English | Telugu

ఆ హీరో రిజెక్ట్‌ చేసిన నాలుగు సినిమాలూ బ్లాక్‌బసర్స్‌ అయ్యాయి!

సినిమా ఇండస్ట్రీలో హీరోలైనా, దర్శకనిర్మాతలైనా తాము చేసే సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటారు. దానికి తగ్గట్టుగానే కృషి చేస్తారు. కానీ, కొన్నిసార్లు వారి అంచనాలు తారుమారు అవుతాయి. ఎన్నో హోప్స్‌ పెట్టుకొని చేసిన సినిమా నిరాశను మిగులుస్తుంది. కొన్నిసార్లు ఆ కథలు తమకు వర్కవుట్‌ అవ్వవు అనే ఉద్దేశంతో హీరోలు రిజెక్ట్‌ చేస్తుంటారు. అలాంటి వాటిలో కొన్ని సూపర్‌హిట్‌ అవుతాయి, మరికొన్ని వారి జడ్జిమెంట్‌నే నిజం చేస్తూ ఫ్లాప్‌ అవుతాయి. కానీ, ఒక టాలీవుడ్‌ హీరో రిజెక్ట్‌ చేసిన నాలుగు సినిమాలను ఆ తర్వాత ఇతర హీరోలు చేసి బ్లాక్‌బస్టర్స్‌ సాధించిన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ హీరోకైనా ఒక టేస్ట్‌ ఉంటుంది. తన మనసుకు దగ్గరగా ఉన్న కథలతో సినిమాలు చేసేందుకే ఇష్టపడతారు. కొన్నిసార్లు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు, తన ఇమేజ్‌కి తగిన కథలను ఎంపిక చేసుకుంటారు. కానీ, హీరో రాజశేఖర్‌ మాత్రం అవేవీ ఆలోచించకుండా కొన్ని కథలను రిజెక్ట్‌ చేశారు. వాటిలో మొదటగా చెప్పుకోవాల్సింది ‘చంటి’ గురించి. పి.వాసు దర్శకత్వంలో ప్రభు హీరోగా తమిళ్‌లో రూపొందిన ‘చిన్నతంబి’ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో మొదట రాజశేఖర్‌తో చెయ్యాలనుకున్నారు నిర్మాత కె.ఎస్‌.రామారావు. ఆ సినిమాపై రాజశేఖర్‌ ఆసక్తి చూపించలేదు. దానికి తగ్గట్టుగానే ‘ఆ క్యారెక్టర్‌ నీకు సెట్‌ అవ్వదు అనుకుంటున్నాను’ అని డైరెక్టర్‌ వాసు కూడా అనడంతో ఆ సినిమాను వదులుకున్నారు. ‘చంటి’ పేరుతో వెంకటేష్‌ చేసిన ఆ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చాలా సినిమాలు చేసిన తర్వాత డైరెక్టర్‌ అవ్వాలన్న ఉద్దేశంతో ఒక కథ పట్టుకొని కొందరు హీరోల చుట్టూ తిరిగారు డైరెక్టర్‌ శంకర్‌. ఆ సమయంలోనే హీరో రాజశేఖర్‌కి కూడా కథ చెప్పారు. కానీ, అతనికి నచ్చకపోవడం వల్ల రిజెక్ట్‌ చేశారు. అప్పుడు అర్జున్‌ ఆ కథను ఓకే చేశారు. అదే ‘జెంటిల్‌మేన్‌’ సినిమా. ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి, వి.వి.వినాయక్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఠాగూర్‌’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ఎన్ని రికార్డులు క్రియేట్‌ చేసిందో మనం చూశాం. ఈ సినిమా కూడా మొదట రాజశేఖర్‌ దగ్గరికే వెళ్లింది. మరి ఆ టైమ్‌లో డేట్స్‌ అడ్జస్ట్‌ అవ్వక రిజెక్ట్‌ చేశారో లేక తెలుగులో ఈ సినిమా వర్కవుట్‌ అవ్వదు అనే జడ్జిమెంట్‌తో వద్దనుకున్నారో తెలీదుగానీ ‘ఠాగూర్‌’ చిత్రాన్ని కూడా చేజార్చుకున్నారు రాజశేఖర్‌.

విక్రమ్‌ హీరోగా హరి దర్శకత్వంలో వచ్చిన ‘సామి’ తమిళ్‌లో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమా రిలీజ్‌ అయిన మూడు నెలలకు సూర్య హీరోగా నటించిన ‘కాకా కాక’ చిత్రం విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ రెండూ పోలీస్‌ నేపథ్యంలో సాగే కథలే. ‘సామి’ చిత్రాన్ని తెలుగులో చేసే అవకాశం రాజశేఖర్‌కి వచ్చింది. అంతకుముందు ‘అంకుశం’ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌గా ఓ లెవల్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చి ఒక కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన రాజశేఖర్‌ అయితే ‘సామి’ చిత్రానికి న్యాయం జరుగుతుందని భావించిన దర్శకుడు జయంత్‌, నిర్మాత బెల్లంకొండ సురేష్‌ ఈ రీమేక్‌ గురించి రాజశేఖర్‌కి చెప్పారు. కానీ, ఈ సినిమాని కూడా అతను రిజెక్ట్‌ చేశారు. అప్పుడు నందమూరి బాలకృష్ణకు ఈ కథ చెప్పారు. ఆయన ఓకే చెప్పడం, వెంటనే సినిమా ప్రారంభం కావడం జరిగిపోయాయి. అదే ‘లక్ష్మీనరసింహా’. తెలుగులో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తను ఈ సినిమాల విషయంలో తప్పుగా ఆలోచించానని ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు రాజశేఖర్‌.