Read more!

English | Telugu

ఎన్టీఆర్ న‌టించగా రూ. 4.5 ల‌క్ష‌ల‌తో త‌యారైన‌ టాలీవుడ్‌ ఫ‌స్ట్ స‌స్పెన్స్ ఫిల్మ్ ఇదే!

 

న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీ రామారావు తన న‌ట జీవితంలో వైవిధ్య‌భ‌రిత‌మైన ఎన్నో ర‌కాల పాత్ర‌లు పోషించారు. భిన్న త‌ర‌హా సినిమాలెన్నో చేశారు. అలాంటి వాటిలో 1963లో వ‌చ్చిన 'ల‌క్షాధికారి' సినిమా ఒక‌టి. ఇది ఎన్టీఆర్ చేసిన తొలి స‌స్పెన్స్ ఫిల్మ్ కావ‌డం విశేషం. ఈ సినిమాతోటే త‌మ్మారెడ్డి కృష్ణ‌మూర్తి నిర్మాత‌గా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆయ‌న నేటి త‌రానికి తెలిసిన ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్ తండ్రి. ర‌వీంద్ర ఆర్ట్ పిక్చ‌ర్స్ అంటే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. ఆ బేన‌ర్‌పై వ‌చ్చిన సినిమాలే దానికి ఆ గుర్తింపు తీసుకు వ‌చ్చాయి. 'ల‌క్షాధికారి' సినిమా మేకింగ్ ఎలా జ‌రిగిందో తెలుసుకుంటే, ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు.

ర‌వీంద్ర ఆర్ట్ పిక్చ‌ర్స్ నెల‌కొల్ప‌క ముందు త‌మ్మారెడ్డి కృష్ణ‌మూర్తి.. అప్ప‌టి పేరుపొందిన ప్రొడ‌క్ష‌న్ కంపెనీ అయిన సార‌థీ పిక్చ‌ర్స్‌లో చీఫ్ ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌గా ప‌నిచేసేవారు. త‌న టేస్ట్‌కు త‌గ్గ‌ట్లు సినిమాలు నిర్మించాల‌ను ఆలోచ‌న‌తో ఆయ‌న సార‌థీ పిక్చ‌ర్స్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. 'గీతాంజ‌లి' కావ్యంతో నోబెల్ బ‌హుమ‌తి పొందిన ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ మీదున్న అభిమానంతో ర‌వీంద్ర ఆర్ట్ పిక్చ‌ర్స్ కంపెనీని స్టార్ట్ చేశారు కృష్ణ‌మూర్తి. హీరో కంటే మొద‌ట డైరెక్ట‌ర్‌గా వి. మ‌ధుసూద‌న‌రావును ఎంచుకున్నారు కృష్ణ‌మూర్తి. రైట‌ర్‌గా నార్ల చిరంజీవి, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా టి. చ‌ల‌ప‌తిరావును తీసుకున్నారు.

నిజానికి ఈ సినిమాకు హీరోగా మొద‌ట అనుకున్న‌ది ఎన్టీఆర్‌ను కాదు, ఏఎన్నార్‌ను. అయితే ఆ స‌మ‌యంలో వేరే చిత్రాల‌తో బాగా బిజీగా ఉన్న అక్కినేని, ఆ సినిమా తాను చేయ‌లేన‌నీ, రెండో సినిమా చేస్తాన‌నీ మాటిచ్చారు. దాంతో ఎన్టీఆర్‌ను సంప్ర‌దించారు కృష్ణ‌మూర్తి. సినిమా డిస్ట్రిబ్యూష‌న్‌కు వాణీ ఫిలిమ్స్ వాళ్లు ముందుకు రావ‌డంతో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. హీరోయిన్‌గా కృష్ణ‌కుమారిని తీసుకున్నారు. అప్ప‌ట్లో ఎన్టీఆర్‌-కృష్ణ‌కుమారి హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. నాలుగున్న‌ర ల‌క్ష‌ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాని ప్లాన్ చేశారు.

