Read more!

English | Telugu

11 సినిమాల‌కే టాలీవుడ్ టాప్ 2 డైరెక్ట‌ర్ కావ‌డ‌మంటే మాట‌లా.. త్రివిక్ర‌మ్‌!

 

ఆయన డైరెక్ట్ చేసింది 11 సినిమాలు. వాటిలో మెగా కాంపౌండ్ హీరోలతో చేసినవే 6. రానున్న రెండు మూడేళ్లలో ఆయన ఆ హీరోలతో చేయబోతున్న సినిమాలు 3. దీన్నిబట్టే 'మెగా' హీరోలతో ఆయన 'ఎఫైర్' ఎలా నడుస్తూ ఉందో ఊహించుకోవచ్చు. ఆ డైరెక్టర్.. నన్ అదర్ ద్యాన్.. త్రివిక్రమ్. 1999లో కె. విజయభాస్కర్ డైరెక్ట్ చేసిన 'స్వయంవరం' మూవీతో డైలాగ్ రైటర్‌గా పరిచయమై, తొలి సినిమాతోనే.. 'ఎవరీ రైటర్? డైలాగ్స్ భలే రాశాడు' అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ తన గురించి మాట్లాడుకొనేలా చేసిన ఘనుడు త్రివిక్రమ్. ఆ తర్వాత మూడేళ్లకే.. అంటే 2002లోనే డైరెక్టర్‌గా మారి తరుణ్, శ్రియ జంటగా 'నువ్వే నువ్వే' అనే మూవీ తీసి విజయం సాధించాడు. అదివరకు రైటర్‌గా ఆరు సినిమాలకు డైలాగ్స్ రాసినా, వాటిలో 'నువ్వు నాకు నచ్చావ్', 'నువ్వే కావాలి' లాంటి బ్లాక్‌బస్టర్ డైలాగ్ రైటింగ్ సినిమాలున్నా బెస్ట్ రైటర్‌గా నంది అవార్డు పొందలేకపోయిన త్రివిక్రమ్, తన తొలి డైరెక్టోరియల్ ఫిల్మ్ 'నువ్వే నువ్వే'తో బెస్ట్ డైలాగ్ రైటర్‌గా నంది అవార్డ్ అందుకోవడం విశేషం.

'నువ్వే నువ్వే'తో మొదలుకొని ఇప్పటి 'అల.. వైకుంఠపురములో' వరకు త్రివిక్రమ్ క్రియేటివ్ మైండ్‌లోంచి 11 సినిమాలు పుట్టాయి. 'నువ్వే నువ్వే' మూవీని అతడు తీసిన విధానం చూసి, ముచ్చటపడిన మహేశ్.. వెంటనే తనను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. అలా తన సెకండ్ సినిమానే మహేశ్‌తో తీశాడు త్రివిక్రమ్. అది 'అతడు' మూవీ. నందకిశోర్ అలియాస్ పార్థు క్యారెక్టర్‌లో మహేశ్‌ను త్రివిక్రమ్ చూపించిన విధానం, మహేశ్ నుంచి అతను రాబట్టిన అభినయం ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. అందుకే థియేటర్ల కంటే కూడా టీవీలో ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఆ సినిమా విడుదలై 14 ఏళ్లు దాటగా, ఇప్పటికి ఎన్నిసార్లు ఆ సినిమా టెలికాస్ట్ అయ్యిందో లెక్కలేదు. అయినా విసుగులేకుండా ఆ మూవీని జనం చూస్తూనే ఉన్నారు. అదే మహేశ్‌తో మరోసారి జట్టుకట్టి 'ఖలేజా' తీశాడు త్రివిక్రమ్. బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా బిలో యావరేజ్‌గా నిలిచినా, ఆ సినిమాని చాలా స్టైలిష్‌గా తీశాడనీ, నటుడిగా మహేశ్‌లోని కామిక్ యాంగిల్‌ను బాగా ఎలివేట్ చేశాడనీ త్రివిక్రమ్ పేరు తెచ్చుకున్నాడు.

యద్దనపూడి సులోచనారాణి నవల 'మీనా' ఆధారంగా అతను రూపొందించిన 'అ ఆ' సినిమా నితిన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్. తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్టయిన ఆ సినిమా యుఎస్‌ టాప్ టాలీవుడ్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలవడం చెప్పుకోదగ్గ విషయం. అనసూయ అనే పాత్రలో సమంతను అతను చూపించిన విధానం, ఆనంద్ విహారిగా నితిన్‌తో ఆమె కెమిస్ట్రీని పండించిన విధానం ఆడియెన్స్‌ను బాగా అలరించింది. ఇదే నవల ఆధారంగా గతంలో కృష్ణతో విజయనిర్మల రూపొందించిన 'మీనా' సినిమాని మించి 'అ ఆ' ఘనవిజయం సాధించింది.

