Read more!

English | Telugu

డైరెక్ట‌ర్ తేజ బ్యాగ్రౌండ్ ఏంటో, ఆయ‌న తండ్రి ఏం చేసేవారో తెలుసా?

 

డైరెక్ట‌ర్ తేజ చిన్న‌త‌నం నుంచే చాలా క‌ష్ట‌ప‌డి పైకొచ్చారు. మొద‌ట కెమెరా డిపార్ట్‌మెంట్‌లో చేరి, అంచెలంచెలుగా ఎదిగి ఆప‌రేటివ్ కెమెరామేన్‌గా, సినిమాటోగ్రాఫ‌ర్ అయ్యారు. ఆ త‌ర్వాత రామోజీరావు నిర్మించిన 'చిత్రం'తో డైరెక్ట‌ర్‌గా మారి సంచ‌ల‌నం సృష్టించారు. అయితే తేజ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంట‌నే విష‌యం చాలామందికి తెలీదు. ఆయ‌న తండ్రి పేరు జె.బి.కె. చౌద‌రి. అంద‌రూ 'జేబీకే' అని ఆత్మీయంగా పిలిచేవారు. సినీ రంగంలో అంద‌రికీ త‌ల‌లో నాలుక‌లా మెలిగేవారు. క‌థలు చెప్పేవారు. మిత్రుల స‌హ‌కారంతో 'ధ‌ర్మ‌ప‌త్ని' అనే సినిమా చేశారు. 

జేబీకే, రాణి దంప‌తుల‌కు ఇద్ద‌రు అమ్మాయిల త‌ర్వాత పుట్టిన అబ్బాయికి ధ‌ర్మ‌తేజ అనే పేరు పెట్టుకున్నారు. అప్ప‌టి షిప్పింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ఛైర్మ‌న్ పేరు జ‌యంతి ధ‌ర్మ‌తేజ‌. ఆయ‌న ఇన్‌స్పిరేష‌న్‌తోటే త‌న కుమారుడికి ధ‌ర్మ‌తేజ అని నామ‌క‌ర‌ణం చేశారు జేబీకే. త‌ర్వాత కాలంలో ఆయ‌న‌ జ‌పాన్‌కు హ్యూమ‌న్ హెయిర్ ఎక్స్‌పోర్ట్ చేసే బిజినెస్ చేశారు. ఒక క‌న్‌సైన్‌మెంట్‌లో తీవ్రంగా న‌ష్ట‌పోయారు. ఆ టైమ్‌లో ఆయ‌న భార్య రాణి మృతి చెందారు. దెబ్బ‌మీద దెబ్బ ప‌డింది. ఎలాగో క‌ష్ట‌ప‌డి పిల్ల‌ల్ని ఒక్క‌డే పెంచి పెద్ద చేశారు. ఆరోగ్యం దెబ్బ‌తిని తేజ‌ ప‌దేళ్ల వ‌య‌సులో ఉండ‌గా జేబీకే క‌న్నుమూశారు.

పిల్ల‌లు పెద్ద‌దిక్కులేని వాళ్ల‌య్యారు. అక్క‌య్య‌ల స‌హ‌కారంతో ర‌క‌ర‌కాల ప‌నులు చేస్తూ చ‌దువుకున్నారు తేజ‌. సినిమాల మీద ధ్యాస ఎక్కువై, ముంబైకి వెళ్లారు. అక్క‌య్య‌లు ఉద్యోగాలు చేసుకుంటూ పెళ్లిళ్లు చేసుకున్నారు. బాలీవుడ్‌లో మొద‌ట చిన్నా చిత‌కా సినిమాల‌కు కెమెరా డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేశారు. చురుకైన‌వాడు కావ‌డంతో త్వ‌ర‌గానే పేరు వ‌చ్చింది. కెమెరామేన్‌గా ప‌నిచేస్తున్న‌ప్పుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆయ‌న యూనిట్‌లో చేరిపోయారు తేజ‌. అలా 'శివ' సినిమాకు ఆప‌రేటివ్ కెమెరామేన్‌గా ప‌నిచేశారు.

ఆర్జీవీ సినిమా 'రాత్రి'తో సినిమాటోగ్రాఫ‌ర్‌గా మారారు తేజ‌. అంతం, మ‌నీ, ర‌క్ష‌ణ‌, మ‌నీ మ‌నీ సినిమాల త‌ర్వాత ఎక్కువ‌గా హిందీ సినిమాల‌కు వ‌ర్క్ చేశారు. రామోజీరావును క‌న్విన్స్ చేసి, ఆయ‌న బ్యాన‌ర్‌పై 'చిత్రం' సినిమాని కేవ‌లం రూ. 30 ల‌క్ష‌ల బడ్జెట్‌తో తీసి, బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. ఆ త‌ర్వాత ఆయ‌న కెరీర్ ఎలా సాగుతూ వ‌చ్చిందీ మ‌నం చూస్తున్నాం.