Read more!

English | Telugu

కె.ఆర్‌. విజ‌య ఎంత రిచ్ అంటే.. సొంత విమానం క‌లిగిన మొట్ట‌మొద‌టి న‌టి ఆమే!

 

అల‌నాటి అందాల తార‌ల్లో కె.ఆర్‌. విజ‌య ఒక‌రు. సావిత్రి త‌ర‌హాలోనే బొద్దుగా ఉండి న‌టిగా రాణించిన వారిలో ఆమె కూడా ఒక‌రు. ఆమె అస‌లు పేరు దైవ‌నాయ‌కి. ఆమె తండ్రి చిత్తూరుకు చెందిన తెలుగువ్య‌క్తి కాగా, త‌ల్లి కేర‌ళ వ‌నిత‌. కె.ఆర్‌. విజ‌య తండ్రి రెండో ప్ర‌పంచ యుద్ధంలో పాల్గొన్న భార‌త సైనికుడు. ఆర్మీలో ప‌నిచేస్తున్న‌ప్పుడు మ‌ల‌యాళ స్నేహితుని చెల్లెలిని ఆయ‌న వివాహం చేసుకున్నారు. వారికి ఆరుగురు సంతానం. ఐదుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి.

డ్రామాలు వేస్తూ చెన్నైకి వ‌చ్చిన విజ‌య త‌మిళ సినిమా 'క‌ర్ప‌గ‌మ్' (1963) సినిమాలో హీరోయిన్‌గా న‌టించ‌డం ద్వారా చిత్ర‌సీమ‌లోకి అడుగుపెట్టారు. ఆ సినిమా డైరెక్ట‌ర్ కె.ఎస్‌. గోపాల‌కృష్ణ‌న్‌ పేరు మార్చుకొమ్మన‌మ‌ని సూచించ‌డంతో త‌ల్లి క‌ల్యాణి, తండ్రి రామ‌చంద్ర పేర్లు రెంటినీ క‌లుపుకొని కె.ఆర్‌. విజ‌య‌గా త‌న స్క్రీన్ నేమ్ మార్చుకున్నారు. ఎన్టీఆర్ డైరెక్ట్ చేసిన పౌరాణిక చిత్రం 'శ్రీ‌కృష్ణ పాండ‌వీయం' (1966) ఆమె తొలి తెలుగు చిత్రం. అప్పుడామె వ‌య‌సు 17 సంవ‌త్స‌రాలు. 1966లోనే త‌మిళ చిత్ర నిర్మాత‌, ఫైనాన్షియ‌ర్ సుద‌ర్శ‌న్ వేలాయుధ‌మ్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయ‌న ఫైనాన్స్ చేసిన ఓ త‌మిళ‌ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన‌ప్పుడు వారు తొలిసారి క‌లుసుకున్నారు. ఆ ప‌రిచ‌యం క్ర‌మంగా పెరిగి, ప్రేమ‌గా మారింది. పెళ్లి చేసుకున్నారు.

అయితే కొంత‌కాలం బ‌య‌టి ప్ర‌పంచానికి చెప్ప‌కుండా దాచారు. ఎందుకంటే అప్ప‌టికి ఇంకా విజ‌య మేజ‌ర్ కాలేదు. ఆమె ఎనిమిది నెల‌ల గ‌ర్భిణిగా ఉన్న‌ప్పుడు వేలాయుధ‌మ్ ఆమెను సిలోన్‌కు తీసుకువెళ్లారు. ఫ్ల‌యిట్ నుంచి కింద‌కు దిగేట‌ప్పుడు ఒక వ్య‌క్తి ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలు మ‌రుస‌టి రోజు న్యూస్ పేప‌ర్స్‌లో వ‌చ్చేశాయి. విజ‌య‌, వేలాయుధ‌మ్ సిలోన్‌కు హ‌నీమూన్‌కు వెళ్లారంటూ రాసేశాయి. అలా వారి పెళ్లి విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

వేలాయుధంకు ప‌లు హోట‌ల్స్ కూడా ఉండేవి. అంతే కాదు.. సొంత జెట్ విమానం కూడా ఆయ‌న కొన్నారు. అలా దేశంలోనే ప్రైవేట్ జెట్ క‌లిగిన తొలి న‌టిగా కె.ఆర్‌. విజ‌య రికార్డుల్లోకి ఎక్కారు. వేలాయుధ‌మ్‌తో పెళ్లి ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె రాజ‌భోగాలు అనుభ‌వించారు.

అయితే ఆమె కెరీర్‌కు పెళ్లి అడ్డు కాలేదు. కూతురు పుట్టిన కొన్ని నెల‌ల త‌ర్వాత‌ సినిమాల్లో న‌టించ‌డం కొన‌సాగించ‌మ‌ని, పెళ్లితో కెరీర్‌ను ఆపాల్సిన అవ‌స‌రం లేద‌నీ భ‌ర్త ఎంక‌రేజ్ చేయ‌డంతో కె.ఆర్‌. విజ‌య న‌ట‌న‌ను కంటిన్యూ చేశారు. దేవ‌త పాత్ర‌ల‌కు తిరుగులేని న‌టిగా పేరుపొందారు. ఆమెను మ‌హారాణిలా చూసుకున్న భ‌ర్త వేలాయుధ‌మ్ 2016లో క‌న్నుమూశారు.