Read more!

English | Telugu

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’కి మొదటి మూడు రోజులు ఫ్లాప్‌ టాక్‌. ఎందుకో తెలుసా?

సినిమా రంగంలో అద్భుతాలు సృష్టించాలంటే అది అందరి వల్లా అయ్యేది కాదు. ఎంతో డెడికేషన్‌, పట్టుదల, అన్నింటినీ మించి సమిష్టి కృషి ఉంటేనే అది సాధ్యమవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి అద్భుతాల్ని వేళ్ళ మీద లెక్కించవచ్చు. అలాంటి ప్రత్యేకత కలిగిన సినిమాల్లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఒకటి. ఇలాంటి ఒక మరపురాని సినిమా, చరిత్ర సృష్టించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం వెనుక ఎంతోమంది శ్రమ, కృషి దాగి వున్నాయి. ఈ అద్భుత చిత్రరాజం ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసి 34 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అయినా ఇప్పటికీ ఈ సినిమాకి వన్నె తగ్గలేదు. ఎందుకంటే ఈ సినిమా కథాంశం అలాంటిది. ఈ కథకు పాత, కొత్త అనే తేడా లేదు. ఎన్ని జనరేషన్లు మారినా, కొత్త ట్రెండ్లు ఎన్ని వచ్చినా, ఎవర్‌గ్రీన్‌ చిత్రంగా ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ నిలిచిందంటే దానికి కారణం నిత్యనూతనంగా ఉండే కథావస్తువుతో ఈ చిత్రం రూపొందడమే. రూ.8 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ. 13 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఇది అప్పటికి ఇండస్ట్రీ రికార్డు. నందమూరి తారక రామారావు, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన ‘అడవిరాముడు’ 70వ దశకంలో ఇలాంటి రికార్డును సాధించింది. ఆ సినిమా తర్వాత ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఆ స్థానాన్ని దక్కించుకుంది. 

ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌ తన వైజయంతి మూవీస్‌ బేనర్‌పై నిర్మించిన సి.అశ్వినీదత్‌కి ఒక డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉండేది. అదే ఎన్టీఆర్‌ నటించిన ‘జగదేకవీరుని కథ’. ఎప్పటికైనా తన బేనర్‌లో అలాంటి సినిమా తియ్యాలన్నది ఆయన లక్ష్యంగా ఉండేది. చిరంజీవితో ఆ సినిమా చెయ్యాలని అనుకునేవారు. నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ‘ఆఖరి పోరాటం’ తర్వాత చిరంజీవితో సినిమా చెయ్యాలనుకున్నారు దత్‌. ఒక మంచి కథ కోసం అన్వేషిస్తున్నారు. ఆ సమయంలోనే రాఘవేంద్రరావును, రచయిత శ్రీనివాస చక్రవర్తిని తిరుపతి పంపించారు. అశ్వనీదత్‌ ఎలాంటి సినిమా తియ్యాలనుకుంటున్నారో, ఎలాంటి కథ అయితే రాఘవేంద్రరావు పూర్తి న్యాయం చెయ్యగలుగుతారో శ్రీనివాస చక్రవర్తికి తెలుసు. తిరుమలలో ఉండగానే తనకు తట్టిన ఒక లైన్‌ను రాఘవేంద్రరావుకి చెప్పారు శ్రీనివాస్‌. ‘ఇంద్రలోకం నుంచి భూలోకం వచ్చిన దేవకన్య అనుకోకుండా హీరోను కలుస్తుంది. ఆ సమయంలో ఆమె వేలికున్న ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది. అది చిరంజీవికి దొరుకుతుంది’ ఇదీ లైన్‌. ఈ లైన్‌ రాఘవేంద్రరావుకి, అశ్వినీదత్‌కి, చిరంజీవికి నచ్చింది. ఆ ఒక్క లైన్‌ తప్ప పూర్తి కథగా శ్రీనివాస చక్రవర్తి దగ్గర లేదు. అప్పుడు అశ్వినీదత్‌ మద్రాస్‌లోని తన కొత్త ఆఫీస్‌ను ఈ సినిమా స్టోరీ డిస్కషన్‌కు సిద్ధం చేశారు. జంధ్యాల, యండమూరి వీరేంద్రనాథ్‌, సత్యమూర్తి, విజయేంద్రప్రసాద్‌, క్రేజీ మోహన్‌, శ్రీనివాస చక్రవర్తి ఈ కథ మీద కూర్చున్నారు. నెలరోజులపాటు చర్చించి కథను ఓ కొలిక్కి తెచ్చారు. ఈ డిస్కషన్స్‌కి చిరంజీవి కూడా వెళ్లి తనకు తోచిన సలహాలను ఇచ్చారు. మొత్తానికి కథ సిద్ధమైంది. మొదట ఈ సినిమాకి అనుకున్న టైటిల్‌ ‘భూలోక వీరుడు’. ఆ తర్వాత ‘జగదేక వీరుడు’ అనుకున్నారు. ఇందులో దేవకన్య పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉండడంతో ‘అతిలోక సుందరి’ అని చేర్చారు. మరి ఈ జగదేకవీరుడికి అతిలోక సుందరిగా నటించేదెవరు? అనే ప్రశ్నకు శ్రీదేవి రూపంలో వెంటనే సమాధానం దొరికింది. ఒక క్రేజీ కాంబినేషన్‌ సెట్‌ అయింది. తన క్యారెక్టర్‌కి సంబంధించిన కాస్ట్యూమ్స్‌ను ముంబాయిలో తనే దగ్గరుండి సిద్ధం చేయించారు శ్రీదేవి. 

