Read more!

English | Telugu

బ్రూస్‌ లీ చిన్న వయసులోనే చనిపోయాడు.. కొడుకు బ్రాండన్‌లీని షూటింగ్‌లో కాల్చి చంపారు!

బ్రూస్‌ లీ.. ఈ పేరు వినని వారు ప్రపంచంలో ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అతనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియకపోయినా.. బ్రూస్‌ లీ అనే వాడు మార్షల్‌ ఆర్ట్స్‌లో నిపుణుడు అని మాత్రం అందరికీ తెలుసు. అమెరికాలో జన్మించి, హాంకాంగ్‌లో పెరిగిన యోధుడు, నటుడు. అతని కుమారుడు కుమారుడు బ్రాండన్‌ లీ, కుమార్తె షానన్‌ లీ కూడా నటులే. 

బ్రూస్‌ లీ అసలు పేరు లీ జాన్‌ ఫాన్‌. అతను తన సినిమాల్లో చైనా సంప్రదాయాలను, జాతీయ గౌరవాన్ని ఎక్కువగా చూపించేవాడు. అందుకే చైనా వారికి బ్రూస్‌లీ అంటే ఎంతో అభిమానం. చైనీయుల సాంప్రదాయ క్రీడ కుంగ్‌ ఫూను లీ తన సినిమాల్లో ఎక్కువగా ప్రదర్శించేవాడు. తొమ్మిది సంవత్సరాల వయసులో ఉండగా తన తండ్రితో కలిసి ద కిడ్‌ (1950) అనే చిత్రంలో నటించాడు. ఇది ఒక కామిక్‌ క్యారెక్టర్‌ ఆధారంగా రూపొందించిన పాత్ర. అదే లీకి మొదటి సినిమా. 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి 20 చిత్రాల్లో నటించాడు. 

వింగ్‌ చున్‌ విధానంలోని వన్‌ ఇంచ్‌ పంచ్‌కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు. 1964లో జరిగిన లాంగ్‌ బీచ్‌ ఇంటర్నేషనల్‌ కరాటే చాంపియన్‌షిప్‌లో మొట్టమొదటిసారి అతను ఈ పంచ్‌ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. వస్తువుకు కేవలం ఒక అంగుళం దూరంలో చేతిని ఉంచి, కనురెప్ప కాలంలో బలమైన పంచ్‌ని విసరడం ఎలా సాధ్యమైందో ఎవరూ గుర్తించలేకపోయారు. చాలాకాలం ఈ విధానంపై అధ్యయనాలు జరిగాయి. చివరికి టెక్నిక్‌తో మాత్రమే ఇది సాధ్యమవుతుందన్న నిర్ధారణకు వచ్చారు. సహజంగా శక్తినంతా కూడగట్టుకొని, చేతిని బలంగా వెనక్కి లాగి విసిరితే తప్ప బలమైన దెబ్బ తగలదు. కానీ, బ్రూస్‌ లీ మందంగా ఉండే చెక్కను సైతం వన్‌ ఇంచ్‌ పంచ్‌తో ముక్కలు చేసేవాడు. ఇప్పుడు అంతర్జాతీయ మార్షల్‌ ఆర్ట్స్‌లో వన్‌ ఇంచ్‌ పంచ్‌ ఒక భాగమైంది. అయితే, అపారమైన అనుభవం ఉన్నవారికే అది సాధ్యమవుతుంది. ఐదు దశాబ్దాల క్రితమే వన్‌ ఇంచ్‌ పంచ్‌ని ప్రపంచానికి పరిచయం చేశాడు బ్రూస్‌ లీ.

బ్రూస్‌ లీ తన కెరీర్‌లో హీరోగా నటించిన సినిమాలు 5. అందులో చివరిది ‘ఎంటర్‌ ది డ్రాగన్‌’. ఈ సినిమా మరో నెల రోజుల్లో రిలీజ్‌ అవుతుందనగా బ్రూస్‌లీ చనిపోయాడు. ‘ఎంటర్‌ ది డ్రాగన్‌’ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుండగా బ్రూస్‌ లీ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా సరైన టైమ్‌లో ట్రీట్‌మెంట్‌ ఇవ్వగలిగారు. ఆ తర్వాత 1973 జూలై 20న నిర్మాత రేమండ్‌ చోతో కలిసి బ్రూస్‌లీ, అతని భార్య డిన్నర్‌కి వెళ్లాల్సి ఉంది. అయితే బ్రూస్‌లీ పడుకొని ఉన్నాడు. అతన్ని లేపేందుకు ప్రయత్నించినా లేవలేదు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతన్ని బ్రతికించేందుకు డాక్టర్లు ప్రయత్నించారు. కానీ, పది నిమిషాల్లోనే బ్రూస్‌ లీ తుది శ్వాస విడిచాడు. 32 సంవత్సరాల అతి చిన్న వయసులో అతను చనిపోవడం అందర్నీ కలచివేసింది. ఇదిలా ఉంటే.. బ్రూస్‌ లీ కుమారుడు బ్రాండన్‌ లీ కూడా 28 సంవత్సరాల అతి చిన్న వయసులోనే చనిపోవడం మరింత బాధాకరం. 1993, మార్చి 31న ‘ది క్రో’ అనే సినిమా షూటింగ్‌లో భాగంగా ఒక యాక్షన్‌ సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది. హీరో క్యారెక్టర్‌ తన అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లోకి రాగానే తనకు కాబోయే భార్యను హింసించడమే కాకుండా అత్యాచారం చేస్తారు దుండగులు. అది చూసి తట్టుకోలేని హీరో ఆ దుండగులపై కలబడతాడు. అదే సమయంలో అతను రివాల్వర్‌తో హీరోను కాలుస్తాడు. అదీ సన్నివేశం. దీని కోసం తెచ్చిన డమ్మీ రివాల్వర్‌ను సరిగా పరీక్షించకపోవడం, టెక్నికల్‌గా అందులో కొన్ని లోపాలు వుండడంతో అది ఒరిజినల్‌ రివాల్వర్‌లాగే ఆ సమయంలో పనిచేసింది. ఆ సన్నివేశంలో విలన్‌ బ్రాండన్‌లీని కాల్చడంతో అతను వెనక్కి పడిపోయాడు. కట్‌ చెప్పిన తర్వాత కూడా లేవకపోవడంతో దగ్గరకు వెళ్లి పరిశీలించారు. అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టు గుర్తించిన యూనిట్‌ సభ్యులు బ్రాండన్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కొద్ది సేపటికి అతను తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది. 

బ్రూస్‌లీ తన కెరీర్‌లో చేస్తున్న ఐదో సినిమా ‘ఎంటర్‌ ది డ్రాగన్‌’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుండగా చనిపోయాడు. అతని కెరీర్‌లో అదే భారీ బడ్జెట్‌ సినిమా. అలాగే బ్రాండన్‌ లీ కూడా అప్పటివరకు హీరోగా ఐదు సినిమాల్లో నటించాడు. ఐదో సినిమా ‘ది క్రో’. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే అతను చనిపోయాడు. బ్రాండన్‌ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో సినిమా ఇదే. తండ్రీకొడుకులు చనిపోయే సమయానికి ఐదో సినిమా షూటింగ్‌లో ఉండడం, అది కూడా భారీ బడ్జెట్‌ సినిమాలు కావడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. బ్రూస్‌లీ సమాధి పక్కనే బ్రాండన్‌ లీ సమాధిని కూడా ఏర్పాటు చేశారు.