English | Telugu

తరతరాలకు తరగని వెలుగు.. యుగపురుషుడు ఎన్.టి.ఆర్!

(మే 28 నటరత్న ఎన్‌.టి.రామారావు జయంతి సందర్భంగా..)

‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహా పురుషులౌతారు. తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలవేలుపులౌతారు..’ అంటూ వేటూరి రాసిన పాట.. తెలుగుతెర ఇలవేల్పు నందమూరి తారక రామారావుకు సరిగ్గా సరిపోతుంది. ఆయన సినీ ప్రస్థానం అంతా ఆ పాట పల్లవిలోనే కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటులు ఉంటారు. వివిధ తరహా పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని మెప్పిస్తారు. కానీ, ప్రేక్షకులు దైవంగా భావించే మహానటుడు ఎన్‌.టి.రామారావు ఒక్కరే. రాముడు, కృష్ణుడు, శివుడు అంటే మనకు ఆ మహానుభావుడి రూపమే స్ఫురిస్తుంది. ‘నేను భగవద్గీత చదువుతున్నప్పుడల్లా నీ రూపమే నాకు కృష్ణుడిగా కనిపిస్తుంది’ అని అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చెప్పారంటే.. నందమూరి తారక రామారావు ప్రజల గుండెల్లో ఎలాంటి స్థానాన్ని సంపాదించుకున్నారో అర్థమవుతుంది. ప్రపంచంలో ఎంతో మంది మహానుభావులు పుట్టారు. వారి వారి రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించి పది మందికీ ఆదర్శంగా నిలిచారు. అయితే అందులో కొందరు కారణజన్ములుగా పేరు తెచ్చుకున్నారు. ప్రజలు వారిని దైవంగా కొలిచారు. తమ గుండెల్లో పవిత్రమైన స్థానాన్ని ఇచ్చారు. అలాంటి అతి కొద్దిమంది మహానుభావుల్లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ఒకరు. తను చేసిన సినిమాల ద్వారా మన పురాణ పురుషులు రాముడు, కృష్ణుడు ఇలాగే ఉంటారేమో అనిపించేంతగా ప్రేక్షకుల్ని మైమరపించారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో అన్నిరకాల పాత్రలు పోషించి తిరుగులేని కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్‌.టి.ఆర్‌. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి కేవలం 9 నెలల్లోనే అధికారం చేజిక్కించుకొని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అక్కడ కూడా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. అలాంటి మహానుభావుడి జీవితం ఎంతో మందికి ఆదర్శం. అసలు ఎన్‌.టి.ఆర్‌. నేపథ్యం ఏమిటి? ఆయన సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది? రాజకీయంగా అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఎలాంటి కృషి చేశారు? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

1923, మే 28 సాయంత్రం 4:32కి కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్యచౌదరి, వెంకటరావమ్మ దంపతులకు జన్మించారు నందమూరి తారక రామారావు. పాఠశాల విద్యను విజయవాడ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. ఆ తర్వాత విజయవాడ ఎస్‌.ఆర్‌.ఆర్‌. కళాశాలలో చేరారు. ఆ సమయంలో విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతిగా ఉండేవారు. కళాశాల వార్షికోత్సవంలో ‘రాచమల్లుని దౌత్యం’ అనే నాటకం ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులోని నాగమ్మ పాత్ర వేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. కాలేజీలోనే మంచి అందగాడుగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్‌ను ఆ వేషం వెయ్యమన్నారు విశ్వనాథ సత్యనారాయణ. ఇష్టం లేకపోయినా ఆ పాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే మేకప్‌ మేన్‌ మీసాలు తీసెయ్యాలన్నారు. కానీ, దానికి ఎన్టీఆర్‌ ససేమిరా ఒప్పుకోలేదు. అలా మీసాలతోనే ఆడవేషం వేశారు. అప్పటి నుంచి ఎన్టీఆర్‌ను అందరూ మీసాల నాగమ్మా అని పిలిచేవారు. 1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నారు ఎన్టీఆర్‌. పెళ్లి తర్వాత చదువును అశ్రద్ధ చేయడం వల్ల పరీక్షల్లో రెండు సార్లు తప్పారు. ఆ తర్వాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్‌ కాలేజీలో చేరారు. అక్కడ కూడా నాటకాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆ సమయంలోనే నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్‌ సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం వంటి వారితో కలిసి నాటకాలు వేసేవారు. ఎన్టీఆర్‌ మంచి చిత్రకారుడు కూడా. రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీలలో అతనికి బహుమతి కూడా వచ్చింది.

