English | Telugu
చివరి దాకా తనకు బ్లడ్ కేన్సర్ అని భార్యాపిల్లలకు చెప్పని పాపులర్ డైరెక్టర్!
Updated : Jul 30, 2021
కట్టా సుబ్బారావు 30కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. కోనసీమలోని రాజోలుకు చెందిన ఆయన ఒకప్పటి సుప్రసిద్ధ దర్శకులు కె. ప్రత్యగాత్మ దగ్గర 15 సంవత్సరాల పాటు శిష్యరికం చేశారు. కృష్ణ, జయప్రద జంటగా నటించిన 'వియ్యాలవారి కయ్యాలు' (1979) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత పదేళ్ల కాలంలో 30కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో కోడళ్లొస్తున్నారు జాగ్రత్త, మొగుడు కావాలి, బంగారు బావ, గడసరి అత్త సొగసరి కోడలు, శ్రీరస్తు శుభమస్తు, కొంటె మొగుడు పెంకి పెళ్లాం, కాలరుద్రుడు, సీత పుట్టిన దేశం, మాంగల్య బంధం లాంటి సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్, కృష్ణ, శ్రీదేవి, రాధిక లాంటి తారలతో 'వయ్యారి భామలు వగలమారి భర్తలు' లాంటి మల్టీస్టారర్‌ను సైతం ఆయన తీశారు.
1988 జూలై 3న మరణించే నాటికి ఆయన వయసు కేవలం 49 సంవత్సరాలు. లుకేమియా (బ్లడ్ కేన్సర్)తో బాధపడుతూ కట్టా సుబ్బారావు కన్నుమూశారు. విచారకరమైన విషయం ఏమంటే తనకు బ్లడ్ కేన్సర్ అనే విషయం భార్య సహా కుటుంబ సభ్యులకు ఎవరికీ తెలియకుండా ఆయన జాగ్రత్తపడ్డారు. వారికి అనుమానం రాకుండా మెడిసిన్స్ తీసుకుంటూ వచ్చారు. అలాంటి పరిస్థితుల్లోనూ షూటింగ్స్‌లో పాల్గొన్నారు.
ఆయనకు సీరియస్ అయ్యాకే వ్యాధి విషయం కుటుంబసభ్యులకు తెలిసింది. అప్పటికే ఆయనను కేన్సర్ దాదాపుగా కబళించేసింది. మద్రాస్‌లోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చివరి శ్వాస విడిచారు సుబ్బారావు. ఆయనకు ఐదుగురు కుమారులు. వారిలో శ్రీకర్‌ప్రసాద్తండ్రి బాటలో డైరెక్టర్ అయ్యారు.