English | Telugu

రంభ‌, మాధ‌వి, రిచా: ఇండ‌స్ట్రీని వ‌దిలి అబ్రాడ్‌లో సెటిలైన తార‌లు!

ఒకానొక కాలంలో ప్రేక్ష‌కుల హృద‌యాలను దోచుకొని, వారి క‌ల‌ల రాణుల్లాగా చ‌లామ‌ణీ అయిన అందాల తార‌లు ఎంద‌రో. ఇప్పుడు వారిలో కొంత‌మంది ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. త‌మ అందంతో, అభిన‌యంతో ఇండ‌స్ట్రీని ఏలిన వాళ్లు, కొంత‌కాలం త‌ర్వాత ఆ ఇండ‌స్ట్రీని వ‌దిలి, అభిమానుల‌కు ప్ర‌త్య‌క్షంగా క‌నిపించ‌నంత దూరం వెళ్లిపోయి, అబ్రాడ్‌లో సెటిల‌య్యారు.

మాధ‌వి, మీనాక్షి శేషాద్రి, రంభ‌, శిల్పా శిరోద్క‌ర్‌, మ‌ల్లికా షెరావ‌త్‌, ప్రీతీ జింటా, రిచా గంగోపాధ్యాయ్ లాంటి తార‌లు ఫిల్మ్ ఇండ‌స్ట్రీతో పాటు దేశాన్ని కూడా విడిచిపెట్టి విదేశాల్లో స్థిర‌ప‌డ్డారు. ఎవ‌రెవ‌రు ఎక్కడెక్క‌డ‌ సెటిల‌య్యారో ఓ లుక్కేద్దాం...

మాధ‌వి


తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో 1980, 90ల‌లో హీరోయిన్‌గా రాణించి, కృష్ణ‌, ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి, అమితాబ్, రాజ్‌కుమార్‌, మోహ‌న్‌లాల్‌, మ‌మ్ముట్టి, లాంటి అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించిన మాధ‌వి పెళ్లి చేసుకొని, ఇండ‌స్ట్రీకి గుడ్‌బై చెప్పేసి, విదేశాల్లో స్థిర‌పడింది. ప్ర‌స్తుతం ఆమె యుఎస్ఎలోని న్యూజెర్సీలో భ‌ర్త రాల్ఫ్ శ‌ర్మ‌తో హాయిగా సంసార జీవితం గ‌డుపుతోంది. రాల్ఫ్ జ‌న్మ‌తః ఇండో-జ‌ర్మ‌న్‌. మ‌రో చ‌రిత్ర‌, ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌, చ‌ట్టానికి క‌ళ్లు లేవు, ఖైదీ, దొంగ మొగుడు, మాతృదేవోభ‌వ‌ లాంటి సినిమాలతో మాధ‌వి ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసింది.

మీనాక్షి శేషాద్రి


బాలీవుడ్ 'దామిని'గా పేరుపొందిన మీనాక్షి శేషాద్రి కూడా 1980, 90ల కాలంలో అనేక సూప‌ర్‌హిట్ సినిమాల్లో నాయిక‌గా న‌టించింది. తెలుగులో ఎన్టీఆర్ మూవీ 'బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర‌'లో మేన‌క‌గా, 'ఆప‌ద్బాంధ‌వుడు'లో చిరంజీవి జోడీగా న‌టించి ఆక‌ట్టుకుంది. 1995లో హ‌రీశ్ మ‌సూర్‌ను వివాహం చేసుకొనేనాటికి కెరీర్‌లో ఆమె అత్యున్న‌త స్థానంలో ఉంది. పెళ్ల‌య్యాక ఇండ‌స్ట్రీని వ‌దిలేసి, భ‌ర్త‌తో క‌లిసి యుఎస్ఎ వెళ్లిపోయింది. ప్ర‌స్తుతం ఆమె టెక్సాస్‌లో నివాసం ఉంటోంది.

రంభ‌


తెలుగులో కృష్ణ‌, చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేశ్ లాంటి అగ్ర‌హీరోల స‌ర‌స‌న ప‌లు సూప‌ర్‌హిట్ సినిమాల్లో న‌టించి, గ్లామ‌ర‌స్ హీరోయిన్‌గా పేరుపొందిన రంభ వివాహానంత‌రం సినిమాల‌కు స్వ‌స్తి చెప్పేసింది. కొన్నేళ్లుగా కెన‌డాలో నివాసం ఉంటోంది. ఎన్నారై బిజినెస్‌మ్యాన్ ఇంద్ర‌కుమార్‌ను పెళ్లాడిన ఆమెకు ఇద్ద‌రు కూతుళ్లు, ఒక కుమారుడు.

