Read more!

English | Telugu

ఫాల్కే జ‌యంతి.. ఫ‌స్ట్ ఇండియ‌న్ ఫిల్మ్ విశేషాలివే!

 

భార‌త‌దేశ‌పు వెండితెర క‌ల‌ను సాకారం చేసి, బార‌త చ‌ల‌న‌చిత్ర పితామ‌హునిగా పేరుగాంచిన‌ దాదాసాహెబ్ ఫాల్కే జ‌యంతి నేడు. ఆయ‌న రూపొందించిన తొలి చిత్రం 'రాజా హ‌రిశ్చంద్ర' (1913) భార‌త‌దేశ‌పు తొలి చిత్రంగానే కాకుండా, తొలి ఫుల్‌-లెంగ్త్ ఫీచ‌ర్ ఫిల్మ్‌గా కీర్తికెక్కింది. కేవ‌లం 19 సంవ‌త్స‌రాల కెరీర్‌లో ఫాల్కే 95 సినిమాల‌ను, 27 షార్ట్ ఫిలిమ్స్‌ను తీశారు. వాటిలో మోహినీ భ‌స్మాసుర‌, సత్య‌వాన్ సావిత్రి (స‌తీ సావిత్రి), లంకా ద‌హ‌న్‌, శ్రీ‌కృష్ణ జ‌న్మ్‌, కాళీయ మ‌ర్ద‌న్ సినిమాలు ఆయ‌న‌కు బాగా పేరు తెచ్చాయి.

'రాజా హ‌రిశ్చంద్ర' సినిమాను ముంబైలో తొలిసారి 1913 మే 3న‌ ప్ర‌ద‌ర్శించిన‌ప్పుడు ప్రేక్ష‌కులు సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు లోన‌య్యారు. ఒక‌సారి చూసిన‌వాళ్లు మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌చ్చి చూశారు. ఆ త‌ర్వాత జ‌రిగింది చ‌రిత్ర‌. మ‌రాఠీ, హిందీ, ఇంగ్లీష్ టైటిల్స్‌తో సైలెంట్ ఫిల్మ్‌గా దీన్ని ఫాల్కే రూపొందించారు. విశ్వామిత్ర మ‌హ‌ర్షికి ఇచ్చిన వాగ్దానం మేర‌కు త‌న రాజ్యాన్నీ, కుటుంబాన్నీ త్యాగం చేసిన హ‌రిశ్చంద్రుడ‌నే రాజు క‌థ ఈ చిత్రం. తెలుగువారికి స‌త్య‌హ‌రిశ్చంద్ర‌గా సుప‌రిచిత‌మైన నాట‌క గాథే ఈ చిత్రం.

ఈ సినిమాకు ఫాల్కే నిర్మాత‌, ద‌ర్శ‌కుడు మాత్రమే కాదు.. స్క్రీన్‌ప్లే రైట‌ర్‌, సెట్ డిజైన‌ర్ కూడా. కెమెరా ముందు ఆడ‌వాళ్లు న‌టించ‌డం త‌ప్ప‌నే అభిప్రాయం నెల‌కొని ఉన్న సామాజిక ప‌రిస్థితుల కార‌ణంగా ఈ మూవీలో స్త్రీ పాత్ర‌ల‌ను కూడా మ‌గ‌వాళ్లే పోషించారు.

50 నిమిషాల నిడివితో ఈ చిత్రాన్ని తీయ‌డానికి 7 నెల‌ల 21 రోజుల స‌మ‌యం ప‌ట్టింది. హ‌రిశ్చందున్ని భార్య తారామ‌తి (మ‌న‌కు చంద్ర‌మ‌తి)గా అన్నా స‌లూంకే అనే వ్య‌క్తి న‌టించాడు. ఆయ‌న ఓ హోట‌ల్‌లో వెయిట‌ర్‌గా ప‌నిచేస్తుండేవాడు. త‌ర‌చుగా ఆ హోట‌ల్‌కు వెళ్తుండే ఫాల్కేకు సున్నితంగా క‌నిపించిన అన్నాను చూసి చంద్ర‌మ‌తి పాత్ర‌కు ఆయ‌న‌ను తీసుకున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. నాలుగు రీళ్ల‌తో తీసిన ఈ సినిమాకు సంబంధించి పూణేలోని నేష‌న‌ల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాలో రెండు రీళ్లే భ‌ద్ర‌ప‌ర‌చ‌బ‌డి ఉన్నాయి.