అప్ప‌టికే హిందీలో వ‌చ్చిన స‌స్పెన్స్ ఫిల్మ్ 'బీస్ సాల్ బాద్‌', త‌మిళ స‌స్పెన్స్ ఫిల్మ్ 'ముత్తుమండ‌పం' త‌ర‌హాలో జంపింగ్ స‌స్పెన్స్ అంశాల‌తో ఈ సినిమా స్క్రీన్‌ప్లేను త‌యారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించి ఇంకో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశం.. విల‌న్‌గా గుమ్మ‌డి ఎంపిక‌. నిజానికి ఆ క్యారెక్ట‌ర్‌కు మొద‌ట నాగ‌భూష‌ణంను ఎంపిక చేశారు. కానీ ఆయ‌న అయితే విల‌న్ ఎవ‌రో ప్రేక్ష‌కులు ఈజీగా ప‌సిగ‌డ‌తార‌నే ఉద్దేశంతో సాఫ్ట్ క్యారెక్ట‌ర్ల‌కు పేరుపొందిన గుమ్మ‌డి వెంక‌టేశ్వ‌ర‌రావును తీసుకున్నారు. త‌డిగుడ్డ‌తో గొంతులు కోసే ఆ క్యారెక్ట‌ర్‌లో గుమ్మ‌డి గొప్ప‌గా ఇమిడిపోయారు. న‌టునిగా ఈ సినిమా ఆయ‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు తీసుకొచ్చింది.

హాస్య జంట‌గా రేలంగి, గిరిజ అల‌రించ‌గా, ర‌మ‌ణారెడ్డి, సూర్య‌కాంతం జోడీ చిత్రానికి ఇంకో ఆక‌ర్ష‌ణ‌. 1963 సెప్టెంబ‌ర్ 27న రిలీజైన 'ల‌క్షాధికారి'ని జ‌నం బాగా ఆద‌రించారు. మ్యూజిక‌ల్‌గానూ మంచి హిట్ట‌యింది. సి. నారాయణ‌రెడ్డి, ఆరుద్ర‌, కొస‌రాజు రాసిన పాట‌ల‌కు టి. చ‌ల‌ప‌తిరావు స‌మ‌కూర్చిన బాణీలు ఆడియెన్స్‌ను అమితంగా అల‌రించాయి. నారాయ‌ణ‌రెడ్డి రాసిన ల‌లిత గీతం 'మ‌బ్బులో ఏముంది నా మ‌న‌సులో ఏముంది' అప్ప‌టికే బాగా పాపుల‌ర్. దాన్ని సినిమా పాట‌గా మార్చి 'ల‌క్షాధికారి'లో ఉప‌యోగించారు. 'దాచాలంటే దాగ‌దులే దాగుడుమూత‌లు సాగ‌వులే' పాట‌ను కూడా ఆయ‌నే రాశారు. 'ఎలాగో ఎలాగో ఎలాగో ఉన్న‌ది' అనే పాట‌ను ఆరుద్ర‌, 'అద్దాల మేడ ఉంది అందాల భామ ఉంది' అనే పాట‌ను కొస‌రాజు రాశారు. ఈ పాట‌ల‌ను ఇప్ప‌టికీ జ‌నం ఆద‌రిస్తూనే ఉన్నారు.

మొత్తానికి జంపింగ్ క్లైమాక్స్‌తో రూపొంది 'ల‌క్షాధికారి' టాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌ని సృష్టించింది. విశేష‌మేమంటే ఫ‌స్ట్ రిలీజ్‌కు మించి సెకండ్ రిలీజ్‌లో ఈ సినిమా మ‌రింత క‌లెక్ష‌న్లు వ‌సూలు చేయ‌డం. అందుకే నంద‌మూరి తార‌క‌రామారావు కెరీర్‌లో 'ల‌క్షాధికారి' ఓ స్పెష‌ల్ ఫిల్మ్‌.