English | Telugu

'దాన‌వీర‌శూర క‌ర్ణ‌'లో న‌టించేవాళ్లు 'కురుక్షేత్రం'లో చేయ‌కూడ‌ద‌ని ఆంక్ష పెట్టిన ఎన్టీఆర్‌!

కృష్ణ 'అల్లూరి సీతారామ‌రాజు' సినిమా చేయ‌డంతో, ఆ సినిమా చేయాల‌నే సంకల్పంతో ఉన్న న‌ట‌ర‌త్న నంద‌మూరి తార‌క‌రామారావు ఆగ్ర‌హించారు. కృష్ణ త‌న అభిమాని అయినా, ఆయ‌న‌తో దాదాపు ప‌దేళ్ల‌పాటు మాట్లాడ‌కుండా ఉండిపోయారంటే ఎన్టీఆర్ ఎంత‌టి అభిమాన‌వంతులో ఊహించుకోవ‌చ్చు. ఆ కాలంలోనే ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంతో త్రిపాత్ర‌లు పోషిస్తూ 'దాన‌వీర‌శూర క‌ర్ణ' చిత్రాన్ని త‌ల‌పెట్టారు. సాహ‌స‌వంతునిగా పేరుపొందిన కృష్ణ త‌గ్గేదేలే అన్న‌ట్లు దాదాపు అదే క‌థాంశంతో 'కురుక్షేత్రం' ప్రారంభించారు. దీంతో అగ్నికి ఆజ్యం పోసిన‌ట్లయింది. కృష్ణ‌పై ఎన్టీఆర్ మ‌రింత కినుక వ‌హించారు.

అప్పుడే ఆయ‌న త‌న 'దాన‌వీర‌శూర క‌ర్ణ' చిత్రంలో న‌టించేవాళ్లెవ‌రూ 'కురుక్షేత్రం'లో న‌టించ‌రాద‌ని ఆంక్ష పెట్టారు. దీంతో యాక్ట‌ర్లు కూడా రెండు వ‌ర్గాలుగా విడిపోయారు. శోభ‌న్‌బాబు, కృష్ణంరాజు లాంటి స్టార్ హీరోలు కృష్ణ‌తో చేరిపోయారు. అయితే ఎన్టీఆర్ పెట్టిన ఆంక్ష‌కు భిన్నంగా ఒక న‌టుడు రెండు సినిమాల్లోనూ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఆయ‌న.. న‌వ‌ర‌స న‌ట‌నాసార్వ‌భౌమ కైకాల స‌త్యనారాయ‌ణ‌. 'దాన‌వీర‌శూర క‌ర్ణ‌'లో భీమునిగా, 'కురుక్షేత్రం'లో దుర్యోధ‌నునిగా ఆయ‌న న‌టించారు. అదెలా సాధ్య‌మైంది? ఎన్టీఆర్ ఎలా ఆయ‌న‌ను ఉపేక్షించార‌నేది ఆస‌క్తిక‌ర‌మైన అంశం.

ముందుగా స‌త్య‌నారాయ‌ణ‌ను 'కురుక్షేత్రం' నిర్మాత‌లు బుక్ చేశారు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో న‌టించాల‌నే కోరిక ఆయ‌న‌కు ఉంటుంది క‌దా.. అందుకే ఒప్పుకున్నారు. ఇది జ‌రిగిన కొన్ని రోజుల‌కు ఎన్టీఆర్ ఆయ‌న‌ను పిలిచి, "మ‌న సినిమాలో నువ్వు భీముడు వేషం వెయ్యాలి బ్ర‌ద‌ర్‌. అయితే ఒక కండిష‌న్‌. ఆ సినిమాలో నువ్వు న‌టించ‌కూడ‌దు. అందులో న‌టించేవాళ్లు ఇందులో ఉండ‌కూడ‌ద‌ని నా నియ‌మం. ఎవ‌రూ వెయ్య‌డం లేదు. నువ్వు కూడా వెయ్య‌డానికి వీల్లేదు." అని చెప్పారు.

"అదికాదు అన్న‌గారూ.. వాళ్లు న‌న్ను మొద‌ట బుక్ చేశారు. అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు చేయ‌న‌ని అన‌డం బాగుండ‌దు క‌దా. అందుకే మీరు అనుమ‌తిస్తే రెండు సినిమాల్లో న‌టిస్తాను." అన్నారు స‌త్య‌నారాయ‌ణ‌. "లేదు లేదు.. అలా చేయ‌డానికి వీల్లేదు." అన్నారు రామారావు. "అయితే ఒక‌ప‌ని చేయండ‌న్న‌గారూ.. దుర్యోధ‌నుడి వేషం నాకు ఇవ్వండి. ఆ వేషం వ‌దిలేస్తా." అన్నారు స‌త్య‌నారాయ‌ణ‌. ఆ మాట ఆయ‌న ఎందుక‌న్నారంటే "త‌ను వెయ్యాల‌నుకుంటున్న దుర్యోధ‌నుడి వేషాన్ని రామారావుగారు త్యాగంచేసి నాకు ఇచ్చార‌య్యా. అందుకే మీ సినిమా చేయ‌డం లేదు." అని కృష్ణ‌కు చెప్పుకొనే అవ‌కాశం త‌న‌కు ఉంటుందని.

కానీ ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. "దుర్యోధ‌నుడి పాత్ర‌కు నేనిచ్చే ట్రీట్‌మెంట్ వేరేగా ఉంటుంది. ఒక డ్యూయెట్ కూడా పెట్టాం. నేనే ఆ పాత్ర చెయ్యాలి." అన్నారాయాన‌. "మ‌రి న‌న్నేం చేయ‌మంటారు అన్న‌గారూ.. దుర్యోధ‌నుడి పాత్ర పోషించాల‌నే కోరిక నాకు కూడా ఉంటుంది క‌దా. ఆ సినిమాలో అంద‌రికంటే మొద‌ట న‌న్నే బుక్ చేశారు. ఇప్పుడు నేను చేయ‌నంటే బ్యాడ్ అవుతాను క‌దా." అన్నారు స‌త్య‌నారాయ‌ణ‌. ఎన్టీఆర్ ఓ నిమిషం ఆలోచించి, "స‌రే పో.. రెండు సినిమాలు చేసుకో." అని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అట్లా ఒక్క స‌త్య‌నారాయ‌ణకు మాత్ర‌మే ఆ రెండు సినిమాల్లోనూ న‌టించే చాన్స్ ద‌క్కింది. ఈ విష‌యాల‌ను స‌త్య‌నారాయ‌ణ స్వ‌యంగా వెల్ల‌డించారు.