English | Telugu

కీ బోర్డ్‌ ప్లేయర్‌ నుంచి స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ వరకు మణిశర్మ జర్నీ ఇదే!

సినీ సంగీత ప్రపంచంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించి టాలీవుడ్‌లోని స్టార్‌ హీరోలందరికీ మ్యూజికల్‌ హిట్స్‌ అందించిన సంగీత దర్శకుడు మణిశర్మ. స్టార్‌ హీరోలకే కాదు వర్థమాన హీరోల సినిమాలకు కూడా అద్భుతమైన స్వరాలను సమకూర్చి మెలోడీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు మణిశర్మ. తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడ భాషల్లో 200కి పైగా సినిమాలకు సంగీతాన్ని అందించిన ఆయన నేపథ్యం ఏమిటి, సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది, మ్యూజికల్‌గా మణిశర్మ సాధించిన విజయాలేమిటి? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

1964 జూలై 11న కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జన్మించారు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్యశర్మ. సినీరంగంలోకి ప్రవేశించిన తర్వాత మణిశర్మగా తన పేరును మార్చుకున్నారు. తండ్రి నాగయజ్ఞశర్మ వయొలిన్‌ కళాకారుడు. సినిమాల్లో పనిచేయాలన్న ఉద్దేశంతో కుటుంబంతో సహా మద్రాస్‌ చేరుకున్నారు నాగయజ్ఞశర్మ. అలా మణిశర్మ అక్కడే పెరిగారు. అతనికి సంగీతం పట్ల ఉన్న ఆసక్తిని గమనించి చిన్నతనంలోనే వయొలిన్‌, మాండొలిన్‌, గిటార్‌ నేర్పించారు తండ్రి. ఆ తర్వాతికాలంలో ఈ వాయిద్యాల కంటే కీబోర్డ్‌ ప్లేయర్‌కే ఎక్కువ ఆదాయం వస్తోందని గమనించిన నాగయజ్ఞశర్మ.. మణిశర్మకు కీబోర్డ్‌ కూడా నేర్పించారు. ఇళయరాజా, ఎ.ఆర్‌.రెహమాన్‌ వంటి చాలా మందికి గురువైన జాకబ్‌జాన్‌ దగ్గర వెస్ట్రన్‌ మ్యూజిక్‌ నేర్చుకున్నారు మణిశర్మ. అలాగే కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నారు. ఇంటర్‌ సెకండియర్‌లోనే చదువు ఆపేసి సంగీతాన్నే వృత్తిగా చేసుకున్నారు.

1982లో సంగీత దర్శకుడు సత్యం దగ్గర కీబోర్డ్‌ ప్లేయర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు మణిశర్మ. ఆ తర్వాత ఇళయరాజా, ఎం.ఎం.కీరవాణి, రాజ్‌, కోటి, వందేమాతరం శ్రీనివాస్‌ వంటి సంగీత దర్శకుల దగ్గర పనిచేశారు. ఎ.ఆర్‌.రెహమాన్‌తో కలిసి కీబోర్డు సహాయకుడిగా వర్క్‌ చేశారు. కీరవాణి మొదటి సినిమా మనసు మమత నుంచి ఆయన చేసిన ప్రతి సినిమాకీ మణిశర్మ పనిచేశారు. క్షణక్షణం సినిమాకి రీరికార్డింగ్‌ చేస్తున్న సమయంలో స్టూడియోకి వచ్చిన రామ్‌గోపాల్‌వర్మ.. మణిశర్మలోని టాలెంట్‌ను గుర్తించి తన దర్శకత్వంలో వచ్చిన ‘రాత్రి’ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేసే అవకాశం ఇచ్చారు. అలాగే ఆ సినిమా కోసం ‘చలెక్కి ఉందనుకో..’ అనే పాటను కూడా రికార్డ్‌ చేయించారు. అయితే ఆ పాటను నాగార్జున హీరోగా వర్మ చేసిన ‘అంతం’ సినిమాకి ఉపయోగించారు. మణిశర్మ తొలిసారి స్వరకల్పన చేసిన పాట అదే.

1997లో ఏవీయస్‌ దర్శకత్వంలో డి.రామానాయుడు నిర్మించిన ‘సూపర్‌ హీరోస్‌’ చిత్రం ద్వారా పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు మణిశర్మ. ఆ తర్వాత ప్రేమించుకుందాం రా చిత్రానికి మహేష్‌ మహదేవన్‌తో కలిసి సంగీతాన్ని అందించారు. చిరంజీవి హీరోగా జయంత్‌ దర్శకత్వంలో వచ్చిన ‘బావగారూ బాగున్నారా’ చిత్రం మణిశర్మకు సంగీత దర్శకుడుగా బ్రేక్‌ ఇచ్చింది. ఆ సినిమాలోని పాటలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఇక అక్కడి నుంచి చిరంజీవి సినిమాలకు వరసగా సంగీతాన్ని అందించారు. హీరో ఎవరైనా టాలీవుడ్‌లోని టాప్‌ డైరెక్టర్స్‌ అంతా మణిశర్మకే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అవకాశాలు ఇచ్చేవారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, పవన్‌కళ్యాణ్‌, మహేష్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌.. ఇలా అందరు హీరోల సినిమాలకు సంగీతం అందించారు మణిశర్మ. ఇతని సంగీతం చాలా వరకు ఫాస్ట్‌ బీట్‌తో, మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేదిగా ఉంటుంది. కానీ ఆయన చేసిన ప్రతి సినిమాలోనూ కనీసం ఒక్కటైనా మెలోడీ ఉంటుంది. అందుకే మణిశర్మను మెలోడీ బ్రహ్మ అంటారు.

1997 నుంచి ఇప్పటివరకు బ్రేక్‌ అనేది లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు మణిశర్మ. ఇతర సంగీత దర్శకులు పనిచేసిన ఎన్నో సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. అలాగే చెన్నయ్‌ సూపర్‌ కింగ్స్‌, మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్‌బాస్‌ సీజన్‌4కి థీమ్‌ మ్యూజిక్‌ చేశారు. ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకులుగా కొనసాగుతున్న థమన్‌, దేవిశ్రీప్రసాద్‌, హ్యారిస్‌ జైరాజ్‌ తొలిరోజుల్లో మణిశర్మ దగ్గర పనిచేశారు. ఇతని తనయుడు మహతి స్వర సాగర్‌ కూడా సంగీత కళాకారుడే. ఇప్పటికి 20 సినిమాలకు సంగీతం అందించడమే కాకుండా కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడారు.