English | Telugu

నిన్నటి శృంగార‌తార అనూరాధ భ‌ర్త ఎలా చ‌నిపోయారో తెలిస్తే.. గుండె త‌డ‌వుతుంది!

అనూరాధ అన‌గానే మ‌న‌కు అనేక సినిమాల్లో క్ల‌బ్ సాంగ్స్‌లో, ఐట‌మ్ నంబ‌ర్స్‌లో ఆడిపాడిన తార వెంట‌నే గుర్తుకు వ‌చ్చేస్తారు. ఆమె అస‌లు పేరు సులోచ‌న‌. ఆమె కేవ‌లం డాన్స‌ర్ మాత్ర‌మే కాదు, చ‌క్క‌ని న‌టి కూడా. కొన్ని సినిమాల్లో ఆమె హీరోయిన్‌గానూ న‌టించారు. వాటిలో ఎక్కువ‌గా మ‌ల‌యాళం సినిమాలు ఉన్నాయి. చిరంజీవి హిట్ సినిమా 'మ‌గ మ‌హారాజు'లో భ‌ర్త‌ను బ‌తికించుకోవ‌డానికి ఒంటిని అమ్ముకోవ‌డానికి సిద్ధ‌ప‌డే గొప్ప మ‌న‌సున్న మ‌నిషిగా ఆమె ప్ర‌ద‌ర్శించిన అభిన‌యం మ‌ర‌చిపోలేం.

అలాంటి ఆమె ఒక‌సారి ఒక యువ‌కునితో లేచిపోయారంటూ ఇండ‌స్ట్రీలో గోల‌గోల అయ్యింది. అత‌ని పేరు స‌తీశ్ కుమార్‌. ప్ర‌తిభావంతుడైన కొరియోగ్రాఫ‌ర్‌. అత‌నంటే క‌మ‌ల్ హాస‌న్‌కు చాలా ఇష్టం. ఇండ‌స్ట్రీలో ఉండ‌టం, ఇద్ద‌రూ డాన్స‌ర్లు కావ‌డంతో స్నేహం ఏర్ప‌డింది. ఆడా మ‌గా సన్నిహితంగా మెల‌గుతుంటే ఎలాంటి ప్ర‌చారం జ‌రుగుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు క‌దా! ఆ ఇద్ద‌రి గురించి కూడా అలాంటి ప్ర‌చార‌మే మొద‌లైంది. ఈ విష‌యం అనూరాధ వాళ్ల‌మ్మ చెవిని ప‌డింది. దాంతో ఆమె అనూరాధ‌ను కంట్రోల్ చేయ‌డం ప్రారంభించారు. స‌తీశ్‌తో స‌న్నిహితంగా మెల‌గ‌వ‌ద్దంటూ హెచ్చ‌రించారు.

ఇది అనూరాధ‌కు బాధ క‌లిగించింది. అప్ప‌టిదాకా స‌తీశ్ అంటే ఆమెకు స్నేహ‌భావ‌మే ఉండింది. కానీ అంద‌రితో పాటు త‌ను ఎంత‌గానో గౌర‌వించే అమ్మ కూడా ఈ ప్ర‌చారాన్ని న‌మ్మ‌డ‌మేంటి? న‌న్ను సందేహించ‌డ‌మేంటి? అని బాధ‌ప‌డ్డారు అనూరాధ‌. ఒక‌సారి స‌తీశ్ వాళ్లింటి ద‌గ్గ‌ర ఆ ఇద్ద‌రూ మాట్లాడుకుంటూ ఉండ‌టం చూసిన‌వాళ్లెవ‌రో ఆ విష‌యం అనూరాధ వాళ్ల‌మ్మ‌కు చెప్పారు. దాంతో ఆమె స‌తీశ్ వాళ్లింటికి ఫోన్‌చేసి, వారిపై కేక‌లు వేశారు. అప్పుడు అనూరాధ డిసైడ్ చేసుకున్నారు, స‌తీశ్‌నే పెళ్లిచేసుకోవాల‌ని. అనుకోవ‌డం ఆల‌స్యం.. అమ్మ అభీష్టానికి విరుద్ధంగా ఇంట్లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి అత‌డిని పెళ్లి చేసేసుకున్నారు కూడా.

తొమ్మిదేళ్లు వాళ్లు చాలా ఆనందంగా దాంప‌త్య జీవితం గ‌డిపారు. ఆ త‌ర్వాత ఒక బైక్ యాక్సిడెంట్‌లో స‌తీశ్ త‌ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. డాక్ట‌ర్లు పెద‌వి విరిచేశారు. అయినా అనూరాధ ఆశ కోల్పోకుండా అప్ప‌టికే ఇద్ద‌రు పిల్ల‌లున్న (అభిన‌య‌శ్రీ‌, కాళీచ‌ర‌ణ్‌) ఆమె.. భ‌ర్త‌ను కూడా మ‌రో బిడ్డ అన్న‌ట్లు కంటికి రెప్ప‌లా చూసుకున్నారు. అత‌డి వైద్యం కోసం త‌ను సంపాదించిందంతా దాదాపు ఖ‌ర్చుపెట్టేశారు. అలా ప‌ద‌కొండేళ్ల పాటు అత‌డిని ప‌సి పిల్లాడిని చూసుకున్న‌ట్లు చూసుకున్నారు. 2007లో ఒక‌రోజు భ‌ర్త‌కు అన్నం తినిపిస్తున్నారు అనూరాధ‌. అత‌నికి పొల‌మారింది. వెంట‌నే త‌ల‌వాల్చేశారు. అప్ప‌టిక‌ప్పుడే అత‌ని ప్రాణాలు పోయాయి. తెర‌పై మ‌న‌కు క‌నిపించే అనూరాధ‌ను చూసి, ఏవేవో మ‌నం ఊహించుకుంటాం. కానీ ఆమెలో ఎంత‌టి ద‌యామ‌యి, ప్రేమ‌మూర్తి దాగివుందో భ‌ర్త స‌తీశ్‌ను ఆమె చూసుకున్న విధానం మ‌న‌కు తెలియ‌జేస్తుంది.