శిల్పా శిరోద్క‌ర్‌


మోహ‌న్‌బాబు జోడీగా న‌టించిన 'బ్ర‌హ్మ‌'తో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది శిల్పా శిరోద్క‌ర్‌. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా అదే. ఆమె మ‌హేశ్ భార్య న‌మ్ర‌త‌కు స్వ‌యానా అక్క‌. బాలీవుడ్‌లో స‌ల్మాన్ ఖాన్‌, గోవిందా లాంటి స్టార్స్ స‌ర‌స‌న న‌టించింది. 2000లో అప‌రేష్ రంజిత్‌తో వివాహం త‌ర్వాత సినిమాల‌కు గుడ్‌బై చెప్పి, దుబాయ్‌లో సెటిలైంది. ప‌ద‌మూడేళ్ల విరామంతో టీవీ షోస్‌లోకి అడుగుపెట్టింది.

ప్రీతీ జింటా


సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి ప్రీతీ జింటా 'ప్రేమంటే ఇదేరా' సినిమాలో వెంక‌టేశ్ జోడీగా న‌టించ‌డం ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. మ‌హేశ్ హీరోగా ప‌రిచ‌య‌మైన చిత్రం 'రాజ‌కుమారుడు'లో ప్రిన్సెస్‌ ఆమే. ప్ర‌ధానంగా బాలీవుడ్ సినిమాల్లోనే న‌టించిన ఆమె చివ‌ర‌గా బాబీ డియోల్ స‌ర‌స‌న 'భ‌య్యాజీ సూప‌ర్‌హిట్' (2018) మూవీలో క‌నిపించింది. ప్ర‌స్తుతం ఆమె భ‌ర్త జీన్ గుడ్ఎన‌ఫ్‌తో క‌లిసి లాస్ ఏంజెల్స్‌లో ఉంటోంది.

మ‌ల్లికా షెరావ‌త్‌


'మ‌ర్డ‌ర్' మూవీ ద్వారా ఓవ‌ర్‌నైట్ స్టార్ అయిపోయిన తార మ‌ల్లికా షెరావ‌త్‌. మొద‌ట డిల్లీకి చెందిన పైల‌ట్ క‌ర‌ణ్ సింగ్ గిల్‌ను పెళ్లాడి, ఆ వివాహాన్ని ర‌హ‌స్యంగా ఉంచింది. త‌ర్వాత అత‌నికి విడాకులిచ్చేసింది. 2017లో ఫ్రెంచ్ రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్ సిరిల్లే ఆక్జెన్‌ఫాన్స్‌తో డేటింగ్ చేసింది. ప్ర‌స్తుతం లాస్ ఏంజెల్స్‌లో నివాసం ఉంటూ, త‌న ల‌గ్జ‌రియ‌ల్ హౌస్ నుంచి ఫొటోల‌ను షేర్ చేస్తోంది.

రిచా గంగోపాధ్యాయ్‌


ఢిల్లీలో పుట్టి, యుఎస్ఎలోని మిచిగాన్‌లో పెరిగి, అక్క‌డే చ‌దువుకున్న రిచా గంగోపాధ్యాయ్‌.. 'లీడ‌ర్' మూవీతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత వెంక‌టేశ్‌తో 'నాగ‌వ‌ల్లి', ర‌వితేజ‌తో 'మిర‌ప‌కాయ్‌', ప్ర‌భాస్‌తో 'మిర్చి' సినిమాలు చేసింది. నాగార్జున స‌ర‌స‌న న‌టించిన 'భాయ్' త‌ర్వాత సినిమాల‌కు ఫుల్‌స్టాప్ పెట్టి, ఎంబీఏ చ‌ద‌వ‌డం కోసం 2013లో యుఎస్ఎకు తిరిగి వెళ్లిపోయింది. ఎంబీఏ చ‌దివేప్పుడు క్లాస్‌మేట్ జో లాంగెల్లాతో ప్రేమ‌లోప‌డి పెళ్లిచేసుకొని, అక్క‌డే స్థిర‌ప‌డిపోయింది. ఈ ఏడాది మేలో పండంటి కొడుకుకు జ‌న్మనిచ్చింది.