Read more!

English | Telugu

రాఘ‌వేంద్ర‌రావు రిజెక్ట్ చేస్తే.. ఎన్టీఆర్ స్వ‌యంగా డైరెక్ట్ చేసిన చిత్రం 'చండ‌శాస‌నుడు'!

 

న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావుకు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ తొలిసారి ర‌చ‌న చేసిన సినిమా 'అనురాగ దేవ‌త' (1982). దాని త‌ర్వాత వారు 'చండ‌శాస‌నుడు' సినిమాకు క‌థ‌, మాట‌లు స‌మ‌కూర్చారు. నిజానికి ఆ సినిమాను కె. రాఘ‌వేంద్ర‌రావు డైరెక్ట్ చేయాల్సింది. కానీ ఆయ‌న‌కు ఆ స్క్రిప్టు న‌చ్చ‌లేదు. దాంతో ఎన్టీఆరే స్వ‌యంగా ఆ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ మూవీని ప్రేక్ష‌కులు అద్భుతంగా ఆద‌రించారు.

ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌లో మొద‌ట ఎన్టీఆర్‌కు ప‌రిచ‌య‌మ‌య్యింది పెద్ద‌వాడైన వెంక‌టేశ్వ‌ర‌రావు. ఆయ‌నే మాట‌ల సంద‌ర్భంలో ఎన్టీఆర్‌తో "మా త‌మ్ముడు గోపాల‌కృష్ణ ఉయ్యూరులో లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. వాడికి మీరంటే ప్రాణం. మీరు తెర‌మీద క‌నిపించ‌గానే ఊగిపోతాడు. మావాడి ద‌గ్గ‌ర చండ‌శాస‌నుడు అనే క‌థ ఉంది. మీరు వింటానంటే పిలిపిస్తాను." అని చెప్పారు. రామారావు గారు పిలిపించ‌మ‌ని చెప్ప‌డంతో, వ‌చ్చి క‌థ చెప్పారు గోపాల‌కృష్ణ‌. న‌చ్చితే రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో చెయ్యాల‌ని రామారావు గారు అనుకున్నారు. కానీ ఆయ‌న త‌న‌కు ఆ క‌థ న‌చ్చ‌లేద‌ని చెప్పారు. ఎన్టీఆర్‌కు మాత్రం న‌చ్చింది.

ఒక‌రోజు గోపాల‌కృష్ణ ప‌నిచేస్తున్న కాలేజీకి ట్రంక్ కాల్ చేశారు ఎన్టీఆర్‌. మ‌ద్రాసుకు వ‌చ్చి క‌ల‌వ‌మ‌ని చెప్పారు. అలాగే అని మ‌ద్రాస్ వెళ్లారు గోపాల‌కృష్ణ‌. "మ‌నం 'చండ‌శాస‌నుడు'పై కూర్చుందాం. అందుకే పిలిపించాం" అన్నారు ఎన్టీఆర్‌. డైరెక్ట‌ర్ ఎవ‌ర‌ని అడిగారు గోపాల‌కృష్ణ‌. "మేమే చేస్తాం" అనేది ఎన్టీఆర్ స‌మాధానం. మూడు రోజుల్లో స్క్రిప్టుకు డైలాగ్స్ రాసేశారు గోపాల‌కృష్ణ‌. అలా 'అనురాగ‌దేవ‌త'కు ప‌నిచేశాక‌, ఎన్టీఆర్ ద‌ర్శ‌క‌త్వంలోనే, వారే నిర్మాత‌గా రూపొందిన 'చండ‌శాస‌నుడు' చిత్రానికి ప‌రుచూరి సోద‌రులు క‌థ‌, మాట‌లు స‌మ‌కూర్చారు.

ఆ సినిమాకు సంబంధించిన మ‌రో విశేషం ఏమిటంటే అందులో శార‌ద చేసిన పాత్ర‌కు మొద‌ట జ‌యంతిని అనుకున్నారు రామారావుగారు. అయితే ఆ పాత్ర‌కు శార‌ద అయితే బాగుంటార‌ని గోపాల‌కృష్ణ సూచించారు. "ఆమె ఆ పాత్ర‌ను చేయ‌గ‌ల‌రా?" అని ప్ర‌శ్నించారు ఎన్టీఆర్‌. 'న్యాయం కావాలి' చిత్రంలో శార‌ద న‌ట‌న‌ను ప్ర‌స్తావించి, ఆమె డైలాగ్స్ బాగా చెప్తార‌ని తెలిపారు గోపాల‌కృష్ణ‌. ఆయ‌న చెప్పిన‌ట్లే ఆ పాత్ర‌కు శార‌ద‌ను తీసుకున్నారు ఎన్టీఆర్‌. 'చండ‌శాస‌నుడు' సినిమాలో శార‌ద న‌ట‌న ప్రేక్ష‌కుల్ని గొప్ప‌గా ఆక‌ట్టుకుంది. ఆ ఒక్క పాత్ర ఆమెకు ఇర‌వై పైగా చిత్రాల‌ను తెచ్చిపెట్టింది. 

కాగా ఆ సినిమా నిర్మాణ స‌మ‌యంలోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. ఓవైపు నిర్విరామంగా పార్టీ ప్ర‌చారం చేస్తూ, మ‌రోవైపు 'చండ‌శాస‌నుడు' నిర్మాణ ప‌నుల‌ను, ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించారు. 1983లో ఎన్టీఆర్ పుట్టిన‌రోజు మే 28న‌ సినిమా విడుద‌లైంది. ఘ‌న‌ విజ‌యం సాధించింది.