Read more!

English | Telugu

టాప్ స్టార్స్ తో కోడి రామకృష్ణ టాప్ హిట్స్.. ఆ సినిమాలేంటో తెలుసా!

తెలుగునాట వందకి పైగా సినిమాలు తెరకెక్కించిన దర్శకులు.. పరిమిత సంఖ్యలోనే ఉన్నారు. వారిలో స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ ఒకరు. ఒక తరం అగ్ర కథానాయకులందరితోనూ కోడి రామకృష్ణ కి మంచి విజయాలున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

కృష్ణ: 
కృష్ణ - కోడి రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లో 'పోరాటం' మంచి విజయం సాధించింది. 'గూండా రాజ్యం', 'గూఢచారి నెం 117' కూడా మెప్పించాయి.

చిరంజీవి: 
చిరంజీవి హీరోగా నటించిన 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య'తోనే కోడి రామకృష్ణ దర్శకుడిగా తొలి అడుగేశారు. భారీ విజయం సాధించిన ఈ సినిమా తరువాత చిరు, కోడి రామకృష్ణ కాంబోలో మరికొన్ని సినిమాలు వచ్చినా.. 'ఆలయ శిఖరం' మాత్రమే చెప్పుకోదగ్గ విజయం సాధించింది.

బాలకృష్ణ: 
'మంగమ్మ గారి మనవడు' వంటి సంచలన చిత్రంతో మొదలైన బాలయ్య - కోడి రామకృష్ణ కాంబో.. ఆపై 'ముద్దుల కృష్ణయ్య', 'ముద్దుల మావయ్య', 'మువ్వ గోపాలుడు', 'ముద్దుల మేనల్లుడు' వంటి బ్లాక్ బస్టర్స్, హిట్ మూవీస్ ని క్రెడిట్ చేసుకుంది.

నాగార్జున: 
'మురళీ కృష్ణుడు' రూపంలో నాగార్జున, కోడి రామకృష్ణ కాంబోలో చెప్పుకోదగ్గ విజయం ఉంది.

వెంకటేశ్: 
'శత్రువు' రూపంలో వెంకీ, కోడి రామకృష్ణ కాంబినేషన్ లో ఘనవిజయం ఉంది. దీనికంటే ముందు వచ్చిన 'శ్రీనివాస కళ్యాణం' కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించింది.

సుమన్: 
'తరంగిణి' వీరి కాంబోలో బిగ్గెస్ట్ హిట్ మూవీ అని చెప్పొచ్చు. అలాగే '20వ శతాబ్దం' కూడా జనరంజక చిత్రంగా నిలిచింది.

రాజశేఖర్: 
రాజశేఖర్ తో  కోడి రామకృష్ణ రూపొందించిన సినిమాల్లో 'అంకుశం' సంచలన విజయం సాధించింది. అంతకంటే ముందు వచ్చిన 'తలంబ్రాలు', 'స్టేషన్ మాస్టర్', 'ఆహుతి' కూడా మంచి విజయం సాధించాయి.

అర్జున్: 
'మా పల్లెలో గోపాలుడు', 'మన్నెంలో మొనగాడు', 'మా వూరి మారాజు', 'పుట్టింటికి రా చెల్లి'.. ఇలా అర్జున్, కోడి రామకృష్ణ కాంబోలో మంచి విజయాలే ఉన్నాయి.

జగపతి బాబు: 
జగపతి బాబుతో కోడి రామకృష్ణ తీసిన సినిమాల్లో 'దొంగాట' ఘనవిజయం సాధించగా.. 'పెళ్ళి పందిరి' కూడా విజయపథంలో పయనించింది.

(ఫిబ్రవరి 22 - కోడి రామకృష్ణ వర్ధంతి)