English | Telugu

వేరే భాషల్లోకి రీమేక్ అయిన మెగాస్టార్ మూవీస్.. ఏంటో తెలుసా!

మెగాస్టార్ చిరంజీవికి రీమేక్స్ తో మంచి అనుబంధమే ఉంది. ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అనదగ్గ కొన్ని సినిమాలు.. వేరే భాష నుంచి రీమేక్ అయ్యాయి. అదే సమయంలో.. చిరంజీవి నటించిన కొన్ని స్ట్రయిట్ మూవీస్.. ఇక్కడ మంచి విజయం సాధించడంతో పాటు వేరే భాషల్లోకి రీమేక్ అయ్యాయి. అలా ఇతర భాషల్లో రీమేక్ అయిన చిరంజీవి సినిమాల వివరాల్లోకి వెళితే..

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య : 1982లో రిలీజై ఘనవిజయం సాధించిన 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య'.. తమిళంలో 'వీటుల రామన్ వెళియల కృష్ణన్', కన్నడంలో 'మనెలి రామన్న బీధిలి కామన్న', హిందీలో 'ఘర్ మే రామ్ గలీ మే శ్యామ్' పేర్లతో రీమేక్ అయింది.
అభిలాష: 1983లో విడుదలైన ఈ నవలా చిత్రం.. తమిళంలో 'సట్టత్తై తిరుతుంగళ్' పేరుతో రీమేక్ అయ్యింది.
ఖైదీ: చిరంజీవి కెరీర్ ని మేలిమలుపు తిప్పిన సినిమా 'ఖైదీ'.. అమెరికన్ ఫిల్మ్ 'ఫస్ట్ బ్లడ్' స్ఫూర్తితో తెరకెక్కింది. 1983లో విడుదలై సంచలన విజయం సాధించిన 'ఖైదీ'.. 1984లో హిందీ, కన్నడ భాషల్లో అదే పేరుతో రీమేక్ అయింది.
యముడికి మొగుడు: సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ తో రూపొందిన 1988 నాటి 'యముడికి మొగుడు'.. 1990లో 'అతిశయ పిరవి' పేరుతో తమిళ్ లో రీమేక్ అయింది.
అత్తకు యముడు అమ్మాయికి మొగుడు: 1989 సంక్రాంతి సెన్సేషన్ 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు'.. 1989 సంవత్సరంలో 'మాపిళ్ళై' పేరుతో తమిళంలో, 1990లో 'జమై రాజా' పేరుతో హిందీలో, 2000లో 'ససుర్ బారి జిందాబాద్' పేరుతో బెంగాలీలో రీమేక్ అయింది.
గ్యాంగ్ లీడర్: కథానాయకుడిగా చిరంజీవి కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్ళిన మాస్ ఎంటర్టైనర్ 'గ్యాంగ్ లీడర్'. 1991లో జనం ముందు నిలిచిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ.. హిందీలో 'ఆజ్ కా గుండారాజ్' పేరుతో రీమేక్ అయింది. 1992లో విడుదలైన ఈ సినిమాలోనూ చిరంజీవినే హీరోగా నటించారు. ఇక ఇదే చిత్రం 2003లో 'కుటుంబ' పేరుతో కన్నడ భాషలోకి రీమేక్ అయింది.
బావగారూ బాగున్నారా: 1998లో విడుదలై మంచి విజయం సాధించిన 'బావగారూ బాగున్నారా'.. బాలీవుడ్ లోకి 'కున్వారా' పేరుతో రీమేక్ అయింది. 2000 సంవత్సరంలో ఈ రీమేక్ రిలీజైంది.
చూడాలని వుంది: 1998లో రిలీజైన మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ 'చూడాలని వుంది'.. హిందీనాట 'కలకత్తా మెయిల్' పేరుతో 2003లో రీమేక్ అయింది.
అన్నయ్య: 2000 సంక్రాంతికి వినోదాలు పంచిన 'అన్నయ్య' చిత్రం.. 2005లో 'దేవ్ దూత్' పేరుతో బెంగాలీలోకి రీమేక్ అయింది.
ఇంద్ర: 2002లో రిలీజై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన 'ఇంద్ర'.. 2005లో ఇండియన్ బెంగాలీలో 'దాదా' పేరుతోనూ, 2006లో బంగ్లాదేశీ బెంగాలీలో 'గోరిబేర్ దాదా' పేరుతోనూ రీమేక్ అయింది.
స్టాలిన్: చిరంజీవి నటించిన మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ 'స్టాలిన్' 2006లో రిలీజ్ కాగా.. ఆ సినిమా హిందీ రీమేక్ 'జయహో' 2014లో జనం ముందు నిలిచింది.

(ఆగస్టు 22.. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా)