English | Telugu
50 ఏళ్ళ దర్శకేంద్రుడు.. తెలుగు సినిమా దశ, దిశ మార్చిన దర్శకుడు!
Updated : May 2, 2025
(మే 2 కె.రాఘవేంద్రరావు దర్శకుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా..)
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు.. తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు. కమర్షియల్ హిట్ అంటే ఏమిటో ఇండస్ట్రీకి తెలియజేసిన దర్శకుడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ.. ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించాలంటే సినిమాలో ఏయే అంశాలు ఉండాలి, మళ్ళీ మళ్ళీ ఆ సినిమాను చూడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాల్లో రాఘవేంద్రరావుకు ఒక స్థిరమైన అభిప్రాయం ఉంది. కథ, కథనాల విషయంలో ఎంత శ్రద్ధ పెడతారో.. పాటల చిత్రీకరణలో కూడా అంతే శ్రద్ధ పెడతారు. పాటల కోసమైనా రిపీట్ ఆడియన్స్‌ని థియేటర్స్ రప్పిస్తారు. 1975 మే 2న విడుదలైన ‘బాబు’ రాఘవేంద్రరావు తొలి సినిమా. దర్శకుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ దర్శకేంద్రుడు.. ప్రేక్షకుల్ని ఎలా మెస్మరైజ్ చేస్తారు, తన సినిమాలతో బాక్సాఫీస్‌ను ఎలా కొల్లగొడతారు, కమర్షియల్ సినిమాలతోనే కాదు, భక్తి రస చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆధ్యాత్మిక దిశగా ఎలా నడిపిస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాం.
1942 మే 23న కృష్ణాజిల్లా కంకిపాడు మండలం కేసరపల్లి గ్రామంలో కె.ఎస్.ప్రకాశరావు, కోటేశ్వరమ్మ దంపతులకు జన్మించారు కోవెలమూడి రాఘవేంద్రరావు. 1940 నుంచి 1950 వరకు ఓ అరడజను సినిమాల్లో హీరోగా నటించిన కె.ఎస్.ప్రకాశరావు ఆ తర్వాత దర్శకుడిగా మారి ఎన్నో అద్భుతమైన సినిమాలు రూపొందించారు. రాఘవేంద్రరావు విద్యాభ్యాసం అంతా మద్రాస్‌లోనే జరిగింది. ఆయన ఇంటర్ చదువుతున్నప్పుడే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేరమని తండ్రి అడిగారు. అయితే డిగ్రీ పూర్తి చేసిన తర్వాతే ఏదైనా చేస్తానని చెప్పారు రాఘవేంద్రరావు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆయన్ని డైరెక్టర్ కమలాకర కామేశ్వరరావు దగ్గర అసిస్టెంట్‌గా చేర్పించారు ప్రకాశరావు. 1965లో ‘పాండవ వనవాసం’ చిత్రంలో నటరత్న ఎన్.టి.రామారావుపై క్లాప్ కొట్టడం ద్వారా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు రాఘవేంద్రరావు. దాదాపు 9 సంవత్సరాలపాటు కొందరు దర్శకుల వద్ద పనిచేయడమే కాకుండా తండ్రి దగ్గర కూడా అసిస్టెంట్‌గా వర్క్ చేశారు.
1975లో అడుసుమిల్లి లక్ష్మీకుమార్ అనే నిర్మాత రాఘవేంద్రరావుతో సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. శోభన్‌బాబు, వాణిశ్రీ, లక్ష్మీ, అరుణా ఇరాని ప్రధాన పాత్రల్లో నటించిన ‘బాబు’ చిత్రంతో రాఘవేంద్రరావు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆరోజుల్లోనే 25 లక్షల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కె.ఎస్.ప్రకాశరావు కథ అందించగా, ఆత్రేయ పాటలు, మాటలు రాశారు. 1975 మే 2న విడుదలైన ఈ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. దాన్నిబట్టి సినిమా ఘనవిజయం సాధిస్తుందని ట్రేడ్‌వర్గాలు భావించాయి. కానీ, అలా జరగలేదు. సరిగ్గా రెండు వారాలకు కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘జీవనజ్యోతి’ విడుదలైంది. ఈ చిత్రంలో కూడా శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా నటించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. దాంతో ఒక్కసారిగా ‘బాబు’ చిత్రం కలెక్షన్స్ పడిపోయాయి. మ్యూజికల్‌గా పెద్ద విజయం సాధించిన ఈ సినిమా కొన్ని సెంటర్స్‌లో 50 రోజులు ప్రదర్శించారు తప్ప ఒక్క సెంటర్‌లో కూడా శతదినోత్సవం జరుపుకోలేదు.
