English | Telugu

ఆ సినిమా విషయంలో చిరంజీవి అనుకున్నదే జరిగింది.. వెంకటేష్‌కి మాత్రం బాధ మిగిలింది!

కొన్ని కథలు హీరోలు, వారి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తారు. అంతకుముందు వారు చేసిన ఆ తరహా సినిమాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అలా జాగ్రత్తలు తీసుకున్న ఎన్నో సినిమాలు విజయం సాధించాయి. అయితే కొన్ని సార్లు ‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి’ అనే ధోరణిలో సినిమాలు తయారవుతుంటాయి. ఏ డైరెక్టర్‌ అయినా తాను అనుకున్న కథకు లేదా ఎంపిక చేసుకున్న కథకు హీరో ఎవరైతే బాగుంటుంది అనేది జడ్జ్‌ చెయ్యగలిగితే సగం సక్సెస్‌ సాధించినట్టే. కానీ, కొన్ని సందర్భాల్లో డైరెక్టర్ల అంచనాలు తారుమారు అవుతుంటాయి. కథ, కథనాలు, హీరో పెర్‌ఫార్మెన్స్‌.. ఇలా అన్నీ బాగున్నా సరే ఆ సినిమా ఫ్లాప్‌ అవుతుంది. అందుకే ఈ విషయంలో హీరోలు ఆచి తూచి అడుగులు వేస్తుంటారు. అయితే కొన్ని సినిమాలు మొహమాటం కొద్దీ చేస్తారు. కానీ, రిలీజ్‌ అయిన తర్వాత అనుకున్నట్టుగానే ఆ సినిమాలకి ప్రేక్షకాదరణ లభించదు.

అలాంటి ఓ విచిత్రమైన పరిస్థితి మెగాస్టార్‌ చిరంజీవికి వచ్చింది. సాధారణంగా దర్శకనిర్మాతలు తన దగ్గరికి తీసుకొచ్చే కథ తనకు సూట్‌ కాదు అనిపిస్తే నిర్మొహమాటంగా చెప్పేసేవారు. అంతేకాదు, ఆ కథ ఏ హీరోకైతే బాగుంటుంది అనే సలహా కూడా ఇచ్చేవారు. అలా తను చెయ్యాల్సిన ఎన్నో సినిమాలకు ఇతర హీరోల పేర్లను సూచించేవారు. 2001 ప్రారంభంలో చిరంజీవికి రచయిత భూపతిరాజా ఒక కథ వినిపించారు. అదే ‘డాడీ’. కథ విన్న చిరంజీవి అది తనకంటే వెంకటేష్‌కైతే బాగుంటుందని, ఆ తరహా కథలకు అతను న్యాయం చెయ్యగలడని చెప్పారు. ‘ఇప్పటివరకు మీరు మాస్‌, యాక్షన్‌ సినిమాలు చేస్తూ వచ్చారు. ఈ కథ మీకు వెరైటీగా ఉంటుంది. ఒక పర్‌ఫెక్ట్‌ ఫ్యామిలీ మేన్‌గా మీరు సూట్‌ అవుతారు’ అని చెప్పారు. ఆ కథ విన్న నిర్మాత అల్లు అరవింద్‌ కూడా అదే ఫీల్‌ అయ్యారు. దాంతో తనకు ఇష్టం లేకపోయినా.. రచయిత, నిర్మాతల బలవంతం మీద ఆ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారు చిరంజీవి. సురేష్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సిమ్రాన్‌ హీరోయిన్‌గా నటించింది. 2001 అక్టోబర్‌ 4న ‘డాడీ’ చిత్రం విడుదలైంది.

కథ పరంగా సినిమా బాగానే వున్నప్పటికీ అది చిరంజీవి మీద వర్కవుట్‌ కాలేదు. చిరంజీవి ఇమేజ్‌ దృష్ట్యా కమర్షియల్‌గా ఏవరేజ్‌గా నిలిచి ఫర్వాలేదు అనిపించుకుంది. ఈ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత చిరంజీవికి ఫోన్‌ చేసిన వెంకటేష్‌ ‘సినిమా చూశాను. చాలా బాగుంది. ఈ కథ నాకైతే బాగుండేది. కమర్షియల్‌గా కూడా సక్సెస్‌ అయ్యేది’ అని చెప్పడంతో ఆ కథపై తనది కూడా అదే అభిప్రాయమనీ, అయితే ఎవరూ తన మాట వినలేదని వెంకటేష్‌కి అసలు విషయం చెప్పారు చిరంజీవి. అలాంటి మంచి సినిమా తన వరకు రాలేదని వెంకటేష్‌ ఎంతో బాధపడ్డారు. దీన్ని బట్టి కొన్ని కథలు తమకు సూట్‌ కావన్న విషయాన్ని హీరోలు కూడా ముందుగానే గుర్తిస్తారని అర్థమవుతుంది. అప్పటికే ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించిన వెంకటేష్‌కి ‘డాడీ’ చిత్రం నిజంగానే బాగుండేదని ఆ తర్వాత అందరూ అనుకున్నారు.