English | Telugu
బాలకృష్ణ-ఎన్టీఆర్ చేయాల్సిన 'యమగోల'ను ఎన్టీఆర్-సత్యనారాయణ చేశారు!
Updated : Jun 14, 2021
నటసార్వభౌమ ఎన్టీ రామారావు, అందాల తార జయప్రద జంటగా నటించిన 'యమగోల' (1977) చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్టయింది. తాతినేని రామారావు డైరెక్ట్ చేసిన ఆ సినిమాని నిజానికి బాలకృష్ణ హీరోగా తియ్యాలని నిర్మాత ఎస్. వెంకటరత్నం అనుకున్నారని మీకు తెలుసా? అవును. దాని వెనుక ఓ కథే ఉంది. అసలు 'యమగోల' టైటిల్‌తో సినిమా తియ్యాలని అనుకుంది ప్రఖ్యాత దర్శకుడు సి. పుల్లయ్య. అప్పటికే ఆయన ఎన్టీఆర్‌తో 'దేవాంతకుడు' మూవీని తీసి ఘనవిజయం సాధించారు. తెలుగులో రూపొందిన తొలి సోషియో ఫాంటసీ ఫిల్మ్‌గా 'దేవాంతకుడు' పేరు తెచ్చుకుంది. అందులోనూ యమధర్మరాజు పాత్ర కీలకం. ఆ పాత్రను విశ్వనటచక్రవర్తి ఎస్వీ రంగారావు పోషించారు.
'దేవాంతకుడు' తరహాలోనే మరో సోసియో ఫాంటసీని రూపొందించాలనుకున్న సి. పుల్లయ్య 'యమగోల' అనే సినిమా తియ్యనున్నట్లు పత్రికల్లో ప్రకటించారు. దానికి ఆదుర్తి సుబ్బారావు తమ్ముడు నరసింహమూర్తితో ఓ కథను తయారు చేయించారు. కానీ తెలీని కారణాల వల్ల ఆ సినిమా వాస్తవరూపం దాల్చలేదు. అనంతరం పుల్లయ్య కుమారుడు సి.యస్. రావు ఆ కథను మరింత డెవలప్ చేశారు. ఆ కథను నిర్మాత డి.ఎన్. రాజుకు చెప్పారు. అయితే అన్నింటా ప్రముఖ నిర్మాత డి.వి.ఎస్. రాజు సలహాలు తీసుకొనే డి.ఎన్. రాజు ఈ కథను కూడా ఆయనతో కలిసి చర్చించారు. డి.వి.ఎస్. రాజుకు కథ నచ్చలేదు. దాంతో ఆ ప్రాజెక్టు అటకెక్కింది.
అప్పటికే 'యమగోల' అనే టైటిల్ డి. రామానాయుడుకు నచ్చింది. ఆయన ఈ స్క్రిప్టు గురించి వాకబుచేసి, దాని హక్కులు కొన్నారు. కానీ తర్వాత కథ ఆయనకూ పూర్తిగా సంతృప్తినివ్వకపోవడంతో ఆయన కూడా దాన్ని పక్కన పెట్టేశారు. అయితే టైటిల్ మాత్రం ఆయన దగ్గరే ఉంది. ఇది జరిగిన పదిహేడేళ్ల తర్వాత ఆయన దగ్గర్నుంచి 'యమగోల' టైటిల్‌ను సినిమాటోగ్రాఫర్-ప్రొడ్యూసర్ అయిన ఎస్. వెంకటరత్నం కొన్నారు. డి.వి. నరసరాజు చేత కథను డెవలప్ చేయించి, మాటలు రాయించారు. 'దేవాంతకుడు' సినిమాని ఎన్టీఆర్ చేయడం వల్ల, 'యమగోల' సినిమాని ఆయన తనయుడు బాలకృష్ణతో చేస్తే బాగుంటుందనీ, ఆలాగే యముడి పాత్రను ఎన్టీఆర్ చేత చేయించాలనీ ఆయన అనుకున్నారు. అప్పటికే రిలీజైన 'దానవీరశూర కర్ణ' చిత్రంలో అభిమన్యుడిగా బాలకృష్ణ నటన ఆయనకు నచ్చింది.
ఇదే విషయమై ఎన్టీఆర్‌ను సంప్రదించారు వెంకటరత్నం. అయితే అప్పుడు సొంత చిత్రాలలో తప్పితే, బయటి చిత్రాల్లో బాలకృష్ణ నటించడానికి ఎన్టీఆర్ ఒప్పుకోవడం లేదు. ఆ సంగతి చెప్పి, తనే హీరో వేషం వేస్తాననీ, యముడి క్యారెక్టర్‌కు సత్యనారాయనణను తీసుకొనమనీ సూచించారు ఎన్టీఆర్. సరేనని ఆయన చెప్పినట్లే చేశారు వెంకటరత్నం. అలా తాతినేని రామారావు డైరెక్షన్‌లో తయారైన 'యమగోల' బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్టయింది.