English | Telugu

ఇండస్ట్రీ హిట్స్ విషయంలో.. ఆ రికార్డ్ బి. గోపాల్ దే!


అగ్ర దర్శకుడు బి. గోపాల్ పేరు వినగానే.. మనకు ఆయన తీసిన భారీ బడ్జెట్ మూవీస్ నే ఠక్కున గుర్తుకువస్తాయి. వీటిలో చాలా మటుకు బ్లాక్ బస్టర్ బాట పట్టాయి. ఇంకొన్నైతే.. అంతకుమించి అన్నట్లుగా 'ఇండస్ట్రీ హిట్స్'గా నిలిచాయి. గోపాల్ కి ముందు, తరువాత కూడా కొందరు దర్శకులు ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. అయితే, తక్కువ గ్యాప్ లో (మూడున్నరేళ్ళ వ్యవధిలో) ముచ్చటగా మూడు ఇండస్ట్రీ హిట్స్ చూసిన రికార్డ్ మాత్రం బి. గోపాల్ దే. అంతేకాదు.. తెలుగు చిత్ర పరిశ్రమకి వరుసగా మూడు ఇండస్ట్రీ హిట్స్ అందించిన ఘనత కూడా బి. గోపాల్ దే.

ఆ వివరాల్లోకి వెళితే.. నటసింహ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో బి. గోపాల్ తీసిన 'సమరసింహారెడ్డి' (1999) ఇండస్ట్రీ హిట్ గా నిలవగా.. ఆపై అదే బాలయ్యతో బి. గోపాల్ రూపొందించిన 'నరసింహనాయుడు' (2001) కూడా అదే బాట పట్టింది. ఈ రెండు సినిమాలు కూడా రెండేళ్ళ వ్యవధిలో సంక్రాంతి సీజన్ లోనే రిలీజయ్యాయి. అలాగే.. మెగాస్టార్ చిరంజీవితో బి. గోపాల్ తెరకెక్కించిన 'ఇంద్ర' కూడా ఇండస్ట్రీ హిట్ గా రికార్డులకెక్కింది. గోపాల్ పుట్టినరోజు సందర్భంగా 2002 జూలై 24న 'ఇంద్ర' జనం ముందు నిలిచింది. 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'ఇంద్ర'.. ఇలా టాలీవుడ్ మూడు వరుస ఇండస్ట్రీ హిట్స్ కి ఒకరే దర్శకుడు కావడం.. ఇవి కేవలం మూడున్నరేళ్ళ వ్యవధిలో రిలీజ్ కావడం రికార్డనే చెప్పాలి. కొసమెరుపు ఏమిటంటే.. ఈ మూడు ఇండస్ట్రీ హిట్స్ కి కూడా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందించారు.

(జూలై 24.. బి. గోపాల్ పుట్టినరోజు సందర్భంగా)