Read more!

English | Telugu

జంతువులే ఆయన సినిమాల్లో హీరోలు.. వాటితోనే బ్లాక్‌బస్టర్స్‌ తీశారు!

పాత తరం నిర్మాణ సంస్థల్లో దేవర్‌ ఫిలింస్‌కి ఒక ప్రత్యేక స్థానం ఉండేది. దేవర్‌ ఫిలింస్‌ అధినేత శాండో చిన్నప్పదేవర్‌. ఆయన సుబ్రహ్మణ్యస్వామి భక్తుడు. తన నిర్మాణ సంస్థలో తమిళ్‌, హిందీ, తెలుగు భాషల్లో 100కి పైగా సినిమాలను నిర్మించి మంచిపేరు తెచ్చుకున్నారు చిన్నప్ప దేవర్‌. ఆయన నిర్మించిన సినిమాల్లో ఎక్కువ శాతం జంతువులు ఉండేవి. ఏనుగులు, పాములు, పులులు, ఆవులు, పొట్టేళ్లు... ఇలా అనేక జంతువులతో సినిమాలు నిర్మించారు. ప్రధాన పాత్రల్లో హీరోలు, హీరోయిన్లు ఉన్నప్పటికీ జంతువుల కోసం ప్రత్యేకమైన పాత్రలు ఉండేలా చూసుకునేవారు. ఆయనకు జంతువులంటే అంత ప్రాణం. అందుకే తన ప్రతి సినిమాలోనూ జంతువులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. 

తమ సినిమాల్లో ఎక్కువగా జంతువులు ఉండడానికి కారణం ఏమిటనే విషయాన్ని వివరిస్తూ ‘జంతువులను మచ్చిక చేసుకొని వాటితో నటింపజేస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. అందుకే నా సినిమాల్లో జంతువులకు ఎక్కువ స్థానం ఉండేది. అలా చేసిన సినిమాలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. వాటితో సినిమాలు చేయడం వల్ల మరో ఉపయోగం కూడా ఉంది. సినిమాలోని ప్రధాన పాత్రల్లో జంతువుల్ని పెడితే అవి కాల్షీట్లు ఎగ్గొట్టవు, అదికావాలి, ఇది కావాలి అంటూ గొంతెమ్మ కోరికలు కోరవు. మనం చెప్పింది చెప్పినట్టు చేస్తాయి’ అని చెప్పేవారు చిన్నప్ప దేవర్‌. తెలుగులో ఆయన ‘పొట్టేలు పున్నమ్మ’ చిత్రాన్ని నిర్మించారు. తమిళ్‌లో నిర్మించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదలై ఘనవిజయం సాధించాయి. ఏనుగులు ప్రధాన పాత్రలో రజనీకాంత్‌ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ‘అమ్మ ఎవరికైనా అమ్మ’ చిత్రం ఘనవిజయం సాధించింది. అంతకుముందు ఇదే కథతో హిందీలో ధర్మేంద్ర హీరోగా ‘మా’ పేరుతో నిర్మించారు. 

ఏనుగు ప్రధాన పాత్రలో దేవర్‌ ఫిలింస్‌ నిర్మించిన ‘హాథీ మేరే సాథీ’ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా ఈ సినిమా విడుదలై పెద్ద హిట్‌ అయింది. దేవర్‌ ఆయా జంతువుల్ని పలకరించే విధానం ఎంతో బాగుంటుంది. ఎంతో ప్రేమగా వాటిని పలకరిస్తారు. ఆవు ప్రధాన పాత్రలో ‘గాయ్‌ ఔర్‌ గౌరి’ అనే సినిమాను నిర్మించారాయన. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో దాని కోసం వాహిని స్టూడియోలో ప్రత్యేకంగా పెద్ద గదిని కట్టించారు. దాన్ని అందులోనే ఉంచేవారు. ఎండ, వాన తగలకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. దానిపై దోమలు వాలకుండా పెద్ద ఫ్యాన్‌ను ప్రత్యేకంగా తయారు చేయించి పెట్టారు. ఆ ఆవుని శుభ్రపరిచేందుకు ఇద్దరు పనివాళ్ళను కూడా ఏర్పాటు చేశారు. పొద్దున్నే దాన్ని ఎంతో ప్రేమగా పలకరించేవారు. ‘ఇవాళ నీకు షూటింగ్‌ లేదురా.. హాయిగా విశ్రాంతి తీసుకో’ అని చెప్పి వెళ్ళేవారు. ఆయన ఏనాడూ పైన షర్ట్‌ వేసుకునేవారు కాదు, ఒళ్ళంతా చందనం పూసుకొని ఉండేవారు. విమానంలో ప్రయాణం చెయ్యాలన్నా అలాగే వెళ్ళేవారు.