English | Telugu

ఎస్‌.వి.కృష్ణారెడ్డి టాప్‌ డైరెక్టర్‌ ఎలా అయ్యారో తెలిస్తే షాక్‌ అవుతారు!

ఎస్‌.వి.కృష్ణారెడ్డి టాప్‌ డైరెక్టర్‌ ఎలా అయ్యారో తెలిస్తే షాక్‌ అవుతారు!

(జూన్‌ 1 ఎస్‌.వి.కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా..)

చక్కని కథా బలం ఉన్న సినిమాలు, కుటుంబ సమేతంగా చూసి ఆనందించదగ్గ సినిమాలు అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు ఎస్‌.వి.కృష్ణారెడ్డి. ఈ తరహా సినిమాలు తీసిన దర్శకులు ఎంతో మంది ఉన్నప్పటికీ ఎస్వీ కృష్ణారెడ్డికి మాత్రం ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు ప్రేక్షకులు. తన సినిమాల్లో డబుల్‌ మీనింగ్‌ డైలాగులుగానీ, అశ్లీల దృశ్యాలు ఉండకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. 35 సంవత్సరాల కెరీర్‌లో 40కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఎస్‌.వి.కృష్ణారెడ్డి సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం.

1961 జూన్‌ 1న తూర్పుగోదావరి జిల్లా కొంకుదురు గ్రామంలో వెంకటరెడ్డి, సుబ్బాయమ్మ దంపతులకు జన్మించారు సత్తి వెంకట కృష్ణారెడ్డి. వెంకటరెడ్డి వ్యవసాయంతోపాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు. అందులో స్వీట్స్‌ బిజినెస్‌ ఒకటి. కృష్ణారెడ్డి పాథమిక విద్య అదే గ్రామంలో జరిగినప్పటికీ హైస్కూల్‌కి వచ్చే సమయానికి వీరి కుటుంబం తణుకు దగ్గరలో ఉన్న ఆరవల్లికి మారింది. అక్కడ కృష్ణారెడ్డికి అచ్చిరెడ్డి పరిచయమయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఆ తర్వాత భీమవరంలో ఎం.కాం. పూర్తి చేశారు కృష్ణారెడ్డి. ఆయనకు చిన్నతనం నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. హీరో కావాలన్నది అతని కల. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే సినిమాలు చూసి వాటి గురించి విశ్లేషించేవారు. హైస్కూల్‌ నుంచి స్నేహితుడైన అచ్చిరెడ్డి అతనిలోని టాలెంట్‌ను గుర్తించాడు. ఎం.కాం పూర్తయిన తర్వాత కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి హైదరాబాద్‌ వచ్చారు. ఇద్దరూ కలిసి కొంతకాలం స్వీట్స్‌ బిజినెస్‌ చేశారు. ఆ సమయంలోనే కృష్ణారెడ్డిని మద్రాస్‌ పంపించి సినిమా ప్రయత్నాలు చేసుకొమ్మని చెప్పారు అచ్చిరెడ్డి. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అందుకే తనే సొంతంగా ‘పగడాల పడవ’ అనే సినిమాను నిర్మించారు. అయితే ఆ సినిమా ఒకటి, రెండు చోట్ల మాత్రమే రిలీజ్‌ అయి నష్టాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన ‘కిరాతకుడు’ చిత్రంలో ఒక చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా ఆయనకు ఉపయోగపడలేదు. దాంతో తిరిగి హైదరాబాద్‌ వచ్చేశారు. 

