English | Telugu

లెజెండ‌రీ యాక్ట‌ర్స్ ఎన్టీఆర్‌, జ‌గ్గ‌య్య క్లాస్‌మేట్స్ అని మీకు తెలుసా?

వెండితెర‌మీద ఎన్టీఆర్ రేంజ్‌లో వెల‌గ‌క‌పోయినా, గొప్ప న‌టునిగా పేరు సంపాదించుకున్నారు కొంగ‌ర జ‌గ్గ‌య్య‌. కంచుకంఠం ఆయ‌న‌కు బిగ్ ఎస్సెట్‌. శివాజీ గ‌ణేశ‌న్‌కు తెలుగులో వాయిస్ ఇచ్చింది ఆయ‌నే. తెనాలికి ఎనిమిది మైళ్ల దూరంలోని మెరంపూడి గ్రామం జ‌గ్గ‌య్య స్వ‌స్థ‌లం. గుంటూరులోని ఎ.సి. కాలేజీలో ఇంట‌ర్మీడియేట్ చ‌దివాక ఆయ‌న 1944లో గుంటూరు నుంచి వెలువ‌డుతుంటే 'దేశాభిమాని' దిన ప‌త్రిక‌లో స‌బ్ ఎడిట‌ర్‌గా చేరారు. అయితే 1945లో తిరిగి ఎ.సి. కాలేజీలో చేరేలోగా ఆయ‌న 'ఆంధ్రా రిప‌బ్లిక్' అనే ఒక వార‌ప‌త్రిక సంపాద‌కుడిగా ప‌నిచేశారు.

కాలేజీలో న‌ట‌న‌లో ఆస‌క్తి ఉన్న స్టూడెంట్స్ అంతా క‌లిసి మంచి నాట‌కాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికి పూనుకున్నారు. వాహిని స్టూడియోలో సౌండ్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేసిన‌ వి. శివ‌రామ్ అప్పుడు ఎ.సి. కాలేజీలో ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేసేవారు. వీరంతా క‌లిసి నాట‌కాలు ప్ర‌ద‌ర్శించ‌డంలో కృషి చేసేవారు. ఏటేటా యూనివ‌ర్సిటీ వారు జ‌రిపే ఇంట‌ర్ కాలేజ్ నాట‌క పోటీల్లో ఎ.సి. కాలేజీ బృందానికే మొద‌టి బ‌హుమ‌తి ల‌భిస్తుండేది. ఈ నాట‌కాల‌న్నిటిలోనూ జ‌గ్గ‌య్య ప్ర‌ధాన పాత్ర నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలోనే, ఆ త‌ర్వాత కాలంలో తెలుగు చిత్ర‌సీమ‌లో మ‌హాన‌టుడిగా వెలుగొందిన నంద‌మూరి తార‌క‌రామారావు ఆయ‌న క్లాస్‌మేట్ కావ‌డం గ‌మ‌నార్హం.

1947లో బీఏ పాస‌య్యి వెంట‌నే దుగ్గిరాల బోర్డు హైస్కూల్లో బీఈడీ అసిస్టెంట్‌గా చేరారు జ‌గ్గ‌య్య‌. బ‌డిపంతులు ఉద్యోగం చేస్తున్న‌ప్ప‌టికీ నాట‌కాలు వేయ‌కుండా ఉండేవారు కాదు. అప్ప‌టికే విజ‌య‌వాడ‌లో ఉంటున్న ఎన్టీఆర్‌తో క‌లిసి అక్క‌డే ఒక నాట‌క సంస్థ‌ను ప్రారంభించారు. దాని పేరు 'ర‌వి ఆర్ట్ థియేట‌ర్‌'. 1948లో ఆంధ్ర నాట‌క క‌ళాప‌రిష‌త్తు న‌డిపిన నాట‌కాల పోటీలో కొప్ప‌ర‌పు సుబ్బారావు రాసిన 'చేసిన పాపం' అనే ఏకాంకిక‌ను త‌మ సంస్థ త‌ర‌పున ఎన్టీఆర్‌, జ‌గ్గ‌య్య ప్ర‌ద‌ర్శించారు. వారి ప్ర‌ద‌ర్శ‌న‌కే ప‌రిష‌త్తువారు ప్ర‌థ‌మ బ‌హుమ‌తి ఇచ్చారు. ఆనాటి స్నేహం ఆ త‌ర్వాత కాలంలోనూ, సినిమాల్లో చేరాక కూడా ఆ ఇద్ద‌రి మ‌ధ్యా కొన‌సాగుతూ వ‌చ్చింది. ఆ ఇద్ద‌రూ ప‌లు సినిమాల్లో క‌లిసి న‌టించారు.