తున్న చలనచిత్రాలకు ‘జాతీయ సినిమా దినోత్సవం’ ఉంది. అక్టోబర్ 13 న జాతీయ సినిమా దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే జాతీయ సినిమా దినోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారు?, ఎప్పుడు మొదలైంది? దాని విశేషాలను తెలుసుకుంటే..

జాతీయ సినిమా దినోత్సవాన్ని నిర్వహించాలని 2022లో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) నిర్ణయించింది. కొవిడ్-19 మహమ్మారి విపత్కాలంలో సినిమా థియేటర్లు దీర్ఘకాలంపాటు మూతపడ్డాయి. ఆ తర్వాత సినిమా హాళ్లను తిరిగి తెరిచిన సందర్భాన్ని పురష్కరించుకొని జాతీయ సినిమా దినోత్సవాన్ని ఎంఏఐ ప్రారంభించింది. కరోనా సమయంలో భారీ నష్టాలు చవిచూసిన సినిమా హాళ్ల  యజమానులకు దన్నుగా నిలిచేందుకు సినీ ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా ప్రోత్సహించే ప్రధాన ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ సినిమా దినోత్సవ నిర్వహణ వెనుక మరో ముఖ్య కారణం కూడా ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ రూపంలో ముప్పు పెరగడం కూడా ఒక కారణం. ముఖ్యంగా కరోనా కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పెద్ద ఎత్తున పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో జాతీయ సినిమా దినోత్సవం రోజున టికెట్ల రేట్లపై డిస్కౌంట్ అందిస్తే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కౌంటర్ ఇచ్చినట్టుగా ఉంటుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భావించింది.

ఏ తేదీన నిర్వహిస్తారు?

జాతీయ సినిమా దినోత్సవం నిర్వహణకు ప్రత్యేక తేదీ అంటూ ఏదీ నిర్ణయించలేదు. గతేడాది కొన్ని తేదీలను మార్చి చివరకు సెప్టెంబర్ 23న నిర్వహించారు. టికెట్ రేట్లపై మంచి డిస్కౌంట్ అందించడంతో గతేడాది జాతీయ సినిమా దినోత్సవం సక్సెస్ అయ్యింది. తగ్గింపుతో కేవలం రూ.75కే టికెట్లు అందుబాటులో ఉంచడంతో రికార్డ్ స్థాయిలో ఒకే రోజు లక్షలాది టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది  అక్టోబర్ 13న సినిమా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈసారి కూడా థియేటర్ యజమానులు డిస్కౌంట్‌పై సినిమా టికెట్లను అందుబాటులో ఉంచారు. రూ.99లకే టికెట్లను అందుబాటులో ఉంచింది. ఈ సంవత్సరం పీవీఆర్, ఐనాక్స్, సినీపోలీస్, ఏసియాన్‌తోపాటు పలు మల్టీప్లెక్స్‌లు ఆఫర్లు ప్రకటించాయి.

ఇక ఎంఏఐనిప్రముఖ సినిమా ఆపరేటర్లు 2002లో ప్రారంభించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) కింద పనిచేస్తుంది. ఎంఏఐలో 11 కంటే ఎక్కువ సినిమా చైన్ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు లేదా కంపెనీలు దేశవ్యాప్తంగా 500కి పైగా మల్టీప్లెక్స్‌లను నిర్వహిస్తున్నాయి. దాదాపు 2500పైగా స్ర్కీన్‌లను నిర్వహిస్తున్నాయి. భారత్‌లోని సినిమా థియేటర్లలో ఈ మల్టీప్లెక్స్‌ల వాటా దాదాపు 75 శాతంగా ఉంది. కరోనా కష్టకాలం తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సినిమా రంగం ఎల్లవేళలా వర్ధిల్లి ఆ రంగాన్ని నమ్ముకున్నవారికి ఎల్లప్పుడూ ఉపాధి కల్పించాలని జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా ఆకాంక్షిద్దాం..