ఎన్టీఆర్‌ చదువుకునే రోజుల్లోనే కొన్ని కారణాల వల్ల వారి ఆస్తి మొత్తం హరించుకుపోయింది. యువకుడిగా ఉన్న ఎన్టీఆర్‌ జీవనం కోసం చాలా పనులు చేసేవారు. కొన్నిరోజులు పాల వ్యాపారం చేశారు, ఆ తర్వాత కిరాణా షాపు పెట్టారు. ఆ తర్వాత ఒక ప్రింటింగ్‌ ప్రెస్‌ను కూడా నడిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అప్పు చేసేవారు కాదు. 1947లో ఎన్టీఆర్‌ పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష రాసారు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచారు. అప్పుడు అతనికి మంగళగిరిలో సబ్‌-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. ఎన్టీఆర్‌కు సినిమాలపై ఆసక్తి లేదుగానీ నాటకాలు మాత్రం ఎక్కువగా వేసేవారు. అలా ఓసారి విజయవాడలో ‘చేసిన పాపం’ అనే నాటకం వేశారు. అందులో ఎన్టీఆర్‌ నటన చూసిన ఎల్‌.వి.ప్రసాద్‌ గుంటూరులో ఫోటో షూట్‌ చేయించారు. ఆ తర్వాత మద్రాస్‌లో స్క్రీన్‌ టెస్ట్‌ చేశారు. అయితే ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలో వేషం లేదని, సరిపోయే వేషం ఉన్నప్పుడు కబురు చేస్తానని చెప్పారు ఎల్‌.వి.ప్రసాద్‌. అలా తిరిగి మంగళగిరి వచ్చేశారు ఎన్టీఆర్‌. కొన్నాళ్ళకు తను ‘మనదేశం’ అనే సినిమా చేస్తున్నానని, మద్రాస్‌ వస్తే చిన్న వేషం ఇస్తానని ఉత్తరం రాశారు. ఆ ఉత్తరానికి ఎన్టీఆర్‌ బదులు ఇవ్వలేదు.

ఆ సమయంలో నిర్మాత బి.ఎ.సుబ్బారావు.. ఎల్‌.వి.ప్రసాద్‌ దగ్గర ఎన్టీఆర్‌ ఫోటో చూసి తను నిర్మిస్తున్న ‘పల్లెటూరి పిల్ల’ చిత్రంలో హీరోగా అవకాశం ఇస్తాను, పిలిపించమన్నారు. ఇదే విషయాన్ని మరో ఉత్తరం ద్వారా ఎన్టీఆర్‌కు తెలిపారు ఎల్‌.వి.ప్రసాద్‌. మద్రాస్‌ వెళ్ళిన తర్వాత ఆ సినిమాలో ఎన్టీఆర్‌ను హీరోగా ఎంపిక చేశారు. రూ.1116 అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. ఆ సినిమాలో ఎఎన్నార్‌ కూడా నటించారు. ఎన్టీఆర్‌కి కెమెరా అలవాటు అవుతుందన్న ఉద్దేశంతో మనదేశం చిత్రంలో చిన్న పాత్ర ఇచ్చారు ఎల్‌.వి.ప్రసాద్‌. ఆ తర్వాత పల్లెటూరి పిల్ల షూటింగ్‌ ప్రారంభించారు. అదే సమయంలో షావుకారులో హీరోగా నటించే అవకాశం వచ్చింది. అయితే ఈ రెండు సినిమాల్లో షావుకారు మొదట రిలీజ్‌ అయింది. ఆ తర్వాత మాయా రంభ, సంసారం చిత్రాల్లో నటించారు ఎన్టీఆర్‌. ఇక ఆయన్ని తిరుగులేని మాస్‌ హీరోగా నిలబెట్టిన సినిమా పాతాళభైరవి. మొదట ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావును హీరోగా అనుకున్నారు. మాంత్రికుడి పాతకు ముక్కామలను ఎంపిక చేశారు. అయితే చివరి నిమిషంలో ఎన్టీఆర్‌ను హీరోగా, మాంత్రికుడిగా ఎస్‌.వి.రంగారావును ఎంపిక చేశారు. 1951లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించి ఎన్టీఆర్‌ను స్టార్‌ హీరోని చేసింది. ఈ చిత్రాన్ని 10 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించారు. ఆ తర్వాత రిపీట్‌ రన్‌లో భారీగా కలెక్షన్లు రాబట్టింది. పాతాళభైరవి చిత్రాన్ని విజయా సంస్థ నిర్మించింది. అప్పుడు ఆ సంస్థలో నెల జీతానికి ఎన్టీఆర్‌ సినిమాలు చేసేవారు. నెలకు రూ.500, ఒక సినిమా పారితోషికం రూ.5000. అలా మల్లీశ్వరి, పెళ్లి చేసి చూడు, చంద్రహారం చిత్రాలు చేశారు. ఈ సినిమాలన్నీ ఎన్టీఆర్‌కు ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించిపెట్టాయి. ఆ తర్వాత వద్దంటే డబ్బు, రాజుపేద, అగ్గిరాముడు, మిస్సమ్మ, కన్యాశుల్కం వంటి సినిమాల్లో ఎన్టీఆర్‌ ప్రదర్శించిన నటనకు అందరూ ముగ్దులయ్యారు. 1957లో వచ్చిన మాయాబజార్‌లో ఎన్టీఆర్‌ పోషించిన శ్రీకృష్ణుడి పాత్రతో నీరాజనాలు అందుకున్నారు. ఆ తర్వాత భూకైలాస్‌లోని రావణబ్రహ్మ పాత్రకు జీవం పోశారు ఎన్టీఆర్‌. అలాగే శ్రీవేంకటేశ్వర మహత్మ్యం చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా, సీతారామకళ్యాణం చిత్రంలో మరోసారి రావణ పాత్ర పోషించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆ క్రమంలోనే శ్రీకృష్ణార్జునయుద్ధం, కర్ణ, లవకుశ, శ్రీరామాంజనేయ యుద్ధం, దక్షయజ్ఞం, నర్తనశాల, దానవీరశూర కర్ణ వంటి పురాణ ఇతిహాసాలలో తను పోషించిన పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల పాలిట దైవంగా కీర్తించబడ్డారు ఎన్టీఆర్‌.

