English | Telugu

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్‌ కమెడియన్‌ స్టేటస్‌ తెచ్చుకున్న ఏకైక నటి శ్రీలక్ష్మీ!

(జూలై 20 నటి శ్రీలక్ష్మీ పుట్టినరోజు సందర్భంగా..)

సాధారణంగా కమెడియన్స్‌ స్క్రీన్‌ మీద కనిపిస్తే చాలు ప్రేక్షకుల మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. తెలుగు సినిమా ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎంతో మంది కమెడియన్స్‌ ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తారు. కానీ, అలా ఎంతో మంది లేడీ కమెడియన్స్‌ కూడా పేరు తెచ్చుకున్నారు. అయితే నటి శ్రీలక్ష్మీ మాత్రం ప్రత్యేకం. ఇప్పటివరకు ఏ లేడీ కమెడియన్‌కి దక్కని విశేషమైన పేరు ఆమె సొంతం. ఆమె అమాయకత్వం, డైలాగులు చెప్పే విధానం, మేనరిజమ్స్‌, బాడీ లాంగ్వేజ్‌... ఇవన్నీ ఆమెను ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాయి. దాదాపు రెండు దశాబ్దాలపాటు కమెడియన్‌గా స్టార్‌ స్టేటస్‌ను చూశారు శ్రీలక్ష్మీ.

శ్రీలక్ష్మీ అసలు పేరు ఐశ్వర్యలక్ష్మీ ప్రియ. ఈమె మద్రాస్‌లోనే పుట్టి పెరిగారు. తండ్రి అమరనాథ్‌ కూడా నటుడే. ఆయనకు ఎనిమిది మంది సంతానం వారిలో శ్రీలక్ష్మీ, తమ్ముడు రాజేష్‌ సినిమా పరిశ్రమలో స్థిరపడ్డారు. ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తొలి సినిమా అమర సందేశంలో అమరనాథ్‌ హీరోగా నటించారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత అతనికి చిన్న వేషాలు వచ్చినా హీరోగా మాత్రమే చేస్తానని చెప్పడంతో అవకాశాలు రాలేదు. ఆ తర్వాత తనే హీరోగా ఒక సినిమా నిర్మించారు. అది విజయం సాధించకపోవడంతో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఆ పరిస్థితుల్లో కూడా మరో సినిమా ప్రారంభించారు. కానీ, డబ్బు లేకపోవడం వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కుటుంబం గడవడమే కష్టంగా మారింది. ఎనిమిది మంది సంతానంలో శ్రీలక్ష్మీ అందంగా ఉండడంతో ఆమెను సినీ నటిని చెయ్యాలని తల్లి అనుకుంది. అలా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు శ్రీలక్ష్మీ.

ఒకప్పటి నటుడు అమరనాథ్‌ కుమార్తె కావడంతో కె.విశ్వనాథ్‌, బాపు వంటి డైరెక్టర్లు ఆమెకు హీరోయిన్‌గా అవకాశాలు ఇవ్వాలని ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నాలు సక్సెస్‌ అవ్వలేదు. కెరీర్‌ ప్రారంభంలో కొండవీటి సింహం, గోపాలకృష్ణుడు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశం వచ్చింది. ఆ సమయంలోనే దర్శకుడు కె.బాపయ్య.. ‘హీరోయిన్‌గా కంటే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అయితే నువ్వు సక్సెస్‌ అవుతావు’ అని చెప్పి నివురుగప్పిన నిప్పు అనే సినిమాలో ఒక కామెడీ క్యారెక్టర్‌ ఇచ్చారు. ఆ క్యారెక్టర్‌ శ్రీలక్ష్మీకి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన రెండు జెళ్ళ సీత చిత్రంలో సుత్తివేలు కాంబినేషన్‌లో ఒక క్యారెక్టర్‌ చేసే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా తర్వాత తను కామెడీ చెయ్యగలనన్న కాన్ఫిడెన్స్‌ శ్రీలక్ష్మీకి వచ్చింది. ఆ తర్వాత జంధ్యాల చేసిన ప్రతి సినిమాలోనూ శ్రీలక్ష్మీ కోసం ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్‌ క్రియేట్‌ చేసేవారు. అలా వరసగా నాలుగు స్తంభాలాట, అమరజీవి, పుత్తడిబొమ్మ వంటి సినిమాల్లోనూ మంచి పాత్రలు లభించాయి. ఆమె నటన చూసి చిత్ర పరిశ్రమకు మరో కొత్త హాస్యనటి వచ్చిందని అంతా సంతోషించారు. ఆ తర్వాత జంధ్యాల చేసే ప్రతి సినిమాలోనూ శ్రీలక్ష్మీకి ప్రత్యేకమైన మేనరిజం ఉండే క్యారెక్టర్లు ఇస్తూ వచ్చారు. వేరే డైరెక్టర్ల సినిమాలు చేస్తూనే జంధ్యాల మార్కు కామెడీ క్యారెక్టర్లు పోషించి ఎంతో పాపులర్‌ అయిపోయారు. కమెడియన్‌గా స్టార్‌ స్టేటస్‌ తెచ్చుకున్నారు. శ్రీలక్ష్మీ తరహాలో కామెడీ చేసిన నటి ఆమె తర్వాత మరొకరు ఇండస్ట్రీకి రాలేదు.

రెండు జెళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, రెండు రెళ్ళు ఆరు, జయమ్ము నిశ్చయమ్మురా, స్వర్ణకమలం, బంధువులొస్తున్నారు జాగ్రత్త, చెవిలోపువ్వు, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, జంబలకిడి పంబ, శుభలగ్నం.. ఇలా ఒకటేమిటి లెక్కకు మించిన సినిమాల్లో తన హాస్యంతో ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టిన నటి శ్రీలక్ష్మీ. 40 సంవత్సరాల సినీ కెరీర్‌లో 500కి పైగా సినిమాల్లో కామెడీ క్యారెక్టర్లు చేసిన ఘనత శ్రీలక్ష్మీకి దక్కుతుంది. ఈమె సోదరుడు రాజేష్‌ కూడా నటుడే. కొన్ని సినిమాల్లో హీరోగానూ, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. 40 సినిమాల్లో నటించిన రాజేష్‌ 38 ఏళ్ళ అతి చిన్న వయసులో మరణించారు. ఇప్పుడు ఆయన కుమార్తె ఐశ్వర్యారాజేష్‌ తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంటోంది.

అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్న శ్రీలక్ష్మీ టీవీ సీరియల్స్‌ మాత్రం బిజీగానే వున్నారు. ఇప్పటివరకు దాదాపు 20 సీరియల్స్‌లో వివిధ పాత్రలు పోషించారు. సినిమాల్లో ఆమె పోషించిన కామెడీ పాత్రలకు నాలుగు సార్లు ఉత్తమ హాస్యనటిగా నంది అవార్డులు అందుకున్నారు.