Read more!

English | Telugu

లెజెండ‌రీ డైరెక్ట‌ర్ విశ్వ‌నాథ్ గురించి మీకు తెలీని నిజాలు!

దిగ్ద‌ర్శ‌కులు కె.వి. రెడ్డి నిర్దేశ‌క‌త్వంలో జూనియ‌ర్ శ్రీ‌రంజ‌ని టైటిల్ రోల్ పోషించిన‌ 'గుణ‌సుంద‌రి క‌థ' (1949) సినిమా నిర్మాణ స‌మ‌యంలో కె. విశ్వ‌నాథ్ మ‌ద్రాస్‌లోని వాహినీ స్టూడియోలో సౌండ్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. స‌రిగ్గా ఆ టైమ్‌లోనే ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు 'షావుకారు' సినిమాకు బుక్ అయ్యారు. అంటే వారంతా దాదాపు ఒకేసారి త‌మ కెరీర్‌ను ప్రారంభించార‌న్న మాట‌. లెజెండ‌రీ డైరెక్ట‌ర్ అయిన బి.ఎన్‌. రెడ్డికి విద్యావంతులైన యువ‌కుల‌ను చేర‌దీసి, సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లో శిక్ష‌ణ ఇచ్చి, ఆ త‌ర్వాత వారిలో టాలెంట్ ఉన్న‌వాళ్ల‌ను త‌న ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లోకి తీసుకోవాల‌ని ఉండేది. ఆ విధంగానే విశ్వ‌నాథ్‌ను వాహినీ సంస్థ‌లో సౌండ్ డిపార్ట్‌మెంట్‌లోకి తీసుకున్నారు. సినీ రంగంలోని చాలా మందికి కూడా తెలీని విష‌య‌మేమంటే, వాహినీ పిక్చ‌ర్స్‌లో విశ్వ‌నాథ్ తండ్రి కాశీనాథుని సుబ్ర‌హ్మ‌ణ్యం కూడా ప‌నిచేశారు. ఆయ‌న బి.ఎన్‌. రెడ్డికి స‌మ‌కాలికులు.

1938 నుంచి అంటే 'వందేమాత‌రం' చిత్రంతో వాహినీ సంస్థ ఆరంభ‌మైన‌ప్ప‌ట్నుంచీ ఆ సంస్థ‌లో సుబ్ర‌హ్మ‌ణ్యం ఉన్నారు. ఈ అనుబంధం కార‌ణంగానే విశ్వ‌నాథ్‌ను బి.ఎన్‌. రెడ్డి మొద‌ట టెక్నీషియ‌న్‌గా ఎంచుకొని, త‌ర్వాత ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లోకి తీసుకోవాల‌ని అనుకున్నారు. 'బంగారు పాప‌', 'మ‌ల్లీశ్వ‌రి' లాంటి క్లాసిక్స్ నిర్మిస్తున్న‌ప్పుడు ద‌ర్శ‌కులు కె.వి. రెడ్డి, బి.ఎన్‌. రెడ్డి వ‌ద్ద‌, ఛాయాగ్రాహ‌కుడు మార్క‌స్ బార్‌ట్లీ వంటి వారి సాహ‌చ‌ర్యంలో విశ్వ‌నాథ్ ప‌నిచేశారు. 

సౌండ్ రికార్డింగ్ అన్న‌ది సినిమా నిర్మాణంలో ఒక విభాగం. కానీ, డైరెక్ట‌ర్ ఆదుర్తి సుబ్బారావు రీరికార్డింగ్‌ను కూడా ధైర్యంగా విశ్వ‌నాథ్‌కు అప్ప‌గించి వెళ్లేవారు. ఆయ‌న‌కు డైరెక్ష‌న్ మీద ఉత్సాహం ఉంద‌నే అభిప్రాయంతోనే ఆదుర్తి ఆ ప‌నిచేసేవారు. 'స్వ‌ప్న‌సుంద‌రి', 'లైలా మ‌జ్ను', 'తోడికోడ‌ళ్లు' లాంటి సినిమాల‌కు సౌండ్ రికార్డిస్ట్‌గా ప‌నిచేయ‌డంతో అక్కినేని నాగేశ్వ‌ర‌రావుతో ప‌రిచ‌యం కాస్తా సాన్నిహిత్యంగా మారింది. అన్న‌పూర్ణా పిక్చ‌ర్స్ వాళ్ల 'తోడికోడ‌ళ్లు', 'మాంగ‌ల్య బ‌లం', 'ఇద్ద‌రు మిత్రులు' సినిమాల‌ను వాహినీలోనే తీశారు. దాంతో అక్కినేని, విశ్వ‌నాథ్ బాగా స‌న్నిహితుల‌య్యారు.

ఇక ఆదుర్తికి విశ్వ‌నాథ్ ఎంత ద‌గ్గ‌ర‌య్యారంటే.. వాహినీలో రికార్డిస్టుగా ఉన్న‌ప్పుడు ఆదుర్తి సొంత చిత్రం 'మూగ‌మ‌న‌సులు' స్క్రిప్టు డిస్క‌ష‌న్స్‌లో ప్ర‌తిరోజూ ఆఫీసు అవ‌గానే సాయంత్రం పూట పాల్గొనేవారు విశ్వ‌నాథ్. ఆ త‌ర్వాత ఆదుర్తికి అసోసియేట్‌గా అన్న‌పూర్ణ సంస్థ‌లో చేరారు. అందులో నాలుగేళ్లు వ‌ర్క్ చేశారు విశ్వ‌నాథ్‌. అప్పుడు 'చ‌దువుకున్న అమ్మాయిలు', 'డాక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి' లాంటి సినిమాల‌కు ప‌నిచేశారు. 'మూగ‌మ‌న‌సులు'కు సెకండ్ యూనిట్ డైరెక్ట‌ర్‌గా చేశారు. 'తేనె మ‌న‌సులు' చిత్రానికి ఎంపికైన కృష్ణ‌, రామ్మోహ‌న్‌, సుక‌న్య‌, సంధ్యారాణి త‌దిత‌ర‌ న‌టుల‌కు ట్రైనింగ్ ఇవ్వ‌డంలో పాల్గొన్నారు. 1966లో అక్కినేని హీరోగా అన్న‌పూర్ణ సంస్థ నిర్మించిన 'ఆత్మ‌గౌర‌వం'తో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అయ్యారు విశ్వ‌నాథ్‌. ఆ త‌ర్వాత క‌థ చాలా మందికి తెలిసిందే. తెలుగు సినిమా గ‌ర్వించే ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా, లెజెండ‌రీ డైరెక్ట‌ర్‌గా కాశీనాథుని విశ్వ‌నాథ్ పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించారు.

(ఫిబ్రవరి 19 - కె. విశ్వనాథ్ జయంతి)