Read more!

English | Telugu

ఎన్టీఆర్ కొడుకుగా చిరంజీవి నటించకుండా చేసింది వీళ్ళే!

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు కథానాయకుడిగా 1981 అక్టోబర్ 7 న విడుదలైన మూవీ కొండవీటి సింహం. ఈ మూవీలో ఇన్ స్పెక్టర్ రంజిత్ కుమార్ గా ఎన్టీఆర్ ప్రదర్శించిన నటనకి  ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. అప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటిని  ఒక మూలన కూర్చోబెట్టి నయా రికార్డులని కూడా  సృష్టించింది. అసలు ఆ రోజుల్లో ప్రతి తెలుగువాడి నోటి వెంట ఈ మూవీలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ మారుమోగిపోయేవి. అంతటి ఘన కీర్తి ఉన్న కొండవీటి సింహంలో ఎన్టీఆర్ కొడుకుగా మెగాస్టార్ చిరంజీవి నటించాల్సి ఉందనే విషయం మీకు తెలుసా!

ఎన్టీఆర్  కొండవీటి సింహంలో ఇన్ స్పెక్టర్ రంజిత్ కుమార్ గా  రాము గా డ్యూయల్ రోల్ పోషించాడు. రంజిత్ కుమార్ కి  ఒక కొడుకు పుట్టగానే ఆ కొడుకు ఉంటే రంజిత్ కుమార్ ప్రాణాలకి ప్రమాదమని జ్యోతిష్యుడు చెప్పడంతో రంజిత్ కుమార్ మావయ్య ఆ బిడ్డని దూరం చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇంకో కొడుకు పుట్టి చెడ్డవాడిగా మారతాడు. ఈ క్యారక్టర్ కే  చిత్ర దర్శకుడు రాఘవేంద్ర రావు మొదట చిరంజీవిని అనుకున్నాడు. నిర్మాతలు కూడా ఆయన నిర్ణయానికి ఓకే చెప్పడంతో   రాఘవేంద్రరావు చిరంజీవిని ఎన్టీఆర్ రెండో కొడుకు పాత్రలో నటింప చెయ్యాలని  అనుకున్నాడు. కానీ  చిరంజీవి డేట్స్ లేకపోవడంతో ఆ క్యారక్టర్  మోహన్ బాబుకి వెళ్లడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా  రాఘవేంద్రరావే ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.ఈ విధంగా డేట్స్ కనుక అడ్డుపడకపోయి ఉంటే చిరంజీవి ఎన్టీఆర్ కొడుకుగా నటించేవాడు. అంతకు ముందు చిరంజీవి ఎన్టీఆర్ తో కలిసి తిరుగులేని మనిషి సినిమాలో నటించాడు.

ఎన్టీఆర్ రెండో కొడుకుగా మోహన్ బాబు తన తండ్రిని ద్వేషించే రవి పాత్రలో చాలా అధ్బుతంగా నటించాడు. ఎన్టీఆర్ లాంటి మేరు పర్వతానికి ధీటుగా నటించి ఎంతో పేరు సంపాదించాడు. ఇక ఎన్టీఆర్ అయితే ఇన్ స్పెక్టర్ రంజిత్ కుమార్ గా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆయన  సంఘ విద్రోహశక్తులని  ఎదిరిస్తు ఆవేశంతో చెప్పే ఒక్కో  డైలాగ్ ఒక్కో తూటాలా పేలుతుంది. అలాగే పెద్ద కొడుకు రాము క్యారక్టర్ లో కూడా ఎంతో హుందాగా నటించారు. మూవీలోని పాటలన్ని పెద్ద హిట్. ఈ రోజుకి ఏదో ఒక చోట మారుమోగిపోతూనే ఉంటాయి.పెద్ద ఎన్టీఆర్ సరసన జయంతి చిన్నఎన్టీఆర్ సరసన శ్రీదేవి, మోహన్ బాబు సరసన గీత నటించగా రోజా మూవీస్ పతాకంపై అర్జున్ రాజు, శివరామరాజులు నిర్మించారు. 1974 లో శివాజీ గణేష్ హీరోగా తెరకెక్కిన తంగ పతక్కం అనే తమిళ చిత్ర ఆధారంగా కొండవీటి సింహం తెరకెక్కింది