ఆ తర్వాత కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి కలిసి డబ్బింగ్‌ సినిమాల రైట్స్‌ తీసుకోవడం, వాటిని తెలుగు రిలీజ్‌ చెయ్యడం, కొన్ని సినిమాలను దూరదర్శన్‌కు అమ్మడం వంటి విషయాల్లో మధ్యవర్తులుగా ఉండేవారు. ఒక పక్క స్వీట్‌ బిజినెస్‌ కూడా బాగానే నడుస్తోంది. ఆ సమయంలోనే కిశోర్‌ రాఠి పరిచయమయ్యారు. ముగ్గురూ కలిసి మనీషా ఫిలింస్‌ సంస్థను ప్రారంభించారు. తొలి సినిమాగా రాజేంద్రప్రసాద్‌తో ‘కొబ్బరిబొండాం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం అందించారు కృష్ణారెడ్డి. కాటగ్రడ్డ రవితేజ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్‌తోనే తన దర్శకత్వంలో తొలి సినిమా ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ ప్రారంభించారు కృష్ణారెడ్డి. ఈ సినిమా పెద్ద విజయం సాధించడంతో దర్శకుడుగా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఆయనకు రాలేదు. ఆ తర్వాత చేసిన ‘మాయలోడు’ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. 1994 సంవత్సరం కృష్ణారెడ్డి చేసిన మూడు సినిమాలు ఆయన్ని టాప్‌ డైరెక్టర్స్‌ లిస్ట్‌లో చేర్చాయి. అప్పటివరకు హీరో కృష్ణ చేస్తున్న సినిమాలకు భిన్నంగా ఉండాలన్న ఉద్దేశంతో ‘నెంబర్‌వన్‌’ చిత్రం చేసి మరో సూపర్‌హిట్‌ని అందుకున్నారు కృష్ణారెడ్డి. కామెడీ ఆర్టిస్టుగా పేరు పొందిన అలీ హీరోగా ‘యమలీల’ వంటి బ్లాక్‌బస్టర్‌ని రూపొందించారు. ఆ వెంటనే చేసిన ‘శుభలగ్నం’తో చక్కని కుటుంబ కథా చిత్రాల దర్శకుడుగా ఎస్‌.వి.కృష్ణారెడ్డి పేరు మారుమోగిపోయింది. 

ఆ తర్వాతి సంవత్సరం చేసిన టాప్‌ హీరో, వజ్రం సినిమాలు నిరాశపరిచినప్పటికీ ఘటోత్కచుడు చిత్రంతో మరో విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో మొదటి సారి రోబోను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ తర్వాత మావిచిగురు, వినోదం, ఎగిరే పావురమా, ఆహ్వానం, దీర్ఘ సుమంగళీభవ, మనసులోమాట, ప్రేమకు వేళాయెరా, పెళ్లాం ఊరెళితే వంటి పూర్తి కుటుంబ కథా చిత్రాలు రూపొందించారు కృష్ణారెడ్డి. ఆయన కెరీర్‌లో గన్‌షాట్‌, అతడే ఒక సైన్యం వంటి డిఫరెంట్‌ సినిమాలు కూడా చేసి డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ఘనవిజయం సాధించిన ఆహ్వానం చిత్రం ఆధారంగా ‘డైవర్స్‌ ఇన్విటేషన్‌’ అనే హాలీవుడ్‌ చిత్రాన్ని కూడా రూపొందించారు కృష్ణారెడ్డి. 2014లో వచ్చిన యమలీల2 తర్వాత దాదాపు 10 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నారు. 2023లో రాజేంద్రప్రసాద్‌, మీనా ప్రధాన పాత్రల్లో ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా విజయం సాధించలేదు. 1990 నుంచి దాదాపు 15 సంవత్సరాలపాటు టాప్‌ డైరెక్టర్‌గా తన హవా కొనసాగించారు కృష్ణారెడ్డి. తను టాప్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న సమయంలోనే ఉగాది, అభిషేకం వంటి సినిమాలతో హీరో కావాలనుకున్న తన కలను నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. పూర్తిగా యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాలు, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉండే సినిమాలను ఆదరిస్తున్నారు. ఆ కారణంగా మళ్ళీ మెగా ఫోన్‌ పట్టుకునే ప్రయత్నం చేయడం లేదు ఎస్‌.వి.కృష్ణారెడ్డి.