English | Telugu

సౌంద‌ర్య‌కు రిప్లేస్‌మెంట్ లేద‌ని 'న‌ర్త‌న‌శాల‌'ను ఆపేసిన బాల‌కృష్ణ‌!

నంద‌మూరి బాల‌కృష్ణ క‌ల‌ల ప్రాజెక్ట్‌.. 'న‌ర్త‌న‌శాల‌'. డైరెక్ట‌ర్‌గా అవ‌తార‌మెత్తి ఆయ‌న రూపొందించ తల‌పెట్టిన తొలి య‌త్నం.. 'న‌ర్త‌న‌శాల‌'. రామోజీ ఫిల్మ్ సిటీలో ప‌ర్ణ‌శాల సెట్ వేసి, ఒక షెడ్యూల్ షూటింగ్ జ‌రిపాక‌, అర్ధంత‌రంగా ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కార‌ణం.. చాలామందికి తెలిసిందే.. సౌంద‌ర్య అకాల మృతి! 'న‌ర్త‌న‌శాల‌'లో ద్రౌప‌ది పాత్ర‌ధారి సౌంద‌ర్య‌. 2004 ఏప్రిల్ 17 బెంగ‌ళూరు నుంచి క‌రీంన‌గ‌ర్‌కు ఎయిర్‌క్రాఫ్ట్‌లో అన్న‌య్య అమ‌ర‌నాథ్‌తో క‌లిసి బ‌య‌లుదేరిన ఆమె, అది టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల‌కే మంట‌ల్లో చిక్కుకుని అన్న‌య్య‌తో పాటు అగ్నికి ఆహుత‌య్యారు. దాంతో బాల‌కృష్ణ 'న‌ర్త‌న‌శాల' ప్రాజెక్ట్‌నే ఆపేశారు. అప్ప‌టికి తీసింది కొద్ది సీన్లే. సౌంద‌ర్య స్థానంలో మ‌రొక‌ర్ని తీసుకొని ఆ సినిమాని చేయ‌వ‌చ్చు. కానీ ద్రౌప‌దిగా సౌంద‌ర్య స్థానంలో మ‌రొక‌ర్ని తాను ఊహించుకోలేన‌ని బాల‌య్య చెప్పేశారు.

అదివ‌ర‌కు బాల‌కృష్ణ‌, సౌంద‌ర్య క‌లిసి చేసింది ఒకే సినిమా.. 'టాప్ హీరో'. అయిన‌ప్ప‌టికీ బాల‌కృష్ణ‌ను ఏక‌వ‌చ‌నంతో పిలిచేంత‌గా ఆ ఇద్ద‌రిమ‌ధ్య స్నేహం ఏర్ప‌డింది. ఆయ‌న‌ను సౌంద‌ర్య 'బాలా' అని పిలిచేశారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా బాల‌య్యే చెప్పారు. "ఎక్క‌డ క‌నిపించినా న‌న్ను బాలా అని ఏక‌వ‌చ‌నంతో పిలిచేది సౌంద‌ర్య‌. మామ‌ధ్య అంత ఎఫెక్ష‌న్ ఉండేది. 'న‌ర్త‌న‌శాల' చిత్రంలో ద్రౌప‌ది పాత్ర చెయ్య‌మ‌ని అడిగిన‌ప్పుడు నామీద ఉన్న న‌మ్మ‌కంతో, నా ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌న్న అభిప్రాయంతో, ద్రౌప‌ది పాత్ర మీద ఉన్న ఇష్టంతో సహృద‌యంతో వెంట‌నే అంగీక‌రించింది." అని బాల‌కృష్ణ చెప్పారు.

రేపు షూటింగ్ ప్రారంభోత్స‌వం అనంగా, ముందురోజు గెట‌ప్ వేసుకొని వ‌చ్చి మ‌రీ ఆయ‌న‌కు చూపించారు సౌంద‌ర్య‌. "తొలిసారి పౌరాణిక పాత్ర చేస్తున్నందుకు గెట‌ప్ ఎలా ఉందో ముందే చూసుకోవాలి అన్న త‌ప‌న‌తో స్పెష‌ల్ ఇంట్రెస్ట్ తీసుకుంది. ఈ త‌రం న‌టీమ‌ణుల్లో అంత‌టి డెడికేష‌న్ నేనెవ‌రిలోనూ చూడ‌లేదు. అలాగే నాలుగు రోజులు అనుకున్న షెడ్యూల్‌ను సౌంద‌ర్య ఒక‌టిన్న‌ర రోజుల్లో పూర్తిచేసింది. సింగిల్ టేక్‌లో ప్ర‌తి డైలాగ్‌ను ఓకే అయ్యేలా చేసింది." అని బాల‌కృష్ణ గుర్తుచేసుకున్నారు.

సౌంద‌ర్య వ్య‌క్తిత్వాన్ని కానీ, అభిన‌యాన్ని కానీ, ప్ర‌వ‌ర్త‌న‌ని కానీ తార‌లంతా ఆద‌ర్శంగా తీసుకోవాలంటారాయ‌న‌. "నా దృష్టిలో ఉత్త‌మ న‌ట‌న‌కు, స‌త్ప్ర‌వ‌ర్త‌న‌కు, గొప్ప వ్య‌క్తిత్వానికి సౌంద‌ర్య ఓ కొల‌మానం. క‌న్న‌డ అమ్మాయి అయివుండి మ‌న తెలుగువారి గుండెల్లో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సౌంద‌ర్య‌ని ఎప్ప‌టికీ మ‌ర‌వ‌లేం." అని అన్నారు బాల‌య్య‌. సౌంద‌ర్య అన్నా, ఆమె న‌ట‌న అన్నా అంతటి గౌర‌వాభిమానాలు ఉన్నందునే ఆయ‌న 'న‌ర్త‌న‌శాల‌'ను మ‌రో న‌టితో చేయ‌లేక‌పోయారు.