పౌరాణిక పాత్రల్లోనే కాదు, జానపద చిత్రాల్లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు ఎన్టీఆర్‌. జయసింహ, జయం మనదే, కంచుకోట, బందిపోటు, గులేబకావళి కథ, మంగమ్మ శపథం, జగదేకవీరుని కథ, మర్మయోగి, అగ్గిపిడుగు వంటి ఎన్నో జానపద చిత్రాల్లో సైతం తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు ఎన్టీఆర్‌. పౌరాణిక, జానపద చిత్రాలే కాకుండా సాంఘిక చిత్రాల్లో ఎన్టీఆర్‌ పోషించిన పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సాంఘిక చిత్రాల్లో అప్పుచేసి పప్పుకూడు, పెళ్లిచేసి చూడు, మిస్సమ్మ, గుండమ్మ కథ, గుడిగంటలు, రక్తసంబంధం, రాముడు భీముడు వంటి సినిమాల్లో ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచారు. 1970వ దశకంలో దానవీరశూర కర్ణ, అడవిరాముడు, యమగోల, వేటగాడు, డ్రైవర్‌ రాముడు వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో కమర్షియల్‌గా పెద్ద విజయాలు అందుకున్నారు ఎన్టీఆర్‌. 1980 దశకంలో సర్దార్‌ పాపారాయుడు, బొబ్బిలిపులి, కొండవీటి సింహం, జస్టిస్‌ చౌదరి, నాదేశం వంటి బ్లాక్‌ బస్టర్స్‌తో ఎన్టీఆర్‌ కెరీర్‌ పీక్స్‌కి వెళ్లిపోయింది. అలాగే చారిత్రాత్మక చిత్రాలైన బొబ్బిలియుద్ధం, సామ్రాట్‌ అశోక, శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, శ్రీనాథ కవిసార్వభౌముడు, చాణక్య చంద్రగుప్త, అక్బర్‌ సలీమ్‌ అనార్కలి వంటి సినిమాల్లోని చారిత్రాత్మక పాత్రల్లోనూ తన ముద్ర వేశారు ఎన్టీఆర్‌. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ బిరుదాంకితుడైన ఎన్‌.టి.రామారావు తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో 13 చారిత్రక, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేసారు. 1968లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1978లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు ‘కళాప్రపూర్ణ’ స్వీకరించారు.

నటుడిగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించడం వెనుక ఎంతో కృషి ఉంది. ఎన్టీఆర్‌ను క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకోవచ్చు. ఆ విషయంలో ఆయనకు ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఉదయం ఏడు గంటలకు షూటింగ్‌ అంటే.. ఆ సమయానికి మేకప్‌తో సహా సెట్‌లో ఉండడం మొదటి నుంచీ అలవాటు చేసుకున్నారు. చివరి వరకు దాన్నే అనుసరించారు. శరీర దారుఢ్యం కోసం ప్రతిరోజూ కఠోరమైన వ్యాయామాలు, తన స్వరాన్ని కాపాడుకునేందుకు ఉదయమే మద్రాస్‌లోని మెరీనా బీచ్‌కి వెళ్లి అభ్యాసం చేసేవారు. నర్తనశాల చిత్రంలో ఎన్టీఆర్‌ పోషించిన బృహన్నల పాత్ర కోసం అవసరమైన కూచిపూడి నృత్యాన్ని వెంపటి చినసత్యం దగ్గర నేర్చుకున్నారు. వృతి పట్ల, తను చేసే పాత్రల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత అలాంటిది. ఆయన ఏకసంథాగ్రహి. ఎన్ని పేజీల డైలాగులు ఇచ్చినా కంఠతా పట్టేసేవారు. షాట్‌లో ఎక్కడా తడబడకుండా నటిస్తూ పొల్లుపోకుండా డైలాగులు చెప్పేవారు.

