English | Telugu

'కాంతార' హీరో ఒకప్పుడు వాటర్ బాటిల్స్ అమ్ముకొనేవాడని మీకు తెలుసా?

 

రిషబ్ శెట్టి 12 సంవత్సరాల క్రితం తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, ప్రతి ఒక్కరూ తనతో కలిసి పనిచేయాలని కోరుకునేంత పెద్ద స్టార్ అవుతాడని ఎప్పుడూ ఎవరూ అనుకోలేదు. కానీ నేడు రిషబ్ శెట్టి ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. 'కాంతార'లో రిషబ్ శెట్టి అద్భుతంగా నటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. హీరోగా నటించడమే కాకుండా కథను రాసి దర్శకత్వం వహించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చిత్రం నేడు అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ భాషా చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. నెల రోజుల్లో 'కాంతార' ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రిషబ్ శెట్టి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బయటి వ్యక్తి. ఇండస్ట్రీలోకి రాకముందు అతనికి ఎలాంటి సినిమా సంబంధాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో రిషబ్ శెట్టి సొంతంగా కష్టపడి సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న తీరు ఎంతైనా అభినందనీయం. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి, రజనీకాంత్, కమల్‌హాసన్‌ దశాబ్దాలుగా ఆధిపత్యం చలాయిస్తూ రాగా, ఇప్పుడు అల్లు అర్జున్‌, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, యష్‌, విజయ్‌ సేతుపతి వంటి స్టార్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అయితే వీరందరి మధ్య రిషబ్ శెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రిషబ్ శెట్టి సినిమా ప్రయాణం, విజయగాథ చాలా క్లిష్టతరమైంది.  

ఇండస్ట్రీలో సత్తా ఉంటే రెప్పపాటులో విజయం సాధించవచ్చని నిరూపించిన వారిలో రిషబ్ శెట్టి ఒకడు. చాలా సంవత్సరాలు కష్టపడి, ఈ రోజు ప్రతి ఒక్కరూ తనతో కలిసి పనిచేయాలని కోరుకునేలా తనను తాను తీర్చిదిద్దుకున్నాడు. రిషబ్ శెట్టి గురించి బాలీవుడ్‌లోనూ చర్చ జరుగుతోంది. అయితే ఈ స్థాయిని అందుకోవడానికి రిషబ్ 18 ఏళ్ల పాటు కష్టపడాల్సి వచ్చిందని చాలా మందికి తెలియదు. నటుడు కావాలనేది రిషబ్ శెట్టి కల. కాలేజీ చదువు పూర్తి చేసిన తర్వాత నటనా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నాడు.  

ఒక వైపు చదువుకుంటూనే ఇంకోవైపు వాటర్ బాటిల్స్ అమ్ముతూ, హోటళ్లలో పనిచేస్తూ వచ్చాడు. తన కలను నెరవేర్చుకోవడానికి రిషబ్ శెట్టి రంగస్థలంపై అడుగుపెట్టాడు. తన మొదటి నాటకాన్ని కుందాపురలో ఆడాడు. క్రమంగా రిషబ్ శెట్టి మరిన్ని నాటకాల్లో పనిచేయడం ప్రారంభించాడు. రిషబ్ నటనను జనాలు బాగా మెచ్చుకున్నారు. దీంతో ప్రోత్సాహం లభించిన రిషన్ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నాడు. కాలేజీ రోజుల్లో రిషబ్ శెట్టి చదువుకోవడంతోపాటు చిన్నచిన్న పనులు చేసుకునేవాడు. వాటర్ బాటిళ్లు అమ్మడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పనిచేశాడు. కొంతకాలం హోటల్‌లోనూ పనిచేశాడు. ఈ పనులతో పాటు, సినిమాల కోసం కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 

రిషబ్ శెట్టికి 2004లో సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. చిత్రం పేరు నామ్ ఏరియాలి ఒండినా, ఇందులో అతడి పాత్రకు పేరు కూడా లేదు. అయినప్పటికీ దానిని సంతోషంగా అంగీకరించి చేశాడు. అలా కొన్నాళ్ల పాటు అనేక ఇతర చిత్రాలలో అనామక, చిన్న పాత్రలు పోషించాడు. నటునిగా రిషబ్ శెట్టి 18 ఏళ్ల పోరాట గాథలోని బాధ ఒక ఇంటర్వ్యూలో ప్రతిబింభించింది. "నేను ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు అయ్యింది. 2004లో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాను. మొదటి సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఆ సినిమా పేరు 'సైనైడ్'. ఆ తర్వాత మరిన్ని సినిమాలు చేశాను. డైరెక్షన్‌లో మెళకువలు నేర్చుకున్నాను. కొన్ని సినిమాల్లో బిచ్చగాడిగా, హీరో స్నేహితుల్లో ఒకడైగా నటించాను." అని చెప్పాడు. 

2018 వరకు సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించిన రిషబ్ 2019లో లీడ్ హీరోగా మారాడు. అతను హీరోగా నటించిన తొలి చిత్రం ‘బెల్ బాటమ్’. దీని తర్వాత కూడా రిషబ్ చిన్న పాత్రల్లో నటించాడు. 2021లో 'కాంతార’ సినిమా కథ అనుకున్నాడు. ఆ సినిమా కథ రాసి తానే నటించాలని నిర్ణయించుకున్నాడు. 'కాంతార' కథ కోసం తన ఊరిలో ఆడె భూతకోలను, ఇతర జానపద కథలను ఉపయోగించుకున్నాడు.

రిషబ్ శెట్టి కావాలంటే 'కాంతార'కి వేరే ఏ దర్శకుడినైనా తీసుకొని ఉండేవాడు. కానీ తను ఊహించినట్లుగా మరెవరూ ఆ కథకు న్యాయం చెయ్యలేరని భావించాడు. అందుకే తనే 'కాంతార' చిత్రానికి దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాడు. మొదట కన్నడిగుల కోసమే ఆ సినిమా తీశాడు. కానీ విపరీతమైన డిమాండ్ కారణంగా 'కాంతార'ని తెలుగు, హిందీలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఇవాళ తన ఈ సినిమా ఇన్ని రికార్డులు సృష్టిస్తుందని కానీ, తనను పాన్ ఇండియా స్టార్‌ని చేస్తుందని కానీ అతను ఊహించలేదు.