సినిమా అంటే ప్రేక్షకులకు వినోదాన్ని అందించేది మాత్రమేనని రాఘవేంద్రరావు నమ్మేవారు. తన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు అదే సూత్రాన్ని నమ్మిన ఆయన తన ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులకు నచ్చే అంశాలనే చూపిస్తూ వచ్చారు. తమ కష్టాల్ని, శ్రమని మర్చిపోవడానికి థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులకు ఓ కొత్త ప్రపంచాన్ని చూపించాలన్న ధ్యేయంతోనే సినిమాలు రూపొందించేవారు. ముఖ్యంగా పాటల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టేవారు. ఈ విషయాన్ని రాఘవేంద్రరావు దర్శకుడు అవ్వకముందే ఆయన తండ్రి గుర్తించారు. అందుకే తను దర్శకత్వం వహించిన ‘తాసిల్దారు గారి అమ్మాయి’ చిత్రంలోని పాటల చిత్రీకరణ బాధ్యతను రాఘవేంద్రరావుకే అప్పగించారు. పాటల చిత్రీకరణలో రాఘవేంద్రరావు చూపించే వైవిధ్యాన్ని ఇప్పటివరకు ఏ దర్శకుడూ అందిపుచ్చుకోలేదన్నది వాస్తవం. ఈ విషయాన్ని ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో చూపించిన సినిమా ‘అడవి రాముడు’. ఈ చిత్రంలోని పాటలన్నీ వేటికవే ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఈ సినిమాలోని పాటలు చూసేందుకే ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ థియేటర్స్‌కి వెళ్లేవారు. ‘కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి..’ అనే పాట ఇప్పటికీ కనువిందు చేసేలా ఉంటుంది. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఏ దర్శకుడూ ఆ కాన్సెప్ట్‌లో పాట తియ్యలేదు. ఈ పాటలో ఎన్టీఆర్, జయప్రదలతోపాటు పక్షులు, జంతువులు మాత్రమే కనిపిస్తాయి. ‘ఈ పాట ఆ కాన్సెప్ట్‌లో తియ్యాలని ఎలా అనిపించింది.. నిజంగా అద్భుతం’ అంటూ ఓ బాలీవుడ్ దర్శకుడు రాఘవేంద్రరావును స్వయంగా అభినందించడం విశేషం. ఆ సినిమా మొదలుకొని తన ప్రతి సినిమాలోనూ పాటల్లో ఏదో ఒక ప్రత్యేకత చూపించే ప్రయత్నం చేశారు రాఘవేంద్రరావు. 1980 దశకం నుంచి తన పాటల్లో పూలు, పండ్లు వాడుతూ అందులోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు.
తెలుగు సినిమాను కమర్షియల్‌గా ఒక రేంజ్‌కి తీసుకెళ్లిన దర్శకుడు నిస్సందేహంగా కె.రాఘవేంద్రరావు అనే చెప్పాలి. 1977లో వచ్చిన ‘అడవి రాముడు’తో తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ఏమిటి అనేది తెలియజెప్పారు. ఈ సినిమా 32 కేంద్రాల్లో 100 రోజులు, 16 కేంద్రాల్లో 175 రోజులు, 8 కేంద్రాల్లో 200 రోజులు, 4 కేంద్రాల్లో 365 రోజులు ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. 50 రోజుల్లో 83 లక్షలు, 67 రోజుల్లో కోటి రూపాయలు, 100 రోజుల్లో 3 కోట్లు వసూలు చేసింది. తెలుగు సినిమా చరిత్రలో 3 కోట్లు వసూలు చేసిన తొలి సినిమా ఇదే. ఆ తర్వాత టాలీవుడ్‌లోని కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, మోహన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి టాప్ హీరోలందరికీ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్ అందించారు. కలెక్షన్లపరంగా రికార్డులు సృష్టించిన సినిమాలను రూపొందించారు. మహేష్‌బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల మొదటి సినిమాకు దర్శకత్వం వహించిన ఘనత దక్కించుకున్నారు రాఘవేంద్రరావు. ‘పాండవవనవాసం’ చిత్రంలో ఎన్టీఆర్‌పై క్లాప్ కొట్టడం ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించిన రాఘవేంద్రరావు ఆయన చివరి సినిమా ‘మేజర్ చంద్రకాంత్’కి దర్శకత్వం వహించడం చాలా అరుదైన విషయం.
1997లో అక్కినేని నాగార్జునతో రాఘవేంద్రరావు చేసిన ‘అన్నమయ్య’ ఆయన కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోయింది. అప్పటివరకు కమర్షియల్ సినిమాలు చేస్తూ వస్తున్న రాఘవేంద్రరావు, నాగార్జున.. ఒక్కసారిగా భక్తిమార్గంలోకి రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘అన్నమయ్య’ చిత్రానికి పరాజయం తప్పదని, నిర్మాత దొరస్వామిరాజు భారీగా నష్టపోతాడని సినీ పండితులు జోస్యం చెప్పారు. కానీ, అవేవీ ఫలించలేదు. ఎవరూ ఊహించని విధంగా రాఘవేంద్రరావు నుంచి ఒక అద్భుత దృశ్యకావ్యం వచ్చి థియేటర్స్‌ను దేవాలయాలుగా మార్చేసింది. నాగార్జున జీవితాంతం గుర్తుపెట్టుకోదగ్గ సినిమా అయింది. అలాగే మెగాస్టార్ చిరంజీవితో ‘శ్రీమంజునాథ’ చిత్రాన్ని రూపొందించి మరో ఘనవిజయాన్ని అందుకున్నారు. నాగార్జునతో చేసిన ‘శ్రీరామదాసు’ మరో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ‘శిరిడీసాయి’, ‘పాండురంగడు’, ‘ఓం నమో వెంకటేశాయ’ వంటి సినిమాలతో భక్తి చిత్రాలు కూడా అద్భుతంగా తియ్యగలనని నిరూపించుకున్నారు కె.రాఘవేంద్రరావు.
