Read more!

English | Telugu

సింగ‌పూర్ వ్య‌క్తితో 'శంక‌రాభ‌ర‌ణం' రాజ్య‌ల‌క్ష్మి పెళ్లి ఎలా కుదిరిందో మీకు తెలుసా?

 

తొలి సినిమా 'శంక‌రాభ‌ర‌ణం'ను ఇంటిపేరుగా మార్చుకొని 'శంక‌రాభ‌ర‌ణం రాజ్య‌ల‌క్ష్మి'గా పాపుల‌ర్ అయ్యారు రాజ్య‌ల‌క్ష్మి. ఆ సినిమా పూర్తి కాక‌ముందే, తొలి షెడ్యూల్ పూర్త‌య్యిందో లేదో, వెంట‌వెంట‌నే రెండు సినిమాల్లో నాయిక‌గా న‌టించే చాన్స్ ఆమెకు ద‌క్కింది. వాటిలో ఒక‌టి కె. రాఘ‌వేంద్ర‌రావు డైరెక్ష‌న్‌లో ముర‌ళీమోహ‌న్‌తో న‌టించిన 'నిప్పులాంటి నిజం' కాగా, మ‌రొక‌టి బాల‌కృష్ణ స‌ర‌స‌న న‌టించిన 'రౌడీ రాముడు కొంటె కృష్ణుడు' మూవీ. ప‌దేళ్ల కాలం వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేనంత‌గా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో హీరోయిన్‌గా, కీల‌క పాత్ర‌ధారిణిగా ఎడాపెడా సినిమాలు చేస్తూ, మ‌హాబిజీగా ఉంటున్న‌ప్పుడే సింగ‌పూర్ వ్య‌క్తిని పెళ్లిచేసుకొని అక్క‌డ‌కు వెళ్లిపోయారు రాజ్య‌ల‌క్ష్మి.

త‌న కుటుంబంతో ఒక‌సారి చెన్నైలో ఒక డిన్న‌ర్‌కు వెళ్లారామె. ఆ డిన్న‌ర్‌కు ఒక యువ‌కుడు త‌న క‌జిన్స్‌తో వ‌చ్చాడు. తెలిసిన‌వాళ్లు ఇత‌ను సింగ‌పూర్‌లో ఉంటాడ‌ని ప‌రిచ‌యం చేశారు. అదే టైమ్‌లో రాజ్య‌ల‌క్ష్మి ఒక సినిమా షూటింగ్ నిమిత్తం సింగ‌పూర్ వెళ్లాల్సి ఉంది. ఆ విష‌య‌మే రాజ్య‌ల‌క్ష్మి చెప్పారు. "సింగ‌పూర్ వ‌స్తున్నారా! వీలైతే మా ఇంటికి రండి. మీకేదైనా అవ‌స‌రమైతే చెప్పండి, చేస్తాను." అని త‌న విజిటింగ్ కార్డ్ ఇచ్చాడ‌త‌ను. అలా ఆ ఇద్ద‌రికీ ప‌రిచ‌య‌మైంది. అత‌ని పేరు కృష్ణ‌న్‌. అప్పుడత‌నికి ఇంట్లోవాళ్లు సంబంధాలు చూస్తున్నారు. ఎవ‌రూ అత‌నికి న‌చ్చ‌ట్లేదు. వాళ్ల‌క్క‌య్య బొంబాయికి పిలిపించి, ఒక సంబంధం చూపించారు. ఆ సంబంధం కూడా అత‌నికి న‌చ్చ‌లేదు. చెన్నైలో రాజ్య‌ల‌క్ష్మిని క‌లిసిన రోజే అత‌ను బాంబేలో ఆ సంబంధం చూసి వ‌చ్చాడు. రాజ్య‌ల‌క్ష్మి తొలిచూపులోనే అత‌నిని ఆక‌ర్షించింది.

ఆ త‌ర్వాత రాజ్య‌ల‌క్ష్మిని అత‌ను నేరుగా అడిగారు, "మీరు నాకు న‌చ్చారు. న‌న్ను పెళ్లిచేసుకుంటారా?" అని. అప్పుడు, "మా వాళ్ల‌తో మాట్లాడండి. వాళ్లు ఒప్పుకుంటే చేసుకోడానికి నాకిష్ట‌మే" అని చెప్పారు రాజ్య‌ల‌క్ష్మి. అప్ప‌టికే అత‌నికి తండ్రి లేరు. అందుక‌ని వాళ్ల‌న్న‌య్య చేత రాజ్య‌ల‌క్ష్మి అమ్మానాన్న‌ల‌తో మాట్లాడించాడు. వాళ్లు "మా అమ్మాయికి ఇష్ట‌మైతే మాకు అభ్యంత‌రం లేదు" అని చెప్పారు. అలా వాళ్ల పెళ్లి కుదిరింది. పెళ్లికి ఒక నెల టైమ్ తీసుకొని, ఈలోపు త‌న క‌మిట్ అయిన సినిమాల‌న్నింటినీ పూర్తి చేశారు రాజ్య‌ల‌క్ష్మి. మ్యారేజ్ జ‌రిగే రోజు తెల్ల‌వారుజాము 3 గంట‌ల దాకా ఆమె ప‌నిచేశారంటే.. న‌టిగా అప్పుడామె ఎంత బిజీగా ఉన్నారో ఊహించుకోవాల్సిందే.

పెళ్ల‌య్యాక భ‌ర్త ఇంటికి సింగ‌పూర్ వెళ్లిపోయారామె. అయితే ఆమె న‌ట‌న‌ను పూర్తిగా వ‌దిలేయ‌లేదు. అక్క‌డ త‌మిళ టీవీ చాన‌ల్ కోసం సీరియ‌ల్స్‌లో న‌టించారు. 1999లో ఒక సీరియ‌ల్‌లో న‌ట‌న‌కు గాను ఆమెకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా ల‌భించింది. పెళ్లి త‌ర్వాత వెంటవెంట‌నే రోహిత్‌, రాహుల్ అనే ఇద్ద‌రు అబ్బాయిలు పుట్టారు. వాళ్ల ఆల‌నా పాల‌నా చూసుకోవ‌డం, స్కూలుకు రెడీ చేయ‌డం లాంటి ప‌నుల‌తో ఎక్కువ‌గా త‌న స‌మ‌యాన్ని కుటుంబానికి కేటాయిస్తూ వ‌చ్చారు. పిల్ల‌లు పెద్ద‌యి వాళ్ల ప‌నులు వాళ్లు చేసుకోవ‌డం మొద‌ల‌య్యాకే ఆమె చెన్నైకి వ‌చ్చి సినిమాల్లోకి రిఎంట్రీ ఇచ్చారు. కృష్ణ‌న్ మాత్రం సింగ‌పూర్‌లోనే ఉంటున్నారు. షూటింగ్‌లు లేన‌ప్పుడ‌ల్లా ఆమె భ‌ర్త ద‌గ్గ‌ర‌కు వెళ్లి వ‌స్తుంటారు. ఆమె పెద్ద కుమారుడు న‌టునిగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ఆస‌క్తి చూపిస్తున్నాడు.