Read more!

English | Telugu

దాస‌రి ఎక్క‌డ‌? చిరంజీవి ఎక్క‌డ‌? గురువు ఉంటే 'మా' గోల ఇలా ఉండేదా?

 

టాలీవుడ్‌లో గురువుగా అంద‌రి చేతా గౌర‌వ మ‌న్న‌న‌లు పొందిన వ్య‌క్తి ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు. ప‌రిశ్ర‌మ‌లో ఏ క్రాఫ్ట్‌లో స‌మ‌స్య వ‌చ్చినా అంద‌రూ ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చేది దాస‌రి ద‌గ్గ‌ర‌కే. 99 శాతం ఆయ‌న వాటిని ప‌రిష్క‌రించేవారు. అందుకే దాస‌రి అంటే ప్ర‌తి ఒక్క‌రికీ భ‌క్తి, గౌర‌వం! నాలుగేళ్ల క్రితం 2017లో ఆయ‌న క‌న్నుమూయ‌డం టాలీవుడ్‌కు పెద్ద దెబ్బ‌. ఆయ‌న లేక‌పోవ‌డం చిత్ర‌సీమ‌కు ఎంత లోటుగా మారిందంటే, చుక్కాని లేని నావ‌గా త‌యారయ్యింది ప‌రిస్థితి. దాస‌రి స్థానాన్ని ఇండ‌స్ట్రీ పెద్ద‌లంతా క‌లిసి మెగాస్టార్ చిరంజీవికి పెద్ద‌దిక్కు బాధ్య‌త‌ల్ని క‌ట్ట‌బెట్టారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో క‌రోనా క్రైసిస్ చారిటీ పెట్టి కార్మికుల‌కు మూడు నాలుగు నెల‌ల‌పాటు నిత్యావ‌స‌రాల‌ను త‌న ఆధ్వ‌ర్యంలో అంద‌జేశారు చిరంజీవి. అప్పుడంతా ఇండ‌స్ట్రీకి ఆయ‌న పెద్ద దిక్కుగా మారుతున్నార‌ని ఆశ‌ప‌డ్డారు.

థియేట‌ర్లు మూత‌ప‌డి, షూటింగ్‌లు ఆగిపోయి ఇండ‌స్ట్రీ సంక్షోభంలో చిక్కుకొన్న‌ప్పుడు పెద్ద‌గా వ్య‌వ‌హ‌రించిన చిరంజీవి.. ఇప్పుడు ఆ త‌ర‌హా పెద్ద‌రికాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం లేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. థియేట‌ర్లు తెరుచుకోవ‌డానికి చొర‌వ చూపి, ప్ర‌భుత్వాల‌తో మాట్లాడిన ఆయ‌న ప్ర‌స్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల సంద‌ర్భంలో నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ప్రకాశ్‌రాజ్ ప్రెసిడెంట్‌గా ఎల‌క్ష‌న్ల‌లో నిల‌బ‌డాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఇండ‌స్ట్రీలోని న‌టులు రెండు వ‌ర్గాలుగా విడిపోయారు. తెలుగువాడు కాని ప్ర‌కాశ్‌రాజ్‌కు 'మా' పెత్త‌నాన్ని ఇవ్వ‌డ‌మేంట‌ని మోహ‌న్‌బాబు ఆధ్వ‌ర్యంలో ఓ వ‌ర్గం ప్ర‌శ్నిస్తోంది. మోహ‌న్‌బాబు కుమారుడు విష్ణు స్వ‌యంగా ప్ర‌కాశ్‌రాజ్‌కు పోటీగా అధ్య‌క్ష బ‌రిలో నిల్చున్నాడు.

అప్ప‌ట్నుంచీ రెండు ప్యాన‌ల్స్‌గా విడిపోయిన న‌టులు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకుంటూ, ఆరోప‌ణ‌లు-ప్ర‌తి ఆరోప‌ణ‌ల‌తో ఇండ‌స్ట్రీ ప‌రువును బ‌య‌ట ప‌డేస్తున్నార‌నే అభిప్రాయం నెల‌కొంది. చిరంజీవి ఓపెన్‌గా చెప్ప‌క‌పోయినా ఆయ‌న స‌పోర్ట్ ప్ర‌కాశ్‌రాజ్‌కు ఫుల్‌గా ఉంద‌ని తెలిసిపోయింది. ఆయ‌న పెద్ద త‌మ్ముడు నాగ‌బాబు డైరెక్టుగా ప్రకాశ్‌రాజ్‌కు స‌పోర్ట్ చేయ‌డ‌మే కాకుండా, ఆయ‌న‌ను ఆకాశానికెత్తేస్తూ, మంచు విష్ణును కించ‌ప‌రుస్తూ మాట్లాడుతుండ‌టం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ప్ర‌కాశ్‌రాజ్ వ‌ర్గానికి నాగ‌బాబు ఒక ఆయుధంగా ఉప‌యోగ‌ప‌డుతున్నారు. 

ఏ విష‌యంలోనైనా సంయ‌మ‌నం కోల్పోకుండా హుందాగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే పేరున్న చిరంజీవి, 'మా' ఎన్నిక‌ల విష‌యంలో మౌనం వ‌హించ‌డం, నాగ‌బాబును కంట్రోల్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌క‌పోవ‌డంతో గ‌తంలో 'మా' ఎన్నిక‌ల విష‌యంలో ఎన్న‌డూ చూడ‌ని దారుణ‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డింది. చిరంజీవి ముందుకు వ‌చ్చి, ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే అవ‌కాశం ఉన్నా ఆయ‌న ముందుకు రాలేదు. పాతికేళ్ల క్రితం ఏర్ప‌డిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్‌కు చిరంజీవి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు. అలాంటి వ్య‌క్తి త‌మ అసోసియేష‌న్ ప‌రువు గంగ‌లో క‌లుస్తున్నా ప‌ట్టించుకోక‌పోవ‌డం, 'మా' కుటుంబ పెద్ద‌గా జోక్యం చేసుకొని, ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌కుల‌కు దారితీస్తోంది.

ఈ విష‌యంలో ఇండ‌స్ట్రీలోని వారంతా దాస‌రి నారాయ‌ణ‌రావునూ, చిరంజీవినీ పోల్చి పెద‌వి విరుస్తున్నారు. ట్రబుల్ షూట‌ర్ అయిన దాస‌రి ఎక్క‌డ‌, ట్రబుల్ టైమ్స్‌లో బ‌య‌ట‌కు రాని చిరంజీవి ఎక్క‌డ‌? అని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.