English | Telugu

టాలీవుడ్‌లో 90 శాతం సక్సెస్‌ రేట్‌ ఉన్న ఏకైక దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి!

టాలీవుడ్‌లో 90 శాతం సక్సెస్‌ రేట్‌ ఉన్న ఏకైక దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి!

 

పాత తరం నుంచి ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్‌ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. వారిలో 90 శాతం సక్సెస్‌ రేట్‌ ఉన్న ఏకైక దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి. 1980లో ప్రారంభమైన ఆయన కెరీర్‌ 2009 వరకు కొనసాగింది. ఈ 30 సంవత్సరాల్లో 94 సినిమాలు డైరెక్ట్‌ చేశారు కోదండరామిరెడ్డి. అప్పటి టాప్‌ హీరోలందరికీ సూపర్‌హిట్‌ సినిమాలు చేసిన ఘనత ఆయనది. దాదాపు 20 సంవత్సరాలపాటు టాప్‌ డైరెక్టర్‌గా కొనసాగిన కోదండరామిరెడ్డి సినీ ప్రవేశం ఎలా జరిగింది, డైరెక్టర్‌గా మొదటి అవకాశం ఎలా వచ్చింది, ఆయన సాధించిన తిరుగులేని విజయాల వెనుక వున్న రహస్యం ఏమిటి అనేది తెలుసుకుందాం.

 

1950 జూలై 1న నెల్లూరు జిల్లాలోని మైపాడులో వెంకురెడ్డి, రమణమ్మ దంపతులకు జన్మించారు కోదండరామిరెడ్డి. వీరిది మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. చిన్నతనం నుంచి నాటకాలు, సినిమాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది. అలా చదువు మీద శ్రద్ధ తగ్గడం వల్ల పియుసి మధ్యలోనే ఆపేసి హీరో అయిపోదామని మద్రాస్‌ రైలెక్కేశారు. తన బంధువు ప్రభాకరరెడ్డి ద్వారా దర్శకుడు పి.చంద్రశేఖరరెడ్డి పరిచయమయ్యారు. ఆ సమయంలో వి.మధుసూదనరావు మనుషులు మారాలి సినిమా చేస్తున్నారు. కోదండరామిరెడ్డిని ఆయన దగ్గరకు తీసుకెళ్ళి ఆ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పెట్టించారు. అలా మొదలైన కోదండరామిరెడ్డి కెరీర్‌.. అసిస్టెంట్‌గా, అసోసియేట్‌గా, కోడైరెక్టర్‌గా ఎనిమిదేళ్లు కొనసాగింది. వి.మధుసూదనరావు శిష్యరికంలో సినిమా మేకింగ్‌కి సంబంధించిన అనేక మెళకువలు నేర్చుకున్నారు. 

 

1980లో హిందీలో సూపర్‌హిట్‌ అయిన అమర్‌ అక్బర్‌ అంటోని చిత్రాన్ని తెలుగులో రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌ పేరుతో రీమేక్‌ చేశారు నిర్మాత సూర్యనారాయణబాబు. మొదట ఈ సినిమాకి కోదండరామిరెడ్డిని దర్శకుడుగా అనుకున్నారు. అయితే అనుభవమున్న డైరెక్టర్‌ అయితే బాగుంటుందని విజయనిర్మలతో చేయించారు. అదే సంవత్సరం ‘సంధ్య’ చిత్రం ద్వారా కోదండరామిరెడ్డి దర్శకుడుగా పరిచయమయ్యారు. అయితే ఈ చిత్రం ఎబౌ ఏవరేజ్‌ అనిపించుకుంది. ఆ సమయంలో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న చిరంజీవితో న్యాయంకావాలి సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా సూపర్‌హిట్‌ అయింది. హీరోగా చిరంజీవికి, డైరెక్టర్‌గా కోదండరామిరెడ్డికి మంచి పేరు వచ్చింది. అలా మొదలైన వీరి కాంబినేషన్‌లో 25 సినిమాలు వచ్చాయి. వాటిలో 23 సూపర్‌హిట్‌ సినిమాలు ఉండడం విశేషం. న్యాయంకావాలి, అభిలాష చిత్రాలు కెరీర్‌ ప్రారంభంలో చిరంజీవికి మంచి పేరు తెచ్చిన సినిమాలు. 1983లో చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ఖైదీ ఒక చరిత్ర సృష్టించింది. చిరంజీవిని టాప్‌ స్టార్‌ని చేసింది. ఆ తర్వాత ఛాలెంజ్‌, రాక్షసుడు, మరణమృదంగం, విజేత, పసివాడి ప్రాణం, దొంగమొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ.. ఇలా అన్నీ సూపర్‌హిట్‌ సినిమాలే వచ్చాయి. 1993లో వచ్చిన సూపర్‌హిట్‌ సినిమా ముఠామేస్త్రి వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి సినిమా. చిరంజీవికి స్టార్‌డమ్‌ రావడానికి, మెగాస్టార్‌గా ఎదగడానికి నూటికి నూరు శాతం దర్శకుడు కోదండరామిరెడ్డి కారణం. చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేసిన ఘనత కూడా ఆయనదే. 

 

నందమూరి బాలకృష్ణతో 13 సినిమాలు, నాగార్జునతో 7, వెంకటేష్‌తో 2, అక్కినేని నాగేశ్వరరావుతో 6, సూపర్‌స్టార్‌ కృష్ణతో 6, శోభన్‌బాబుతో 6.. ఇలా టాలీవుడ్‌లోని టాప్‌ హీరోలందరితోనూ సినిమాలు చేశారు కోదండరామిరెడ్డి. అలాగే కమల్‌హాసన్‌, మోహన్‌బాబు, జగపతిబాబు వంటి హీరోలతో కూడా సినిమాలు చేసి వారికి సూపర్‌హిట్స్‌ ఇచ్చారు. ఎన్‌.టి.రామారావుతో తప్ప మిగిలిన అందరు హీరోలతోనూ సినిమాలు చేశారు. అయితే ఎన్టీఆర్‌ని డైరెక్ట్‌ చేసే అవకాశం కోదండరామిరెడ్డికి మూడు సార్లు వచ్చింది. అయితే అప్పుడు ఆయన మిగతా సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆయనతో సినిమా చెయ్యలేకపోయారు. 

 

ఇక కోదండరామిరెడ్డి వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆయన దర్శకుడుగా పరిచయం అవ్వకముందే భారతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సనీల్‌రెడ్డి, వైభవ్‌రెడ్డి. ‘గొడవ’ చిత్రం ద్వారా వైభవ్‌ హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు కోదండరామిరెడ్డి. ఆ తర్వాత వైభవ్‌ హీరోగా ‘కాస్కో’ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ రెండు సినిమాలూ కమర్షియల్‌గా సక్సెస్‌ అవ్వలేదు. అయితే తమిళ్‌లో నటుడుగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు వైభవ్‌. ఇక పెద్ద కుమారుడు సునీల్‌రెడ్డి కూడా కొన్ని సినిమాల్లో నటించారు. దర్శకుడుగా కోదండరామిరెడ్డి చివరి సినిమా 2009లో విడుదలైన పున్నమినాగు.

 

(జూలై 1 దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా..)