Read more!

English | Telugu

మూడు తరాల ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్న అరుదైన నటి జయసుధ!

ఎలాంటి పాత్రలోనైనా గొప్పగా నటించేవారు కొందరు ఉంటారు. కానీ ఆ పాత్రకి తగ్గట్టుగా ప్రవర్తించే వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన నటే సహజ నటి జయసుధ. ఆమెకు నటించడం రాదు. నిజ జీవితంలో ఫలానా పాత్ర ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తించడమే వచ్చు. అందుకే ఆమె సహజ నటి అయ్యారు.

తాను ఆరిపోతూ, తన వాళ్ళకి వెలుగివ్వాలనుకునే 'జ్యోతి' పాత్రలో జయసుధ నటనను ఎన్ని అవార్డులతో సరితూచగలం. ప్రేమ కోసం ప్రాణత్యాగం చేసిన 'శివరంజని' పాత్రలో జయసుధను తప్ప ఎవరిని ఊహించగలం. వేశ్య పాత్రకు కూడా గౌరవం తీసుకొచ్చిన ఆమె నటనకు ఎంత 'ప్రేమాభిషేకం' చేయగలం. 'మేఘ సందేశం'లో పరాయి స్త్రీ వ్యామోహంలో పడిన భర్త ప్రేమ కోసం పరితపించే పార్వతి పాత్రలో ఆమె అభినయానికి ఏమని పేరు పెట్టగలం. "రాయిని ఆడది చేసిన రాముడివా" అంటూ కళ్ళతోనే భావాలు పలికించగల ఆమె నటన గురించి ఏమని చెప్పగలం, ఎంతని చెప్పగలం.

ఇలా ఎన్నో పాత్రలకు నట నటనతో ప్రాణం పోశారు జయసుధ. పాత్రల్లో వైవిధ్యం, నటనలో సహజత్వం.. ఆమెకే సొంతం. ఆమె ఏ పాత్ర పోషించినా అందులో జయసుధ కనిపించరు. ఆమె పోషించిన పాత్రే కనిపిస్తుంది. పాత్రలో అంతలా పరకాయప్రవేశం చేస్తారు జయసుధ. ఆ సమయంలో శ్రీదేవి, జయప్రద వంటి గ్లామర్ హీరోయిన్ లకు ధీటుగా అగ్ర నటిగా ఎదిగారంటే అది ఆమె నటనా ప్రతిభే.

విరామం తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన హీరోయిన్లను చూశాం. కానీ విరామమే తీసుకోకుండా ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు జయసుధ. ప్రేయసిగా, భార్యగా, తల్లిగా, బామ్మగా ఇలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయారు. మూడు తరాల నటులతో కలిసి నటించి.. మూడు తరాల ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్నారు. ఇప్పటికీ తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.

(డిసెంబర్ 17న జయసుధ పుట్టినరోజు సందర్భంగా...)