2018లో జూనియర్ ఎన్టీఆర్‌తో తొలిసారి జట్టుకట్టిన త్రివిక్రమ్, 'అరవింద సమేత.. వీరరాఘవ' సినిమాని రూపొందించాడు. రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో జగపతిబాబును అత్యంత కిరాతకుడైన ఫ్యాక్షనిస్టుగా చూపిస్తూ తీసిన ఈ మూవీ తారక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. పూజా హెగ్డేను అరవిందగా చూపిస్తూ, సీమలో ఫ్యాక్షనిజం లేకుండా చెయ్యడానికి వీరరాఘవ పాత్రలో తారక్ ఏం చేశాడో తనదైన శైలిలో చూపించాడు త్రివిక్రమ్. ఇందులో అతను రాసిన డైలాగ్స్ కానీ, తారక్ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దిన విధానం కానీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి.

ఇప్పుడిక మెగా హీరోలతో త్రివిక్రమ్ సాగిస్తూ వస్తున్న జర్నీ విషయానికి వద్దాం. మెగా హీరోల్లో అతను తొలిసారి డైరెక్ట్ చేసింది.. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో. ఆ సినిమా 2008లో వచ్చిన 'జల్సా'. యాక్షన్ కామెడీ మూవీగా త్రివిక్రమ్ రూపొందించిన ఈ మూవీలో సంజయ్ సాహు క్యారెక్టరులో పవన్‌ను చూపించిన విధానం, ఆ పాత్రను పవన్ చేసిన తీరు, ఆయన చేత త్రివిక్రమ్ చెప్పించిన డైలాగ్స్ ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. అంతేనా.. పవన్, ఇలియానా మధ్య అతను తీసిన సన్నివేశాలు ఆహ్లాదాన్ని పంచాయి. అలా 'జల్సా' నుంచి మెగా హీరోలతో త్రివిక్రమ్ ఎఫైర్ మొదలైంది. ఆ తర్వాత పవన్‌తో అతను తీసిన 'అత్తారింటికి దారేది' ఇండస్ట్రీ హిట్టవడం మనం చూశాం. గౌతం నందాగా పవన్, అతని మేనత్త సునందగా నదియా పాత్రల్ని అతను తీర్చిదిద్దిన విధానం, క్లైమాక్సులో వాళ్ల మధ్య తీసిన సీన్ ప్రేక్షకుల్ని అమితంగా అలరించి ఆ స్థాయి విజయాన్ని అందించింది.

ఆ తర్వాత నాలుగేళ్లకు అల్లు అర్జున్‌తో 'జులాయి' తీశాడు త్రివిక్రమ్. అది అప్పటికి బన్నీ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. రవీంద్ర నారాయణ అలియాస్ రవి పాత్రలో బన్నీ, బిట్టు పాత్రలో సోను సూద్, మధు క్యారెక్టరులో ఇలియానా, ఏసీపీ సీతారం పాత్రలో రాజేంద్రప్రసాద్‌ను అతను చూపించిన తీరు, ఆ పాత్రల మధ్య సన్నివేశాలు ఆడియెన్సును అమితంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత బన్నీతో చేసిన 'సన్నాఫ్ సత్యమూర్తి' భారీ విజయం సాధించకపోయినా అందులో డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. 2020 జ‌న‌వ‌రిలో వచ్చిన 'అల.. వైకుంఠపురములో' సినిమా ఏ రేంజి బ్లాక్‌బస్టర్ అయ్యిందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. బన్నీ చేసిన బంటూ క్యారెక్టర్ ఆడియెన్సును అయస్కాంతంలాగా లాగేసింది. డైలాగ్స్ విపరీతంగా అలరించాయి.

అతి త్వ‌ర‌లోనే అత‌ను మ‌హేశ్‌తో ముచ్చ‌ట‌గా మూడో సినిమాని రూపొందించేందుకు రెడీ అవుతున్నాడు. క‌మ‌ర్షియ‌ల్‌గా 'ఖ‌లేజా' మూవీ అసంతృప్తికి గురిచేయ‌డంతో దాన్ని మ‌ర్చిపోయేలా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టేలా స్క్రిప్టును తీర్చిదిద్దుతున్నాడు. ఇప్ప‌టికే ఆ మూవీలో నాయిక‌గా పూజా హెగ్డేను తీసేసుకున్నాడు. పూజ‌తో త్రివిక్ర‌మ్ వ‌రుస‌గా చేస్తున్న మూడో సినిమా ఇది. కేవ‌లం 11 సినిమాల‌కే టాలీవుడ్‌లో టాప్ 2 డైరెక్ట‌ర్‌గా నీరాజ‌నాలు అందుకోవ‌డం త్రివిక్ర‌మ్‌కే చెల్లింది.