1978లో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది. కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత కుమ్ములాటల కారణంగా తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు. ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారడంతో కాంగ్రెస్‌ పార్టీ అప్రతిష్టపాలైంది. 1981లో సర్దార్‌ పాపారాయుడు చిత్రం షూటింగ్‌ విరామ సమయంలో ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. వారికి ఏదో ఒకటి చెయ్యాలనే కృతనిశ్చయంతో ఉన్నాను. అందులో భాగంగానే ఈ ఏడాది నా పుట్టినరోజు తర్వాత నెలలో 15 రోజులు తెలుగు ప్రజల సేవ కోసం కేటాయిస్తాను’ అని చెప్పారు. భవిష్యత్తులో ఎన్టీఆర్‌ చేయబోయే రాజకీయ ప్రయాణానికి అక్కడే బీజం పడ్డట్టు అయింది. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకోవడంతో అప్పటివరకు కమిట్‌ అయిన సినిమాలను వేగంగా పూర్తి చేశారు. తమ అభిమాన కథానాయకుడు రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్త తెలుసుకున్న అభిమానులు 1982 మార్చి 21న హైదరాబాద్‌ వచ్చినపుడు ఆయనకు ఎర్ర తివాచీతో ఘన స్వాగతం పలికారు. 1982 మార్చి 29 మధ్యాహ్నం గం2:30లకు తను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టు, తన స్థాపించబోయే పార్టీ పేరు తెలుగుదేశం అని ప్రకటించారు ఎన్టీఆర్‌. పార్టీ ప్రచారం కోసం తన పాత చెవర్లెట్‌ వ్యానుకు మరమ్మతులు చేయించి దాన్ని కదిలే వేదికగా మార్పించారు. ఆ వ్యానుపై నుంచే ప్రజల నుద్దేశించి ప్రసంగించేవారు. ఆ వాహనం పేరు చైతన్యరథం. దానిపై తెలుగుదేశం పిలుస్తోంది. రా! కదలిరా! అనే నినాదం రాయించారు.

చైతన్యరథంపై ఆంధ్రప్రదేశ్‌ నలుమూలలకు తన ప్రచారాన్ని నిర్వహించారు ఎన్టీఆర్‌. ఒక శ్రామికుడిలా ఖాకీ దుస్తులు ధరించి, నిరంతరం ప్రయాణిస్తూ, ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజలను ఎంతో ప్రభావితం చేసారు. ఎన్టీఆర్‌ ప్రసంగాలు ప్రజలను ఎంతో ఆకట్టుకునేవి. కాంగ్రెసు పార్టీ వల్ల తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదనీ, దాన్ని ఢల్లీిలో తాకట్టు పెట్టారనీ విమర్శిస్తూ, ఆ ఆత్మగౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. కాంగ్రెస్‌ విధానాల పట్ల అప్పటికే విసుగెత్తిన ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు.
1983 జనవరి 7న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. తెలుగుదేశం 199, కాంగ్రెస్‌ 60, సిపిఐ 4, సిపిఎం 5, బిజెపి 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్టీఆర్‌ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సమయంలోనే జరిగిన కొన్ని పరిణామాలతో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. దొడ్డిదారిన నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు ప్రజల్లోకి వెళ్లారు ఎన్టీఆర్‌. కేవలం నెలరోజుల్లోనే ముఖ్యమంత్రి పదవిని తిరిగి చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. 1994లో ఎన్టీఆర్‌ తిరిగి అధికారంలోకి వచ్చారు. పార్టీని ప్రకటించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం, అప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధిపత్యానికి తెరదించడం అనేది దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మూడు దఫాలు, 7 సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఎన్‌.టి.రామారావు. అప్పటివరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో రెండు రూపాయలకే కిలో బియ్యం, సంపూర్ణ మద్య నిషేధం, పటేల్‌ పట్వారి వ్యవస్థల రద్దు, మహిళలకు ఆస్తి హక్కు, బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్ళు వంటి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

ఎన్‌.టి.రామారావు వ్యక్తిగత విషయాలకు వస్తే.. నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. పదకొండు మందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్‌ కృష్ణ కుమారులు కాగా, లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు. కుమారుల్లో హరికృష్ణ తండ్రి రాజకీయ జీవితంలో చేదోడు వాదోడుగా ఉండేవారు. చైతన్యరథానికి సారధిగా వ్యవహరించారు. ఇక నందమూరి తారక రామారావు నట వారసుడిగా నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్ర సీమలో తన జైత్రయాత్ర కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.