English | Telugu

మధ్య తరగతి కథలతో.. మహోన్నత విజయాలు అందుకున్న కె.బాలచందర్‌!

మధ్య తరగతి కథలతో.. మహోన్నత విజయాలు అందుకున్న కె.బాలచందర్‌!

(జూలై 9 కె.బాలచందర్‌ జయంతి సందర్భంగా..)

తెలుగు సినిమా పుట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఎంతో మంది గొప్ప దర్శకులు చిత్ర పరిశ్రమకు వచ్చి అద్భుతమైన సినిమాలు ప్రేక్షకులకు అందించారు. పౌరాణికాలు, జానపదాలు, సాంఘికాలు.. ఇలా ఎవరి స్టైల్‌లో వాళ్ళు సినిమాలు తీసేవారు. 70వ దశకం వచ్చేసరికి కొత్త ఆలోచనలతో కొత్త దర్శకులు పరిశ్రమకు వచ్చారు. అలాంటి వారిలో కె.బాలచందర్‌ది ఓ భిన్నమైన శైలి. అప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ హీరో ప్రధానంగా ఉండేవి. కానీ, బాలచందర్‌ మాత్రం తన సినిమాలు  ప్రత్యేకంగా ఉండాలనుకున్నారు. మధ్యతరగతి కుటుంబాల్లోని వ్యక్తులే ఆయన హీరోలు, వారి మధ్య ఉన్న సమస్యలే కథా వస్తువులు. స్టార్స్‌ జోలికి వెళ్లకుండా వర్థమాన నటీనటులతోనే ఆ సినిమాలు రూపొందించేవారు. ఆయన చేసిన ప్రతి సినిమా అందర్నీ ఆలోచింపజేసే విధంగా ఉండేది. ఆ విధంగా ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు రూపొందించారు బాలచందర్‌. ఆయన సినిమాల ద్వారా పరిచయమైన ఎందరో నటీనటులు తరువాతి రోజుల్లో తారాపథంలో జైత్రయాత్ర సాగించారు. మధ్య తరగతి జీవితాల్లోని పలు కోణాలు ఆవిష్కరిస్తూ బాలచందర్‌ చిత్రాలు తెరకెక్కించారు. సహజత్వానికి దగ్గరగా ఉండే ఆయన చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకొనేవి. 40 సంవత్సరాల కెరీర్‌లో 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. 20కి పైగా టీవీ సీరియల్స్‌ని రూపొందించారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. సౌత్‌ ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో కె.బాలచందర్‌ అంటే ఇష్టపడని ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ఉండరు. అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బాలచందర్‌.. సినిమా రంగానికి ఎలా వచ్చారు, ఆయన రూపొందించిన సినిమాలు ఏ స్థాయిలో విజయాల్ని సాధించాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం.

1930 జూలై 9న తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా మన్నిలంలో జన్మించారు కైలాసం బాలచందర్‌. 1930వ దశకంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందిన ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌ సినిమాలంటే ఆయన ఇష్టపడేవారు. ఆయన నటించిన ప్రతి సినిమా చూసేవారు. చదువుకునే రోజుల్లోనే నాటకాలు రాసి, వాటికి దర్శకత్వం వహించేవారు బాలచందర్‌. బి.ఎస్‌సి. వరకు చదివిన ఆయన.. కొంతకాలం టీచర్‌గా, మరి కొంతకాలం ఒక అకౌంటెంట్‌ జనరల్‌ దగ్గర క్లర్క్‌గా పనిచేశారు. అదే సమయంలో సొంతంగా ఒక నాటక సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ నాటక సమాజంలోనే సౌందర్‌రాజన్‌, షావుకారు జానకి, నగేశ్‌, శ్రీకాంత్‌ వంటి వారు నటించేవారు. ఆ తర్వాతి కాలంలో వీరంతా సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన రాసిన నాటకాల్లో మేజర్‌ చంద్రకాంత్‌ నాటకానికి విశేషాదరణ లభించింది. అలా రచయితగా, దర్శకుడిగా రంగస్థలంపై పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎం.జి.ఆర్‌. హీరోగా నటించిన ‘దైవతాయ్‌’ చిత్రానికి మాటలు రాసే అవకాశం వచ్చింది. ఆ సినిమా తర్వాత ‘సర్వర్‌ సుందరం’ నాటకాన్ని సినిమాగా తీశారు. దానికి కూడా బాలచందర్‌ మాటలు అందించారు. 

