English | Telugu

90 శాతం సూపర్‌హిట్స్‌ అందించిన టాలీవుడ్‌ డైరెక్టర్‌ గురించి మీకు తెలుసా?

90 శాతం సూపర్‌హిట్స్‌ అందించిన టాలీవుడ్‌ డైరెక్టర్‌ గురించి మీకు తెలుసా?

(జూన్‌ 14 దర్శకుడు వి.మధుసూదనరావు జయంతి సందర్భంగా..)

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మంది దర్శకులు వచ్చారు, ఎన్నో అపురూపమైన, అద్భుతమైన సినిమాలను రూపొందించారు. కొందరు శతాధిక చిత్రాల దర్శకులు కూడా వున్నారు. అయితే ఏ దర్శకుడిలోనూ లేని ప్రత్యేకత వి.మధుసూదనరావులో ఉంది. అందరూ ఆయన్ని విక్టరీ మధుసూదనరావు అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన రూపొందిచిన 70 సినిమాల్లో 90 శాతం సూపర్‌హిట్‌ చిత్రాలే. అందులో శతదినోత్సవ చిత్రాలతోపాటు సిల్వర్‌ జూబ్లీ సినిమాలు, కొన్ని సంవత్సరం ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. దాదాపు 40 సంవత్సరాలపాటు ఎన్నో విభిన్నమైన సినిమాలను రూపొందించిన విక్టరీ మధుసూదనరావు సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.

1923 జూన్‌ 14న విజయవాడ సమీపంలోని ఈడ్పుగల్లు గ్రామంలో వీరమాచనేని రామభద్రయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు వీరమాచనేని మధుసూదనరావు. ఎన్నో కష్టాల మధ్య ఇంటర్‌ పూర్తి చేశారు. ఆ సమయంలోనే స్టూడెంట్‌ ఫెడరేషన్‌లో చురుగ్గా పాల్గొనడం వల్ల రెండు సార్లు జైలుకి వెళ్ళొచ్చారు. ఇంటర్‌ వరకే చదివిన మధుసూదనరావు సినిమాలపై ఉన్న ఆసక్తితో మద్రాస్‌ బయల్దేరి వెళ్లారు. ఎల్‌.వి.ప్రసాద్‌, తాతినేని ప్రకాశరావు వంటి ప్రముఖుల సహకారంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. కొన్ని సంవత్సరాలపాటు దర్శకత్వశాఖలో పనిచేశారు. 1959లో సతీ తులసి చిత్రంతో దర్శకుడుగా పరిచయమయ్యారు మధుసూదనరావు. ఆ తర్వాత 1960లో వి.బి.రాజేంద్రప్రసాద్‌ నిర్మించిన తొలి సినిమా అన్నపూర్ణ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక అప్పటి నుంచి మధుసూదనరావు డైరెక్షన్‌లోనే చాలా సినిమాలు నిర్మించారు రాజేంద్రప్రసాద్‌. జగపతి బేనర్‌లోనే కాకుండా బయటి బేనర్‌లో ఎక్కువ సినిమాలు చేశారు. దాదాపు ప్రతి సినిమా సూపర్‌హిట్‌ అయ్యేది. ఆయన కెరీర్‌ ప్రారంభంలోనే ఎన్టీఆర్‌, సావిత్రిలతో చేసిన రక్త సంబంధం అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. అన్నాచెల్లెళ్ల అనుబంధం కథాంశంగా ఈ చిత్రం రూపొందింది. ఆ తర్వాత వచ్చిన దాదాపు 200 సినిమాలకు ‘రక్తసంబంధం’ చిత్రం రిఫరెన్స్‌గా నిలిచింది. 

ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, లక్షాధికారి, వీరాభిమన్యు, గుడిగంటలు, లక్ష్మీనివాసం, ఆత్మీయులు, మంచి కుటుంబం, అదృష్టవంతులు, ఆత్మీయులు, కృష్ణవేణి.. ఇలా అన్నీ వరస సూపర్‌హిట్‌ చిత్రాలు చేస్తూ బిజీ డైరెక్టర్‌ అయిపోయారు మధుసూదనరావు.  ఆయన కెరీర్‌లో మెమరబుల్‌ హిట్‌గా నిలిచిన మరో చిత్రం మనుషులు మారాలి. ఈ చిత్రం సాధించిన ఘనవిజయంతో శోభన్‌బాబు స్టార్‌ హీరో అయ్యారు. అలాగే భక్తతుకారాం, చక్రధారి వంటి భక్తి రసాత్మక చిత్రాలను కూడా తెరకెక్కించి విజయాలు అందుకున్నారు. అప్పటివరకు చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన శోభన్‌బాబును వీరాభిమన్యుతో హీరోను చేశారు. ఆ తర్వాతి కాలంలో విక్రమ్‌ చిత్రంతో అక్కినేని నాగార్జునను, సింహస్వప్నం చిత్రంతో జగపతిబాబును, సామ్రాట్‌ చిత్రంతో రమేష్‌బాబును హీరోలుగా పరిచయం చేశారు. హైదరాబాద్‌లో మధు ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించి ఎంతో మంది కళాకారులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు మధుసూదనరావు. 

విక్టరీ మధుసూదనరావుకు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే.. ఆయన రీమేక్‌ చిత్రాలను బాగా తియ్యగలరు అనే పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆయనకు రీమేక్‌ కింగ్‌ అనే పేరు ఉండేది. ఏ భాషా చిత్రమైనా తనకు నచ్చితే వెంటనే దాన్ని తెలుగులో రీమేక్‌ చెయ్యడం ఆయన ప్రత్యేకత. నిర్మాతలు కూడా ఆయనతో సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ అనే కాన్ఫిడెన్స్‌తో ఉండేవారు. అంతేకాదు, ఆయన చేసిన సినిమాలు దాదాపుగా అన్నీ మ్యూజికల్‌ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పటికీ ఆ పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఆయన డైరెక్ట్‌ చేసిన 70 సినిమాల్లో 60 సినిమాలు రీమేక్‌లే ఉంటాయి. అది ఇతర భాషలో వచ్చిన సినిమా కావచ్చు, నవల కావచ్చు లేదా రంగస్థలంపై వేసిన నాటకం కావచ్చు. దాన్ని సినిమా తీసేసి హిట్‌ కొట్టేవారు విక్టరీ మధుసూదనరావు. రీమేక్‌ సినిమాలతో ఇంతటి సక్సెస్‌ రేట్‌ సాధించిన దర్శకుడు టాలీవుడ్‌లో మరొకరు లేరు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో ‘స్వాతికిరణం’ వంటి మంచి చిత్రాన్ని నిర్మించారు మధుసూదనరావు. ఆయన డైరెక్ట్‌ చేసిన సినిమాల్లో 6 సినిమాలకు ఉత్తమ చిత్రంగా నంది అవార్డులు లభించాయి. అలాగే 1965లో అంతస్తులు చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. మధుసూదనరావు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకుగాను రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.