ఈ సినిమా కోసం వేటూరి సుందరరామ్మూర్తి రాసిన 6 పాటల్ని రికార్డ్‌ చేశారు ఇళయరాజా. ఆర్ట్‌ డైరెక్టర్‌ బి.చలం ఆధ్వర్యంలో మానససరోవరం, దేవలోకం, ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌.. ఇలా 7 భారీ సెట్స్‌ నిర్మించారు. షూటింగ్‌ ప్రారంభించే సమయానికి సినీ కార్మికుల సమ్మె జరుగుతోంది. దీంతో బెంగళూరులో ముహూర్తం షాట్‌ను చిత్రీకరించడం ద్వారా లాంఛనంగా షూటింగ్‌ ప్రారంభించారు. కన్నడ హీరో రవిచంద్రన్‌ ఫస్ట్‌ షాట్‌కి క్లాప్‌నివ్వగా, ఎ.కోదండరామిరెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు ఫస్ట్‌ షాట్‌ను డైరెక్ట్‌ చేశారు. విజయవంతంగా షూటింగ్‌ పూర్తి చేశారు. 1990 మే 9న ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ విడుదలైంది. మొదటి మూడు రోజులు సినిమాకి ఫ్లాప్‌ టాక్‌ వచ్చిందన్న విషయం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే రిలీజ్‌ సమయానికి ఆంధ్రప్రదేశ్‌ తుపాన్‌ తాకిడికి గురైంది. రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది. ట్రాన్స్‌పోర్ట్‌ సరిగా లేని కారణంగా చాలా సెంటర్స్‌కి ప్రింట్లు ఆలస్యంగా వెళ్ళాయి. మ్యాట్నీ నుంచి ప్రదర్శన మొదలు పెట్టారు. జనం థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. కలెక్షన్లు చాలా మందకొడిగా ఉన్నాయి. దీంతో నిర్మాత అశ్వినీదత్‌ షాక్‌కి గురయ్యారు. ఎందుకంటే ఉన్నదంతా సినిమాకే పెట్టేశారు. కాస్త అటూ ఇటూ అయితే మళ్ళీ తన కెరీర్‌ను జీరో నుంచి స్టార్ట్‌ చెయ్యాలి. మొదటి మూడు రోజులు ఫ్లాప్‌ టాక్‌తోనే రన్‌ అయింది. నాలుగో రోజు నుంచి సినిమా స్టామినా ఏమిటో అందరికీ అర్థమైంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా గొడుగులు వేసుకొని మరీ థియేటర్లకు వచ్చారు. శ్రీకాకుళంలోని ఓ థియేటర్‌ వర్షం నీటితో ఉంది. జనం సినిమా చూస్తుంటే ఫైరింజన్ల సాయంతో థియేటర్‌లోని వర్షం నీటిని బయటకు తోడారు. అంతటి భారీ వర్షాల్లో సైతం ‘జగదేక వీరుడు’ అతిలోక సుందరి’ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. 

ఈ సినిమా కథాకథనాలు, సంభాషణలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. వాటికి తగ్గట్టు వేటూరి రాసిన పాటలు, ఇళయరాజా సంగీతం మంత్రముగ్ధుల్ని చేశాయి. ఇక చిరంజీవి సినిమాల్లో ఉండే రెగ్యులర్‌ స్టెప్స్‌ ఈ సినిమాలో లేకపోయినా ప్రేక్షకులకు అవి కొరతగా కనిపించలేదు. ఈ సినిమాకి నటీనటుల నుంచి మొదలుకొని టెక్నీషియన్స్‌ వరకు అన్నీ కలిసొచ్చాయి. అందరి కృషికీ తగిన ఫలితం లభించింది. సమిష్టి కృషితో భారీ ఘనవిజయాన్ని సాధించవచ్చు అని ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ టీమ్‌ నిరూపించింది. ఈ సినిమా 46 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఆగస్ట్‌ 22 మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని లాల్‌ బహదూర్‌ స్టేడియంలో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ శతదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అశ్వినీదత్‌. 

ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ని అవార్డులు కూడా వరించాయి. ఉత్తమ సంగీత దర్శకుడుగా ఇళయరాజా, ఉత్తమ ఆడియోగ్రాఫర్‌గా స్వామినాథన్‌, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా సుందరం, ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ఎం.కృష్ణ, ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌గా బి.చలం నంది అవార్డులు గెలుచుకున్నారు. ఉత్తమ దర్శకుడుగా కె.రాఘవేంద్రరావు ఫిలింఫేర్‌ అవార్డును అందుకున్నారు. ఈ సినిమా చివరలో దేవకన్య ఉంగరాన్ని ఒక చేప మింగినట్టు చూపించడం ద్వారా సినిమాకి  సీక్వెల్‌ ఉండే అవకాశం ఉందని హింట్‌ ఇచ్చారు రాఘవేంద్రరావు. సీక్వెల్‌ చేసే ఉద్దేశం తనకు కూడా ఉందని నిర్మాత అశ్వినీదత్‌ చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. 2020 ప్రాంతంలో చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ జంటగా సీక్వెల్‌ చేసేందుకు అశ్వినీదత్‌ ప్రయత్నాలు మొదలు పెట్టారని వార్తలు వచ్చాయి. అయితే అలాంటి ఆలోచన ప్రస్తుతం లేదని స్పష్టం చేయడం ద్వారా ఆ ఊహాగానాలకు తెరదించారు అశ్వినీదత్‌.