1965లో వచ్చిన ‘నీర్‌ కుమిళి’ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు బాలచందర్‌. తెలుగులో ‘భలే కోడళ్లు’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత సత్తెకాలపు సత్తెయ్య, బొమ్మా బొరుసా, జీవిత రంగం వంటి సినిమాలతో మంచి దర్శకుల సరసన నిలిచారు. తెలుగులో ఆయన్ని టాప్‌ డైరెక్టర్‌గా నిలబెట్టిన సినిమా అంతులేని కథ. ఈ సినిమా ఆరోజుల్లో పెద్ద సంచలనం. ఆ తర్వాత చేసిన మరోచరిత్ర ప్రేమకథా చిత్రాల్లో ఓ కొత్త ఒరవడిని తీసుకొచ్చి చరిత్ర సృష్టించింది. ఇదే చిత్రాన్ని హిందీలో ‘ఏక్‌ దూజే కే లియే’గా రూపొందించారు బాలచందర్‌. ఆ సినిమాతోనే కమల్‌ హాసన్‌ హిందీ సినిమా రంగంలో అడుగు పెట్టారు. ఆ చిత్రంలోని ‘తేరే మేరే బీచ్‌ మే..’ అనే పాటను అద్భుతంగా గానం చేసిన ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డు లభించింది. అది ఆయన అందుకున్న రెండో జాతీయ అవార్డు. ‘ఏక్‌ ధూజె కె లియే’ చిత్రాన్ని ప్రఖ్యాత దర్శకనిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌ నిర్మించడం విశేషం!

కె.బాలచందర్‌ దర్శకత్వంలో రూపొందిన అందమైన అనుభవం, గుప్పెడు మనసు, ఇదికథ కాదు, ఆకలి రాజ్యం, ఆడవాళ్ళు మీకు జోహార్లు, తొలికోడి కూసింది, 47 రోజులు, కోకిలమ్మ, రుద్రవీణ వంటి సినిమాలు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగించాయి. బాలచందర్‌ సినిమాలతోనే కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, చిరంజీవి, జయప్రద, జయసుధ, శ్రీదేవి వంటివారు మంచి పేరు సంపాదించారు. చిత్రసీమలో తమదైన బాణీ పలికించగలిగారు. ఇలా ఎందరికో సినిమాల్లో రాణించే అవకాశం కల్పించిన బాలచందర్‌, తమ కవితాలయా ప్రొడక్షన్స్‌ పతాకంపై తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ చిత్రాలు నిర్మించారు. ఆపై ఇతర దర్శకులతోనూ తన బ్యానర్‌లో సినిమాలు నిర్మించి నిర్మాతగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. దర్శకుడిగా తనకంటూ ఒక ముద్ర కలిగిన బాలచందర్‌ను 1987లో పద్మశ్రీ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. 2010లో ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఇవి కాక ఆయన దర్శకత్వం వహించిన సినిమాలకు నేషనల్‌ అవార్డులు, నంది అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు, తమిళనాడు స్టేట్‌ అవార్డులు.. ఇలా అనేక పురస్కారాలు లభించాయి. కె.బాలచందర్‌ తర్వాత ఆ తరహా సినిమాలు రూపొందించే దర్శకులు చిత్ర పరిశ్రమలో మరొకరు కనిపించలేదు. 2014లో ఆయనకు న్యూరోసర్జరీ జరిగింది. ఆ తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో డిసెంబర్‌ 15న చెన్నయ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. 8 రోజులపాటు చికిత్స తీసుకున్న తర్వాత డిసెంబర్‌ 23న తుదిశ్వాస విడిచారు కె.బాలచందర్‌. భౌతికంగా ఆయన మనమధ్య లేకపోయినా ఆయన రూపొందించిన అపురూప చిత్రాలను ప్రేక్షకులు ఇప్పటికీ ఆదరిస్తూనే ఉన్నారు.