Read more!

English | Telugu

కృష్ణ వర్సెస్ శోభన్ బాబు, రాధ వర్సెస్ అంబిక.. జయసుధకి డబుల్ ధమాకా..

సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ్ శోభన్ బాబు పలు మల్టిస్టారర్స్ లో నటించి ఆకట్టుకున్నారు. అంతేకాదు.. అప్పుడప్పుడు ఒకే రోజు తమ సినిమాలతో బాక్సాఫీస్ ముంగిట పోటీపడ్డారు. అలా ఒకేసారి బరిలోకి దిగిన తేదీల్లో.. 1983 సెప్టెంబర్ 2 ఒకటి. అంటే.. సరిగ్గా 40 ఏళ్ళ క్రితం నాటి ముచ్చట ఇది.

ఆ వివరాల్లోకి వెళితే.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందిన శక్తి సినిమాతో 1983 సెప్టెంబర్ 2న కృష్ణ పలకరిస్తే.. గుత్తా రామినీడు డైరెక్షన్ లో తెరకెక్కిన రాజకుమార్ మూవీతో శోభన్ బాబు అదే రోజు సందడి చేశారు. ఈ రెండు చిత్రాల్లో కూడా సహజ నటి జయసుధ ఓ హీరోయిన్ గా నటించడం విశేషం. అంతేకాదు.. శక్తిలో రాధ మరో నాయికగా కనిపిస్తే.. రాజకుమార్ లో రాధ అక్క అంబిక సెకండ్ హీరోయిన్ గా దర్శనమిచ్చింది. అంటే.. ఒకే రోజు అక్కాచెల్లెళ్ళు నటించిన సినిమాలు క్లాష్ అయ్యాయన్నమాట. ఇక కృష్ణ ద్విపాత్రాభినయంలో తెరకెక్కిన స్ట్రయిట్ మూవీ శక్తికి చక్రవర్తి స్వరాలు సమకూర్చగా.. కన్నడ చిత్రం చళిసువ మోడిగలుకి రీమేక్ గా రూపొందిన రాజకుమార్ కి ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. వీటిలో శక్తి ఘనవిజయం సాధించగా.. రాజకుమార్ మ్యూజికల్ హిట్ గా మన్ననలు పొందింది.